సాక్షి, హైదరాబాద్ : తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాబోయే పది పన్నెండేళ్లలో మైనారిటీ వర్గాల్లో విద్యాపరంగా విప్లవాత్మక మార్పులు వస్తాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన దావత్–ఏ–ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేసి గురుకులాల్లో ఉచిత విద్య, వసతి అందిస్తున్నామన్నారు. తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యార్థులు నాసా వరకు వెళ్లి వచ్చారని పేర్కొన్నారు. అన్ని అంశాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని, ప్రగతిపథంలో దూసుకెళ్తోందని చెప్పారు. ‘‘దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా మైనారిటీ సంక్షేమానికి పెద్దపీట వేశాం. దేశం మొత్తమ్మీద మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.4 వేల కోట్లు కేటాయిస్తే.. తెలంగాణలో రూ.2 వేల కోట్లు కేటాయించాం. ఈ బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో ఖర్చు చేస్తాం’’అని అన్నారు.
రాజస్తాన్‌లో హైదరాబాద్ రుబాత్
అల్లా కృపతో తెలంగాణ సాధించగలిగామని సీఎం అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అల్లాను వేడుకున్నామని, అజ్మీర్ షరీఫ్ దర్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు జరిపామన్నారు. దేవుడు న్యాయమైన కోరికను కరుణించడంతో రాష్ట్రం సిద్ధించిందన్నారు. మక్కా మదీనాలో మాదిరిగా రాజస్తాన్‌లోని అజ్మీర్ షరీఫ్‌లో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో హైదరాబాద్ రుబాత్ భవన సముదాయాన్ని నిర్మిస్తామన్నారు. ఇందుకు రాజస్తాన్ ప్రభుత్వం 8 ఎకరాల భూమి కేటాయించిందని, త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. తెలంగాణ నుంచి ప్రత్యేక రైలు వేసి 31 జిల్లాల నుంచి ముస్లింలను శంకుస్థాపన కార్యక్రమానికి తీసుకెళ్తామన్నారు.
హైదరాబాద్‌లో సుమారు 10 ఎకరాల్లో ఇస్లామిక్ సెంటర్‌ను నిర్మించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఎస్సీ, ఎస్టీలతో సమానంగా మైనారిటీ వర్గాలకు కూడా అన్ని పథకాలు వర్తింపచేసినట్లు వివరించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందన్నారు. దేశంలో మైనారిటీ వర్గాలు సంక్షేమానికి బడ్జెట్‌లో పెద్దపీట వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. ఈ ఇఫ్తార్ విందులో మండలి చైర్మన్ స్వామి గౌడ్, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment