సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులకు సంబంధించి అన్ని రకాల బాధ్యతలను వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవోలు) చూసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ‘‘తమ క్లస్టర్ పరిధిలోని ఐదు వేల ఎకరాలకు సంబంధించి సమగ్ర సమాచారం ఏఈవోల వద్ద ఉండాలి. ప్రతి రైతు వివరాలు ఉంచుకోవాలి. ఏ పంట ఎప్పుడు వేయాలో, ఏ భూమికి ఏ పంట అనుకూలమో రైతులకు సూచించాలి. పంటలకు రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో మార్కెటింగ్ అవకాశాలను పర్యవేక్షించాలి. రైతులెవరైనా మరణిస్తే.. వారికి సంబంధించి బీమా క్లెయిమ్ దగ్గరి నుంచి నామినీకి సొమ్ము అందేవరకు బాధ్యత తీసుకోవాలి. ఏఈవోలు అధికారుల్లా కాకుండా రైతులకు ఒక విధమైన ప్రోత్సాహకర్తల్లా వ్యవహరించాలి. టీమ్ లీడర్లలాగా పనిచేయాలి..’’అని సూచించారు. కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో వ్యవసాయ శాఖపై మంత్రులు, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు.
వ్యవసాయం లాభసాటి చేయాలి..
రైతులు మూస పద్ధతిలో, సాంప్రదాయ విధానాల్లో పంటలు పండిస్తున్నారని.. ఏఈవోలు ఈ పరిస్థితిని మార్చాలని, లాభసాటిగా పంటలు పండించే నైపుణ్యాన్ని కల్పించాలని కేసీఆర్ సూచించారు. రాష్ట్రంలోకి పూలు, పళ్లు, కూరగాయలను దిగుమతి చేసుకునే పరిస్థితిని నివారించి.. మనమే ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని చెప్పారు. వ్యవసాయం లాభసాటి అయ్యేంతవరకు ఆ శాఖ మంత్రి, రైతు సమన్వయ సమితులు నిర్విరామంగా కృషి చేయాలన్నారు. పాలమూరు, సీతారామ, కాళేశ్వరం ప్రాజెక్టులు పూర్తయి నీరు రావడం మొదలైతే... తెలంగాణ వ్యవసాయపరంగా దేశంలోనే ప్రథమ శ్రేణి రాష్ట్రం అవుతుందని పేర్కొన్నారు. పంట కాలనీల ఏర్పాటు, వ్యవసాయ యాంత్రీకరణ, ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్) యూనిట్ల ఏర్పాటు దిశగా ఏఈవోలు కృషి చేయాలని సూచించారు. ‘రైతు బీమా’పథకానికి సంబంధించి సోమవారం హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో ఏఈవోలు, జిల్లా వ్యవసాయాధికారులు, రైతు సమన్వయ సమితి కో–ఆర్డినేటర్లతో విస్తృత స్థాయి సమావేశం జరగనుందని.. అందులో ఈ అంశాలను సమగ్రంగా చర్చించాలని సూచించారు. ఆ కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటున్నట్టు చెప్పారు.
నర్సరీ నుంచి పంటకొత దాకా యాంత్రీకరణ
రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ యాంత్రీకరణ ముమ్మరంగా సాగాలని సీఎం పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏమేం అందుబాటులో ఉన్నాయి, ఇంకా ఏమేం కావాలో అధ్యయనం చేయాలని ఏఈవోలకు సూచించారు. అవసరమైన యంత్రాలను సరఫరా చేయాలని, అవి ప్రతి రైతుకు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నర్సరీ దగ్గరి నుంచి పంటకోతల దాకా అన్ని స్థాయిల్లో యాంత్రీకరణ జరగాలన్నారు. వచ్చే బడ్జెట్‌లో యాంత్రీకరణకు భారీగా నిధులిస్తామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పండించే పంటలకు అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని.. పళ్ల తోటలున్న చోట పల్ప్ తయారీ యూనిట్ల ఏర్పాటు జరగాలని సూచించారు.
రైతులకు లేఖలు రాయండి..
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యల గురించిన సమగ్ర సమాచారంతో రైతులకు లేఖలు రాయాలని వ్యవసాయశాఖ మంత్రికి సీఎం సూచించారు. రైతులకు అవగాహన కలిగించడానికి, వారిలో మరింత స్థైర్యం నింపడానికి ప్రయత్నించాలన్నారు. రైతు బీమా పత్రాల పంపిణీ మొదలయ్యే ఆగస్టు 15 నుంచి గ్రామాల్లో రైతుల సమావేశాలు–సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. ఆ సదస్సుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనాలని.. రైతులకు సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన కలిగించాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం అద్భుతమైన చర్యలు చేపడుతున్నామని.. మూడు నాలుగేళ్లు పంటలు బాగా పండితే రైతుల భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు. సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, బాల్క సుమన్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment