దళితులను చీల్చేందుకు సీఎం చంద్రశేఖర్‌రావు కుట్ర పన్నుతున్నారని...
జహీరాబాద్ టౌన్: దళితులను చీల్చేందుకు సీఎం చంద్రశేఖర్‌రావు కుట్ర పన్నుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. జహీరాబాద్ పట్టణంలోని ఉత్తం గార్డెన్‌లో నిర్వహించిన సంఘం నియోజకవర్గ స్థాయి కార్యకర్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం నీరుగారుతున్న సమయంలో కేసీఆర్‌కు తాము అండగా నిలిచామని తెలిపారు. ఆయన ఆమరణ దీక్ష చేసిన సందర్భంలోనూ దళితులు వెన్నంటి ఉన్నారన్నారు. ప్రతిపక్షాలకు ఆయనను ఎదిరించే శక్తిలేదని, కేవలం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకే ఆ దమ్ముందని తెలిపారు. తెంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని సీఎంను చేస్తానన్న కేసీఆర్ అధికారం వచ్చాక మాట మార్చారని మండిపడ్డారు.
గతంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతునిచ్చిన కే సీఆర్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ ప్రస్తుతం సీఎంలుగా ఉన్నారన్నారు. వారికి దళితులపై చిత్తశుద్ధి ఉంటే ఇరువురు కలసి అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. అప్పట్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కూడా వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడారని గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. డిసెంబర్ నెల నుంచి ఉద్యమాన్ని చేపడుతామన్నారు.
అందుకని గ్రామ మండల స్థాయి కమిటీలను వేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జ్ నరోత్తం, ఎమ్మార్పీఎస్ నాయకులు భూమన్ మధు మాదిగ, ఆనంద్, నర్సింలు, యువరాజ్, పవన్, పద్మారావు, బుడగ జంగం నాయకులు కె.చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.