The Telangana movement
-
అందరికీ అమోదమయ్యే పీఆర్సీ
కరీంనగర్ : తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని, అలాంటివారికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదయోగ్యమైన పీఆర్సీ అమలు చేస్తుందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. టీఎన్జీవోస్ నూతన సంవత్సర డైరీని టీఎన్జీవోస్ కార్యాలయంలో గురువారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత ధరలకనుగుణంగా పీఆర్సీ ప్రకటించేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని, ఉద్యోగులకు అపోహలు అవసరం లేదని అన్నారు. తెలంగాణకు స్వేచ్ఛా వాయువులు అందించడంలో చూపించిన పోరాట పటిమను నవ తెలంగాణ నిర్మాణంలోనూ చూపించాలని కోరారు. 1956 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర గొప్పదని కొనియాడారు. పనివేళలను మించి కనీసంగా గంట అదనపు విధులు నిర్వహించి, ఉద్యోగులు, ఉపాధ్యాయులు బంగారు తెలంగాణకు బాటలు వేయాలని కోరారు. అవినీతి నిర్మూలన, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల దరికి చేర్చడంలో ఉద్యోగులు చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. హామీలు నెరవేర్చేందుకు సీఎం కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఎంఏ హమీద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం.జగద్వీశర్, ఎస్.రాజయ్యగౌడ్, ఎం.నరసింహస్వామి, దారం శ్రీనివాస్రెడ్డి, వి.రవీందర్, కాళీచరణ్, అనిల్, శారద, లక్ష్మి, విక్టోరియా రాణి, సుగుణాకర్రెడ్డి, రహమాన్, సబిత, హర్మీందర్సింగ్, తిరుమల్, అనిల్ పాల్గొన్నారు. -
తెలంగాణ జీవద్భాషను చూపిన ‘ఇత్తు’ కథలు...
మహోజ్వలంగా సాగిన తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాహిత్యానికి కొత్త చూపుని, వెలుగుని ఇచ్చింది. కొత్త కలాలు కదం తొక్కాయి. కేవలం కవులు, కళాకారులు మాత్రమే కాదు కథకులు కూడా తెలంగాణ జీవన చిత్రపు కాంతిపుంజాల్ని, చీకటి దారుల్ని వెతికి పట్టుకునే ప్రయత్నం చేశారు. అలాంటి కథకులలో ఒకరయిన కోట్ల వనజాత రాసిన కథలు ఇవి. ‘ఇత్తు’ సంకలనం కథలలో వలస బతుకులోని విషాదమోహనం విన్పిస్తుంది. నగర జీవితపు కాఠిన్యం కన్పిస్తుంది. మార్కెట్లోని అన్ని సరుకుల్లాగా స్త్రీ శరీరం కూడా ఈరోజు మార్కెట్ సరుకయిపోయిందన్న దుఃఖపు సెగ మనల్ని తాకుతుంది. తెలంగాణా కోసం బలిదానమిచ్చిన పిల్లల తల్లుల గర్భశోకం మనల్ని కలతపెడుతుంది. సహజ సిద్ధమయిన తెలంగాణ నుడికారం, తెలంగాణ జీవద్భాష ఈ కథల్ని మౌఖిక సంప్రదాయంలో చెప్పినట్టుగా అన్పిస్తాయి. కథలలో వాతావరణ చిత్రణ కనిపించని ప్రాణవాయువులా ఆవరించి ఉంటుంది. కొన్ని కథలలోని పాత్రలు పాఠకుణ్ని వెంటాడతాయి. ‘ఇత్తు’ కథలో హైబ్రిడ్ విత్తనాలు రైతుని నిలువునా ఎలా ముంచేస్తున్నాయో చెబుతూ ప్రధాన పాత్రధారి అరుణ ‘ఇత్తు చేసిన మాయను ఈశ్వరుడన్నా పట్టలేకపోయనే’ అని దుఃఖిస్తుంది. శపించిన జీవితాన్ని ఎదిరించి మగాడై వ్యవసాయాన్ని చేసిన అరుణక్క ఒక హాస్టల్లో గిన్నెలు కడిగే పనికి కుదురుకోవడం నేటి విషాదం. వాచ్మెన్లుగా, సెక్యూరిటీ గార్డులుగా మారిపోయిన రైతన్నలు కళ్లముందాడతారు. బొంబాయి వలస వెళ్లిన భార్యాభర్తల్లో భార్య మరణిస్తే దహన సంస్కారాలకు ఖర్చులేక శవాన్ని సముద్రం పాలు చేయటం పెను విషాదంలా మనల్ని తాకుతుంది ‘సముద్రం’ కథలో. మగాళ్ళే కాదు ఆడవారిలో కూడా కఠినాత్ములుంటారని చూపుతూ అభం శుభం తెలియని గిరిజన పిల్లల్ని తమ అవసరాలకు ఉపయోగించుకునే ఓ స్త్రీ బండారం బయటపెడుతుంది ‘తార్నామ్ కాయిచోరి’ కథ. మనసుని పిండేసే కథ. అవినీతి భరతం పట్టాలి అని అందరూ అంటారు కానీ, అవినీతి బహుముఖానికి బలయ్యే అమాయకులు వున్నారని చెబుతారు రచయిత్రి ‘బహుముఖం’ కథలో. అవినీతిని అరికడదామనే వారు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలా వుంటుందో చెప్పే మంచికథ ‘రాజన్న’ కథ. ముఖ్యంగా బలిదానం చేసుకున్న పిల్లల తల్లుల గర్భశోకానికి చలించిపోయిన రచయిత్రి చిందించిన దుఃఖాశ్రువుల అక్షర రూపమీ కథ. ఈ సంకనంలోని ఎక్కువ భాగం కథలు కుటుంబ పోషణ చేస్తూనే వేలెత్తి చూపే సమాజానికి తలొగ్గుతూ సాగే స్త్రీల పక్షాన నిలుస్తాయి. వారి గురించి ఆలోచించమన్న తపన కథల్లో విస్తరించి వుంటుంది. తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డిని కన్న నేల మీద (వారిది మహబూబ్నగర్ జిల్లా) మెట్టినందుకు గర్వంగా వుంది అని వినయంగా చెబుతారు రచయిత్రి వనజాత. ఈ కథల్ని చదివిన తర్వాత దుఃఖపు పొరేదో మనల్ని ఆవరిస్తుంది. మనకుండే ఒకే ఒక్క జన్మలో మనుషులు ఇంత నిర్దయగా ఎలా వుంటారన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఒక మేలయిన, మెరుగయిన సమాజం జీవం పోసుకోవాలన్న ఆశ చిగురిస్తుంది. - సి.ఎస్.రాంబాబు -
దళితులను చీల్చేందుకు సీఎం కుట్ర
జహీరాబాద్ టౌన్: దళితులను చీల్చేందుకు సీఎం చంద్రశేఖర్రావు కుట్ర పన్నుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. జహీరాబాద్ పట్టణంలోని ఉత్తం గార్డెన్లో నిర్వహించిన సంఘం నియోజకవర్గ స్థాయి కార్యకర్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం నీరుగారుతున్న సమయంలో కేసీఆర్కు తాము అండగా నిలిచామని తెలిపారు. ఆయన ఆమరణ దీక్ష చేసిన సందర్భంలోనూ దళితులు వెన్నంటి ఉన్నారన్నారు. ప్రతిపక్షాలకు ఆయనను ఎదిరించే శక్తిలేదని, కేవలం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకే ఆ దమ్ముందని తెలిపారు. తెంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని సీఎంను చేస్తానన్న కేసీఆర్ అధికారం వచ్చాక మాట మార్చారని మండిపడ్డారు. గతంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతునిచ్చిన కే సీఆర్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ ప్రస్తుతం సీఎంలుగా ఉన్నారన్నారు. వారికి దళితులపై చిత్తశుద్ధి ఉంటే ఇరువురు కలసి అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. అప్పట్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కూడా వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడారని గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. డిసెంబర్ నెల నుంచి ఉద్యమాన్ని చేపడుతామన్నారు. అందుకని గ్రామ మండల స్థాయి కమిటీలను వేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గం ఇన్చార్జ్ నరోత్తం, ఎమ్మార్పీఎస్ నాయకులు భూమన్ మధు మాదిగ, ఆనంద్, నర్సింలు, యువరాజ్, పవన్, పద్మారావు, బుడగ జంగం నాయకులు కె.చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.