తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని, అలాంటివారికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదయోగ్యమైన పీఆర్సీ అమలు చేస్తుందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.
కరీంనగర్ : తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని, అలాంటివారికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదయోగ్యమైన పీఆర్సీ అమలు చేస్తుందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. టీఎన్జీవోస్ నూతన సంవత్సర డైరీని టీఎన్జీవోస్ కార్యాలయంలో గురువారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత ధరలకనుగుణంగా పీఆర్సీ ప్రకటించేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని, ఉద్యోగులకు అపోహలు అవసరం లేదని అన్నారు.
తెలంగాణకు స్వేచ్ఛా వాయువులు అందించడంలో చూపించిన పోరాట పటిమను నవ తెలంగాణ నిర్మాణంలోనూ చూపించాలని కోరారు. 1956 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర గొప్పదని కొనియాడారు. పనివేళలను మించి కనీసంగా గంట అదనపు విధులు నిర్వహించి, ఉద్యోగులు, ఉపాధ్యాయులు బంగారు తెలంగాణకు బాటలు వేయాలని కోరారు. అవినీతి నిర్మూలన, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల దరికి చేర్చడంలో ఉద్యోగులు చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. హామీలు నెరవేర్చేందుకు సీఎం కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఎంఏ హమీద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం.జగద్వీశర్, ఎస్.రాజయ్యగౌడ్, ఎం.నరసింహస్వామి, దారం శ్రీనివాస్‌రెడ్డి, వి.రవీందర్, కాళీచరణ్, అనిల్, శారద, లక్ష్మి, విక్టోరియా రాణి, సుగుణాకర్‌రెడ్డి, రహమాన్, సబిత, హర్మీందర్‌సింగ్, తిరుమల్, అనిల్ పాల్గొన్నారు.