గంగుల కమలాకర్ వర్సెస్ పొన్నం ప్రభాకర్
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి బాధలు తెలుస్తాయన్న పొన్నం
మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాలని గంగుల సూచన
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ పంచాయితీకి కొద్దిసేపు శాసనసభ వేదిక అయ్యింది. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మధ్య వాగ్వాదం జరిగింది. అది వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లింది. గురుకులాల్లో సౌకర్యాల కల్పనపై అసెంబ్లీలో సాగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి సీతక్క మాట్లాడిన అనంతరం బీఆర్‌ఎస్ నుంచి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణకు ఏర్పాటు కాక ముందు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు విద్య అందించలేదని, చదువు చెప్పలేదని వ్యాఖ్యానించారు.
దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ ‘ఆయన మారుమూల ప్రాంతం నుంచి కరీంనగర్‌కు వచ్చి కాంగ్రెస్ హయాంలో చదువుకోలేదా? ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చదివితే ఆ బాధ తెలుస్తది. ఆయన ప్రభుత్వ పాఠశాలలో చదవలే. బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో చదవలే. మీకేం తెలుసు ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల గురించి’అని అన్నారు. దానికి గంగుల స్పందిస్తూ.. ‘మీరు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచి్చన అన్నరు. పార్లమెంట్, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తెలవయ్’అని వ్యాఖ్యానించారు. దానికి స్పందించిన పొన్నం ‘మొదటిసారి ఎమ్మెల్యేలకు ఏం తెలియదన్నట్లా, అజ్ఞానులన్నట్టా? పార్లమెంట్ మెంబర్ చేసిన, తెలంగాణ కోసం కొట్లాడిన. మీ నాయకుడు నిన్ను ‘షేర్ పటాక’అన్నాడు.
తెలంగాణ ఉద్యమంల పార్టీ మారి ఇట్ల మాట్లాడితే ఎట్ల?’అని అన్నారు. దానికి కమలాకర్ బదులిస్తూ... ‘షేర్ పటాకనా, పెప్పర్ స్ప్రే డూప్లికేటా అని నేననలే. దొంగేడుపు ఏడవలే. కండ్లు పోయినయని ఏడువలె ’అని తెలంగాణ బిల్లు సందర్భంగా పార్లమెంట్‌లో జరిగిన సంఘటనలపై వ్యాఖ్యానించారు. దీంతో పొన్నం సీరియస్ అవుతూ ‘పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే ఒరిజనలా, డూప్లికేటా రికార్డులు పరిశీలిద్దాం. కుక్క షేర్ పటాక.. ఎక్కడ శవం కనిపిస్తే అక్కడికి పోయి ఏడుస్తడని వాళ్ల నాయకుడు అన్నడు’అని వ్యాఖ్యానించారు. దీంతో గంగుల స్పందిస్తూ ‘మేం కరీంనగర్ తెలంగాణ చౌక్‌ల కొట్లాడిన దాన్ని అసెంబ్లీ దాక తీసుకొస్తున్నాడు.
కరీంనగర్‌లో ఎందుకు ఓడిపోయినవ్ , ఎందుకు హుస్నాబాద్ పారిపోయినవ్ అని నేను అన్ననా? జిల్లా విడిచిపెట్టి పోతరా ఎవరన్నా? ’అని కామెంట్ చేశారు. దీనికి స్పందిస్తూ ‘కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పోటీ చేయడానికి పారిపోయిన్రా? దమ్ముంటే రా. నెక్ట్స్ టైం వచ్చి నామీద పోటీ చేయ్. వేరే నియోజకవర్గానికి పోవడం తప్పా? నీలాగా కోట్ల కోట్లు లేవు. నాకు దమ్ముంది. అక్కడికి పోయి గెలిచిన’అని తీవ్రస్థాయిలో స్పందించారు. మంత్రి శ్రీధర్‌బాబు జోక్యంతో కరీంనగర్ పంచాయితీ సద్దుమణిగింది.
Comments
Please login to add a commentAdd a comment