
'మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వస్తే రాజీనామా'
గజ్వేల్, న్యూస్‌లైన్: మరో రెండేళ్లలో గజ్వేల్ నియోజకవర్గంలో మహిళలు మంచినీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్లపైకి వస్తే తాను రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం గజ్వేల్‌లోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో నియోజకవర్గ అభివృద్ధిపై రాష్ట్ర, జిల్లాస్థాయి ఉన్నతాధికారులతోపాటు నియోజకవర్గంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సహకార సంఘాల చైర్మన్‌లు, నగరపంచాయతీ కౌన్సిలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి మంచినీటిని అందించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.
ఈ విషయంలో ఎలాంటి వెనకడుగు లేదన్నారు. గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు సైతం నిర్లక్ష్యం చేస్తే పదవులకు రాజీనామా చేయాలన్నారు. ్ల జాతీయ ఆహార భద్రత పథకం జాబితానుంచి జిల్లాను తొలగించడం వల్ల వరి విత్తనాల సబ్సిడీని ఎత్తేసిన విషయం తెలుసుకున్న సీఎం వెంటనే సబ్సిడీని పునరుద్ధరించనున్నట్లు సభలో ప్రకటించారు. బీటీ పత్తి విత్తనాలు, ఇతర సబ్సిడీ విత్తనాలు, ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా నుంచి మరో ఇద్దరికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని దేశంలోనే బంగారు తునకగా తీర్చిదిద్దుతానన్నారు. అభివృద్ధిలో ఆదర్శంగా మలచడం ద్వారా దేశం నలుమూలల నుండి ఈ ప్రాంతాన్ని ప్రజలు సందర్శించే విధంగా తయారు చేస్తానన్నారు. అభివద్ధే లక్ష్యంగా గజ్వేల్‌కు ప్రత్యేకంగా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేసినట్లు, దీనికి హన్మంతరావు ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తారన్నారు.
ఈ ఆథారిటీ అధ్వర్వంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామపంచాయతీకి నోడల్ అధికారిని నియమించనున్నట్లు వెల్లడించారు. ప్రజాప్రతినిధులు ఆయా తమ గ్రామాల్లో మంచినీరు, విద్య, నీటిపారుదల, విద్యుత్, ఆరోగ్యం, రోడ్డు రవాణా అంశాలవారిగా ప్రణాళికలు రూపొందించి డెవలప్‌మెంట్ అథారిటీకి అందించాలని చెప్పారు. ఈ ప్రణాళికలకు త్వరితగతిన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ముందుగా నియోజకవర్గంలో పారిశుద్ధ్య లోపంపై యుద్ధం ప్రకటించాలని పిలుపునిచ్చారు. నాలుగైదురోజుల్లో మండలాలవారీగా సమావేశాలు నిర్వహించి పిచ్చిచెట్ల తొలగింపు, మురికి తొలగింపు కార్యక్రమం కోసం కార్యాచరణ రూపొందించాలని, ఈ కార్యక్రమంలో తానుకూడా పాల్గొంటానన్నారు. అదేవిధంగా ‘పచ్చతోరణం’ పేరిట నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మండలానికి లక్ష చొప్పున మొక్కలు నాటే కార్యక్రమాన్ని తొందరలోనే చేపట్టాలని ఆదేశించారు.
నియోజకవర్గ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు
నియోజకవర్గంలో శాఖల వారిగా చేపట్టాల్సిన పనులపై కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష చేపట్టారు. నియోజకవర్గంలోని పంచాయతీరాజ్ శాఖ రోడ్లన్నీ డబుల్‌గా మార్చాలని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు వెంటనే పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ శాఖ సమీక్షలో గజ్వేల్-తూప్రాన్ రహదారిపై కల్వర్టులను బాగుచేయడమే కాకుండా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రోడ్డు ఫోర్‌లేన్ పనులు వెంటనే చేపట్టాలని, ములుగు మండలం వంటిమామిడి-మేడ్చల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చి కల్వర్టులను బాగుచేయడానికి ప్రతిపాదనలు అందించాలని సూచించారు. విద్యుత్ శాఖకు సంబంధించి పెండింగ్‌లో వున్న అయిదు 33/11 కేవీ సబ్‌స్టేషన్ల పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. గజ్వేల్ నియోజకవర్గ రైతాంగం అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ శాఖా ఎస్‌ఈ రాములు 350 త్రీఫేజ్, 150 సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లు కావాలని అడగగా మంజూరు చస్తానని సీఎం ప్రకటించారు. అదేవిధంగా తూప్రాన్ మండలం కాళ్లకల్‌లో యూపీహెచ్‌సీ, తూప్రాన్‌లో కమ్యూనిటీ హెల్త్‌సెంటర్, గజ్వేల్‌లో ఏరియా ఆసుపత్రి కోసం భవన నిర్మాణం వంటి పనులను చేపట్టడానికి అవసరమైన ప్రతిపాదనలిస్తే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో బస్సు సౌకర్యానికి నోచుకోని తూప్రాన్ మండలంలోని ఆరు గ్రామాలు, నియోజకవర్గంలోని మిగతా గ్రామాలకు వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌ను ఆదేశించారు.
స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీ
గజ్వేల్‌లో బుధవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాల్లో భాగంగా జిల్లాలోని 1326 స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ.38.45బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును అందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ మహిళలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.