నాటి సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలోనే కాళేశ్వరంపై నిర్ణయాలు
పీసీ ఘోష్ కమిషన్‌కు తెలిపిన రామగుండం మాజీ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు
ఆరు గంటల క్రాస్ ఎగ్జామినేషన్‌లో 128 ప్రశ్నలు సంధించిన కమిషన్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను నిర్మించాలని నాటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావే నిర్ణయం తీసుకున్నారని నీటిపారుదల శాఖ రామగుండం మాజీ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు చెప్పారు. 2016 జనవరిలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఓ సమావేశంలోనే ఈ మేరకు నిర్ణయం జరిగిందని పేర్కొన్నారు. వ్యాప్కోస్ రూపొందించిన కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని, కేసీఆర్ స్వయంగా సంతకం చేశారని అన్నారు.
ఈ డీపీఆర్ ఆధారంగా వివిధ కాంపోనెంట్ల అంచనాలను సిద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశించారని వివరించారు. బరాజ్‌లను ఎక్కడ కట్టాలో ప్రభుత్వమే చెప్పగా, ఆ మేరకు డీపీఆర్‌ను వ్యాప్కోస్ సిద్ధం చేసిందన్నారు. నిర్మాణ దశలో అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల స్థలాలను మార్చినట్టు చెప్పారు. గ్రావిటీ కాల్వ పొడవు తగ్గించడం, నిల్వ సామర్థ్యం పెంచడం, అటవీ భూముల సేకరణను తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ గురువారం ఆరు గంటల పాటు నిర్వహించిన రెండో విడత ఎగ్జామినేషన్‌లో వెంకటేశ్వర్లు ఈ మేరకు వివరణ ఇచ్చారు. తొలి విడతలో ఆయనకు 71 ప్రశ్నలు వేసిన కమిషన్.. తాజాగా రెండో విడతలో ఏకంగా 128 ప్రశ్నలు సంధించింది. శుక్రవారం కూడా క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరుకావాలని ఆదేశించింది.
నిర్మాణ దశలో మార్పులు
‘డీపీఆర్‌ను 2016 మార్చిలో కేంద్ర జల సంఘానికి(సీడబ్ల్యూసీ) సమర్పించిన తర్వాత నిర్మాణంలో పలు మార్పులు, చేర్పులపై నిర్ణయాలు జరిగాయి. డీపీఆర్‌లో అన్ని కాంపోనెంట్లు లేవు. గైడ్‌బండ్, ఫ్లడ్ బ్యాంకులు, డైవర్షన్ చానల్స్‌ను తర్వాత చేర్చాం. నిర్మాణ దశలో సైట్ పరిస్థితుల ఆధారంగా మరికొన్ని మార్పులు చేశాం.
స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్‌ఎల్‌సీ)లో తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ మార్పులు జరిగాయి. డీపీఆర్‌లో అన్నారం బరాజ్‌ను 120 మీటర్ల ఎత్తులో నిర్మించాలని ప్రతిపాదించగా, అటవీ భూముల ముంపు, సైట్ పరిస్థితుల ఆధారంగా 119 మీటర్లకు కుదించాం. ప్రాథమికంగా మూడు బరాజ్‌లకు వేర్వేరు డీపీఆర్‌లను తయారు చేయగా, తర్వాత ఉమ్మడి డీపీఆర్‌ను తయారు చేశాం..’అని కమిషన్‌కు వెంకటేశ్వర్లు తెలిపారు.
సీడబ్ల్యూసీ చెప్పడంతోనే రీఇంజనీరింగ్
‘ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు 2007లో రూ.17,875 కోట్లతో అనుమతిచ్చి 2008లో రూ.38,500 కోట్లకు అంచనాలను పెంచి రూ.6,156 కోట్ల పనులు సైతం పూర్తి చేశాక 2 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు కోసం రీఇంజనీరింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాల్సిన అవసరం ఏమిటి?’అని కమిషన్ నిలదీసింది.
‘తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బరాజ్‌కు మహారాష్ట్ర అభ్యంతరం తెలపడంతో 148 మీటర్లకు ఎత్తు తగ్గించి ఒప్పందం చేసుకున్నాం. ఆ ఎత్తులో బరాజ్ కడితే 44 టీఎంసీల లభ్యతే ఉంటుంది. తుమ్మిడిహెట్టి వద్ద నీటిలభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పడంతోనే రీఇంజనీరింగ్ చేశారు’ అని వెంకటేశ్వర్లు వివరించారు.
మ్యాథమెటికల్లీ తప్పుడు నిర్ణయమే !
ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా రెండుదశల్లో కలిపి 304 మెగావాట్ల పంపుల సామర్థ్యంతో నీళ్లను ఎత్తిపోయడానికి వీలుండగా రీఇంజనీరింగ్ చేసి పంపుల సామర్థ్యాన్ని 11 వేల మెగావాట్లకు పెంచడం సరైందేనా అని కమిషన్ ప్రశ్నించగా, గణితపరంగా తప్పుడు నిర్ణయమేనని మాజీ ఈఎన్‌సీ పేర్కొన్నారు. కోల్‌బెల్ట్ ఏరియాలో మేడిగడ్డ బరాజ్ నిర్మించారా? అని ప్రశ్నించగా వాస్తవం కాదని ఆయన బదులిచ్చారు.
బరాజ్ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలున్నట్టు జాదవ్‌పూర్ వర్సిటీ ఇచి్చన నివేదికను ప్రస్తావించగా దానితో తాను ఏకీభవించనని చెప్పారు. ప్రభుత్వ అధినేత ఆదేశాలతో బరాజ్‌లలో నీళ్లను నిల్వ చేశామని మరో ప్రశ్నకు బదులిచ్చారు. బెంగాల్ సహా 4 రాష్ట్రాల్లో నిర్మించిన బరాజ్‌లలో సికెంట్ పైల్స్ వాడినట్టు చెప్పగా.. తన స్వరాష్ట్రం బెంగాల్ పేరును ఉటంకించడంపై జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment