నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మెదక్ జిల్లా నుంచి టంగుటూరి అంజయ్య ఎన్నిక కాగా, నేడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఇదే జిల్లాకు చెందిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎన్నిక కాబోతున్నారు.
మెదక్ : నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మెదక్ జిల్లా నుంచి టంగుటూరి అంజయ్య ఎన్నిక కాగా, నేడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఇదే జిల్లాకు చెందిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎన్నిక కాబోతున్నారు. దేశ, రాష్ట్ర రాజకీయ యవనికపై మెతుకుసీమ ప్రతినిధులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 1980లో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికైన ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా కొనసాగారు. అలాగే 1981లో ఇదేజిల్లా రామాయంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన టంగుటూరి అంజయ్య ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
1989లో నర్సాపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన జగన్నాథరావు ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం 2009లో ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన దామోదర రాజనర్సింహ కూడా ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన కేసీఆర్ త్వరలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.