కొలిక్కి వచ్చిన జిల్లా అధ్యక్షుల ఎంపిక!
రాష్ట్ర కమిటీ, పొలిట్‌బ్యూరో కూర్పుపై టీఆర్‌ఎస్ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులు, కమిటీల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వరసగా బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు ఇదే అంశంపై కసరత్తు చేశారని పార్టీ వర్గాల సమాచారం. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతోనూ అవసరమైన సందర్భాల్లో సీఎం మాట్లాడి జిల్లా అధ్యక్షుల పేర్లకు తుదిరూపు ఇచ్చారని తెలిసింది. కాగా, రాష్ట్ర కమిటీ, పార్టీ పొలిట్‌బ్యూరో కూర్పుపై ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.
31 జిల్లాల అధ్యక్షుల జాబితాను ఒకేసారి ప్రకటించాలని కూడా నిర్ణయించారని సమాచారం. గతంలో జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో కనీసం ఏడెనిమిది మందికి తిరిగి అవకాశం దక్కనుంది. ఐడీసీ చైర్మన్‌గా నామినేటెడ్ పదవి దక్కించుకున్న కరీంనగర్ జిల్లా(పాత) అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, ఫారెస్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితుడైన నల్లగొండ జిల్లా (పాత) అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించనున్నారు. మిగిలిన ఎనిమిది జిల్లాల్లో పాతవారినే కొనసాగిస్తారని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పార్టీ అధ్యక్షుని ఖరారు కొంత జటిలంగా మారినా, ప్రస్తుత అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు పేరు ఖరారైనట్లేనని చెబుతున్నారు.
అనుబంధ సంఘాల కమిటీలపై స్పష్టత..
అనుబంధ సంఘాల రాష్ట్ర కమిటీలు, జిల్లా అనుంబంధ సంఘాల కమిటీలపైనా ఒక స్పష్టత వ చ్చిందని తెలుస్తోంది. అయితే, ముందుగా పార్టీ జిల్లా అధ్యక్షుల వరకు ప్రకటి ంచి, మిగిలిన కమిటీలను తర్వాత ప్రకటించే వీలుందని సమాచారం. మరోవైపు పార్టీ రాష్ట్ర కమిటీ, పొలిట్‌బ్యూరో, రాష్ట్ర స్థాయి అనుబంధ సంఘాల కమిటీలను మరో విడతలో ప్రకటించే వీలు లేకపోలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా, పార్టీ సంస్థాగత కమిటీల వివరాలను శనివారం ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు పార్టీ జిల్లా కమిటీల ఏర్పాటు నేపథ్యంలో ఆయా జిల్లాలకు చెందిన నేతల్లో అత్యధికులు హైదరాబాద్‌లోనే మకాం వేశారు.