
చీకటి ఒప్పందాలు కాంగ్రెస్‌వే: శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును విమర్శిం చడమంటే తెలంగాణ ప్రజలను అవమానించడమేనని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కేవలం టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను బద్నాం చేయడానికి విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. అన్ని పార్టీలను ఒప్పించి, ప్రజాపోరాటం ద్వారా తెలంగాణ సాధించిన కేసీఆర్‌కు కుమ్మక్కు రాజకీయాలు, చీకటి ఒప్పందాల గురించి తెలియదన్నారు. చీకటి ఒప్పం దాల చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని ఆయన విమర్శిం చారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన శని వారం విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్, టీడీపీలు తమ ఉనికికోసం టీఆర్‌ఎస్‌పై రాజకీయ విమర్శలు చేస్తున్నాయని అన్నారు. జీఎస్టీ ఆలోచనకు బీజం పడిందే కాంగ్రెస్ పాలనలోనని, 13 ఏళ్లుగా జీఎస్టీపై చర్చలు జరిగి ఇప్పుడు అమలైతే టీఆర్‌ఎస్ మద్దతిచ్చిందన్నారు. యూపీఏ రాష్ట్రాల్లో జీఎస్టీ అమలును కాంగ్రెస్ నాయకులు ఆపగలుగుతారా అని ప్రశ్నించారు. రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వమని కాంగ్రెస్ ముందే ఎందుకు కేసీఆర్‌ను కోరలేదని నిలదీశారు. స్వార్ధంతోనే ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.