
సాక్షి, విజయవాడ : రాష్ట్ర రాజధాని అమరావతిలో బసవతారకం ఆస్పత్రి నిర్మాణానికి 15 ఎకరాలు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సినీహీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఆస్పత్రి అభివృద్ధికి సీఎం తన వంతు సహకారం అందిస్తున్నారని చెప్పారు. ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పురిటి గడ్డమీద బసవతారకం హాస్పిటల్ కార్యకలాపాలు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్ ఆశయం పురడు పోసుకొని రెండు దశాబ్ధాలుగా కొనసాగడం సంతోషంగా ఉందని చెప్పారు.
ఈ ఏడాది ఆగస్టు నెలలో అమరావతిలో బసవతారకం హాస్పిటల్‌కు భూమి చేయనున్నట్లు బాలకృష్ణ వెల్లడించారు. మూడు ఫేజ్‌లలో పూర్తి చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో బసవతారకం ఆస్పత్రికి పన్ను రద్దు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన తల్లి బసవతారకం పడిన బాధ ఏతల్లి పడొద్దని అందుకే హాస్పిటల్ ప్రారంభించినట్లు తెలిపారు. జీవితం మన హక్కుని దానిని పోరాడి సాధించుకోవాలన్నారు. ప్రత్యేక హోదా కూడా అంతేన్నారు.