
తుగ్లక్ పాలన... హిట్లర్ పోకడ
కేసీఆర్ వంద రోజుల పాలనపై కాంగ్రెస్ విమర్శలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వంద రోజుల పాలనపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలనలో తుగ్లక్‌ను, నిరంకుశత్వంలో హిట్లర్‌ను తలపిస్తున్నాడని వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో మంగళవారం శాసన మండలిలో కాంగ్రెస్ ఉపనేత షబ్బీర్‌అలీ, టీపీసీసీ అధికార ప్రతినిధులు దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్‌లతో కలసి మీడియాతో మాట్లాడారు. అబద్దాల్లో గోబెల్స్‌ను, తప్పుల్లో శిశుపాలుడిని, నిర్లక్ష్యంలో రోమ్ చక్రవర్తిని మొత్తంగా కుంభకర్ణుడి వారసుడిగా కేసీఆర్ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ‘బంగా రు తెలంగాణగా మారుస్తానని చెప్పిన కేసీఆర్ అందుకు భిన్నంగా రైతుల ఆత్మహత్యల, కరవు, వరదలు, కరెంటు లేని చీకటి తెలంగాణగా మార్చిండు. కొత్త పథకాల సంగతి దేవుడెరుగు ఉన్న వాటి కి కత్తెర్లు వే స్తూ ప్రజలకు నరకం చూపిస్తుండు’అని ఆయన విమర్శించారు. అమరుల త్యాగాలతో తెలంగాణ వచ్చినప్పటికీ వారి కుటుంబాలను ఆదుకోకపోవడం శోచనీయమన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షం ఎండుగడుతుందనే భయంతో కేసీఆర్ విపక్ష ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, నాయకులకు ఆశచూపి వలసలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనతో విసిగిపోయి న ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారన్నారు. కేసీఆర్ వంద రోజుల పాలనలో వైఫల్యాలపై టీపీసీసీ రూపొందించిన కరపత్రాన్ని పొన్నాల ఆవిష్కరించారు. రుణమాఫీ, సీఎం పదవి, 24 గంటల కరెంట్ సరఫరా, ఉద్యోగులకు ఆప్షన్లు వంటి ప్రధాన హామీలపై కేసీఆర్ ఎలా మాటమార్చారనే అంశాలపై ఎన్నికలకు ముందు, తరువాత కేసీఆర్ చేసిన ప్రసంగాలతో రూపొందించిన వీడియో దృశ్యాలను సమావేశంలో ప్రదర్శించారు. దీంతోపాటు షబ్బీర్‌అలీ ‘టీఆర్‌ఎస్ వంద రోజుల తప్పుడు పాలన’ పేరుతో ఆంగ్లంలో రూపొందించిన కరపత్రాన్నీ పొన్నాల విడుదల చేశారు.
ఏ ఒక్క అంశంపై స్పష్టత లేదు: చాడ
సీఎం కేసీఆర్ వంద రోజుల పాలన మూడడుగులు ముందు కు.. రెండడుగులు వెనక్కు.. అన్న చందంగా ఉందని తెలంగా ణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు 43 అంశాలను గురించి ప్రకటించినా ఒక్క దానిపై కూడా స్పష్టత లేదనీ, అన్నింటినీ అమలుచేయాలని కోరారు. రైతులకు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజుల విషయంలో వెం టనే స్పష్టతనివ్వాలని, లేనిపక్షంలో వీరు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోతాయన్నారు. మంగళవారం మఖ్దూం భవన్‌లో పార్టీ నాయకులు సిద్ధి వెంకటే శ్వర్లు, కందిమళ్ల ప్రతాపరెడ్డి, డాక్టర్ డి.సుధాకర్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అనంతరం తెలంగాణ సాయుధపోరాట వారోత్సవాల సందర్భంగా.. ప్రజానాట్యమండలి రూపొందించిన ‘వీర తెలంగాణ పోరుపాటలు’ సీడీని చాడ ఆవిష్కరించారు.