సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజుల పాటు కొనసాగిన తెలంగాణ శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు ఆదివారం ముగిశాయి. తెలంగాణ రెండో శాసనసభ (2018–23)కు ఇవే చివరి విడత సమావేశాలు కావడంతో సభ్యులు భారంగా వీడ్కోలు పలికారు. చివరి రోజు సమావేశంలో ‘ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల సేవల విలీనం’బిల్లు తీవ్ర ఉత్కంఠ నడుమ సభ ముందుకు వచ్చి ఆమోదం పొందింది.
ఆదివారం ఉదయం ప్రశ్నోత్తరాలు లేకుండా నేరుగా జీరో అవర్‌తో ప్రారంభమైన సభ ఆ తర్వాత ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం – స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతి’అనే అంశంపై జరిగిన లఘు చర్చకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు 2.30 గంటల పాటు సవివరంగా సమాధానం ఇచ్చారు. అనంతరం మూడు ప్రభుత్వ బిల్లుల ఆమోదం, గద్దర్‌కు సంతాపం ప్రకటించిన తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.
ఉభయ సభలు హుందాగా సాగాయి: వేముల
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రజాస్వామ్య బద్ధంగా, సభ్యుల సస్పెన్షన్లు లేకుండా సాఫీగా జరిగాయని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.
దేశంలోనే నంబర్‌వన్ అనే రీతిలో నడిపాం: పోచారం
2019 జనవరి 18న శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తాను అందరి సహకారంతో దేశంలోనే నంబర్ వన్ అనే రీతిలో సభను నడిపానని పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఉద్యోగులను ప్రభుత్వ సేవల్లోకి తీసుకోవడం) బిల్లు 2023 శానసభ ఆమోదించడం పట్ల స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్‌కు టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ అసెంబ్లీలోని వారి చాంబర్లలో కలిసి ధన్యవాదాలు తెలిపారు.
సురవరం ప్రతాపరెడ్డిపై వెలువరించిన ‘ససురవరం–తెలంగాణం’ మూడు సంకలనాలను శాసనసభలో సీఎం కేసీఆర్‌కు వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అందజేశారు. 4 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో శాసనసభ 26.45 గంటలు, శాసన మండలి 23.10 గంటల పాటు సమావేశమైంది.
Comments
Please login to add a commentAdd a comment