మా ప్రభుత్వం వచ్చేనాటికి గ్రామ పంచాయతీలకు ఉన్న బకాయిలు రూ. 1,300 కోట్లు: భట్టి
బిల్లులు పెండింగ్‌లో పెట్టిన బీఆర్‌ఎస్ నేతలు
ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసిన అప్పటి సర్పంచులకు త్వరలోనే రూ.400 కోట్లు విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. గత ప్రభుత్వం వారితో అభివృద్ధి పనులు చేయించి.. నిధులు విడుదల చేయకుండా వారిని రోడ్డుపై వదిలేసిందని మండిపడ్డారు. అందువల్ల పంచాయతీ బకాయిలపై బీఆర్‌ఎస్ నాయకులు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హితవు పలికారు.
రూ.10 లక్షలలోపు పెండింగ్‌లో ఉన్న ప్రజాప్రతినిధుల బిల్లులు దాదాపు రూ.400 కోట్లు ఉంటాయని అంచనా వేశామని, వాటిని త్వరలోనే విడుదల చేస్తామని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో భట్టి చెప్పారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వంటి ప్రజాప్రతినిధులు చేసిన అభివృద్ధి కార్యక్రమాల పెండింగ్ బిల్లులు గత సంవత్సరం డిసెంబర్ 7 నాటికి ఉన్న బకాయిలు రూ.1,300 కోట్లు అని వెల్లడించారు.
సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పడుతున్న ఇబ్బందులను సీఎం రేవంత్‌రెడ్డి, తాను గమనించి రూ.10 లక్షల లోపు ఉన్న బకాయిలను త్వరలోనే విడుదల చేయాలన్న నిర్ణయానికి వచి్చనట్లు చెప్పారు. ప్రజా ప్రతినిధుల ఇబ్బందులకు కారణమైన బీఆర్‌ఎస్ నేతలు పెండింగ్ బిల్లుల కోసం ధర్నాలు చేస్తామని ప్రకటించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
పంట పొలాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు
ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం–కుసుమ్) పథకం కింద రాష్ట్రంలో రైతుల పంట పొలాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 0.5– 2 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్లను ఎండిపోయిన, పాడుబడిన వ్యవసాయ భూముల్లో రైతులతో ఏర్పాటు చేయిస్తామన్నారు.
రైతుల నుంచి కొనుగోలు చేసే విద్యుత్‌కు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు యూనిట్‌కు రూ.3.13 చొప్పున ధర చెల్లిస్తాయన్నారు. రైతులు, రైతు బృందాలు, సహకార సొసైటీలు, పంచాయతీలు, రైతు సంఘాలు, నీటి వినియోగ సంఘాలు ఈ పథకం కింద అర్హులన్నారు.
Comments
Please login to add a commentAdd a comment