నేడు ‘రాచకొండ’కు కేసీఆర్
ఫిలింసిటీ కోసం భూములు పరిశీలించనున్న సీఎం
ఏరియల్ సర్వేలో పాల్గొననున్న మంత్రులు మహేందర్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి
ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫిలింసిటీ ఏర్పాటుకు మరో అడుగు పడనుంది. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల సరిహద్దుల్లోని రాచకొండ గుట్టల్లో ఫిలింసిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాచకొండ భూములను సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిశీలించనున్నారు. హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించేందుకు రెండు జిల్లాల అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు రెండు జిల్లాలకు చెందిన మంత్రులు మహేందర్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రాజీవ్‌శర్మ, కలెక్టర్లు శ్రీధర్, చిరంజీవులు హాజరుకానున్నారు.
పటిష్ట భధ్రత
వాస్తవానికి సీఎం కేసీఆర్ ఈ నెల 3న ఫిలింసిటీ, ఫార్మాసిటీ భూముల పరిశీలన నిర్వహించాల్సి ఉండగా.. సమయాభావం, ఫార్మా కంపెనీ ప్రతినిధులతో సమావేశం నేపథ్యంలో కేవలం ఫార్మాసిటీ భూములను మాత్రమే పరిశీలించారు. అనంతరం పదిరోజుల తర్వాత రాచకొండ భూములను పరిశీలించాలని నిర్ణయించిన ఆయన.. సోమవారం ఏరియల్ సర్వేకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో హెలికాప్టర్‌లో రాచకొండ భూములు పరిశీలించనున్నారు.
సీఎం పర్యటన ఉండడంతో అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందిన పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది. రాచకొండ ప్రాంతమంతా నక్సల్ ప్రభావితమైనది కావడంతో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.