ఇందిరా పార్కులో ‘నిమజ్జన’ సరస్సు | Indira Park, nimajjana 'lake | Sakshi
Sakshi News home page

ఇందిరా పార్కులో ‘నిమజ్జన’ సరస్సు

Published Thu, Oct 16 2014 2:34 AM | Last Updated on Fri, Aug 3 2018 2:57 PM

ఇందిరా పార్కులో  ‘నిమజ్జన’ సరస్సు - Sakshi

ఇందిరా పార్కులో ‘నిమజ్జన’ సరస్సు

తెలంగాణ సీఎం కేసీఆర్ యోచన
అందులోనే గణేశ్, దుర్గామాత
విగ్రహాలు, బతుకమ్మల నిమజ్జనం
హుస్సేన్‌సాగర్ పరిరక్షణ, శుద్ధికి చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం

 
 హైదరాబాద్: నిండా కలుషితమై దుర్గంధం వెదజల్లుతున్న హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ హుందాతనాన్ని పెంచేలా ఈ సరస్సును తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా... గణేశ్, దుర్గామాత విగ్రహాలు, బతుకమ్మల నిమజ్జనం కోసం సాగర్‌కు సమీపంలోని ఇందిరాపార్కులో ఒక సరస్సును నిర్మిద్దామని కేసీఆర్ ప్రతిపాదించారు. సాగర్‌నీటితోనే దానిని నింపడంతో పాటు.. కొత్త సరస్సును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేద్దామని పేర్కొన్నారు. ఇక సాగర్‌లోకి చేరే మురుగునీటిని పూర్తిగా మళ్లించాలని, అందుకోసం డ్రైనేజీలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు.

 బుధవారం కేసీఆర్ హుస్సేన్‌సాగర్‌ను, పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు. నెక్లెస్ రోడ్డులోని పలు చోట్ల హుస్సేన్ సాగర్ నీరు కలుషితమవుతున్న విషయాన్ని స్వయంగా పరిశీలించారు. బాల్కాపూర్, బంజారాహిల్స్, యూసఫ్‌గూడ, కూకట్‌పల్లి, పికెట్ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీరు హుస్సేన్‌సాగర్‌లో కలుస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం దీనిపై సచివాలయంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, హెచ్‌ఎండీఏ ప్రత్యేకాధికారి ప్రతీప్ చంద్ర, హెచ్‌డబ్ల్యూడబ్ల్యూస్‌బి ఎండీ ఎం.జగదీష్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులతో సమీక్షించారు.

గణేశ్ ఉత్సవాల సందర్భంగా వేలాది విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల హుస్సేన్‌సాగర్ కలుషితమవుతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దీనికి సమీపంలోనే ఉన్న ఇందిరాపార్కులో 15-20 ఎకరాల స్థలంలో చిన్నపాటి సరస్సును నిర్మించి.. అందులోనే గణేశ్, దుర్గామాత విగ్రహాలు, బతుకమ్మల నిమజ్జనం జరపాలనే ప్రతిపాదన చేశారు. బోటింగ్ తదితర సౌకర్యాలతో ఈ సరస్సును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితే బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజల సెంటిమెంట్‌కు భంగం కలగకుండా హుస్సేన్‌సాగర్ నీటితోనే ఆ సరస్సును నింపుదామన్నారు. ఈ అంశంలో సలహాలు, సూచనలు, అభిప్రాయాల సేకరణ కోసం హైదరాబాద్ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు గణేశ్ ఉత్సవ కమిటీతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు.
 
ప్రక్షాళన చేయండి..


ప్రపంచంలోని చాలా నగరాల మధ్యలో హుస్సేన్‌సాగర్‌లాంటి సరస్సులున్నా.. అవి దుర్గంధం వెదజల్లడం లేదని సీఎం వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌కు హుస్సేన్‌సాగర్ గొప్ప ఆకర్షణ అని, విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని పేర్కొన్నారు. అలాంటిది సాగర్ కలుషితమై దుర్గంధం వెదజల్లడం చూస్తే అవమానకరంగా ఉంటుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ నిపుణులను రప్పించి సాగర్ ప్రక్షాళనకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. హుస్సేన్‌సాగర్ పరిధిలోని పూర్తి భూభాగాన్ని పరిరక్షించాలని.. ఈ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

మురుగు చేరకుండా చూడండి..

 హుస్సేన్‌సాగర్‌లోకి చేరిన మురుగునీటిని శుభ్రం చేయడం కన్నా.. అసలు మురుగు నీరు అందులో చేరకుండా అడ్డుకోవడంపై ప్రధానంగా దృష్టిసారించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. సాగర్‌లోకి నాలాల ద్వారా రోజుకు 527 మిలియన్ లీటర్ల మురికి నీరు వస్తోందని.. కేవలం 368 మిలియన్ లీటర్ల నీటిని తరలించడానికి మాత్రమే పైపులైన్ ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం స్పందిస్తూ... నాలాల నుంచి వచ్చే నీరంతా నేరుగా సాగర్ తూము నీరు పోయే చోటికి చేరేలా కాలువలు నిర్మించాలని కేసీఆర్ సూచించారు. వర్షాకాలంలో మంచి నీటిని హుస్సేన్‌సాగర్‌లో నింపి తర్వాత షట్టర్లు మూసివేయాలన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement