కాంగ్రెస్ నేతలు కుక్కలకంటే హీనంగా మొరుగుతున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శాసనసభాపక్షం మండిపడింది.
కేసీఆర్ విమర్శలపై సీఎల్పీ ధ్వజం
హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు కుక్కలకంటే హీనంగా మొరుగుతున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శాసనసభాపక్షం మండిపడింది. ‘‘ఔను...ప్రతిపక్షంగా మేం ప్రజల పక్షాన కాపలా కుక్కలా ఉంటాం. ఎన్నికల్లో మీరిచ్చిన హామీలన్నీ అమలయ్యేదాకా నీ మెడలొంచుతాం. నీలాంటి వాళ్లను ఎంతోమందిని చూసిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉంది. నువ్వు ముఠా నాయకుడివి కాదు... ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తుంచుకుని మసలుకుంటే మంచిది’’ అని హెచ్చరించింది. సీఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ విప్ ఈరవత్రి అనిల్‌తో కలిసి సోమవారం సీఎల్పీ కార్యదర్శి మల్లు భట్టివిక్రమార్క మీడియూతో మాట్లాడుతూ కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ వ్యవహారశైలిని చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని అర్థమవుతోందని, అలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడానికి అనర్హుడని విమర్శించారు.
ఈ సందర్భంగా సీఎం చేసిన వ్యాఖ్యలపై సమాధానమిచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లోనే సీఎం దిష్టి బొమ్మలు, టీఆర్‌ఎస్ గద్దెలు కూల్చింది రైతులు, టీఆర్‌ఎస్ శ్రేణులే తప్ప కాంగ్రెస్ నాయకులు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రుణ మాఫీపేరుతో రైతులపైనే భారం మోపాలని సీఎం చూస్తున్నారన్నారు. ప్రపంచమంతా వ్యతిరేకించే నియంత హిట్లర్‌తో కేసీఆర్ పోల్చుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. మూడేళ్లదాకా కరెంట్ సమస్య తప్పదంటున్నావ్...అప్పటిదాకా రైతులు ఏం చేయాలని వారు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.