సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ నేతలను సన్నాసులంటూ సీఎం కేసీఆర్ విమర్శించిన నేపథ్యంలో నాగం ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. సీఎం విచ్చలవిడి అవినీతిని అడ్డుకోవడానికి మాత్రమే కోర్టుకు వెళ్లామన్నారు. రాష్ట్రం కోసమంటూ లక్షల కోట్లు అప్పు చేసి, వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కుటుంబం మొత్తం బంగారు తెలంగాణను పది తరాలకు సరిపోయేలా దోచుకున్నరని విమర్శించారు.
కేసీఆర్ అవినీతిని ఆధారాలతో నిరూపిస్తానని, అవినీతికి సహకరించిన మంత్రులు, అధికారులు జైలుకు వెళ్లక తప్పదని నాగం జనార్ధన్ హెచ్చరించారు. మేడిగడ్డ దగ్గర మూడు లిప్టులు ఎందుకని ప్రశ్నించారు. ఒక బడా కాంట్రాక్టు సంస్థకు పనులను కట్టబెట్టడానికే కాళేశ్వరం నిబంధనలు మార్చారంటూ మండిపడ్డారు. ముప్పై నెలల్లో పాలమూరు పూర్తి చేస్తామన్న కేసీఆర్ కనీసం పది శాతం పనులను పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం పేరును అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్లగా మారుస్తామని చెప్పారు.
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులను అర్హత లేని కంపెనీకి కట్టబెట్టారని, 14 వేల కోట్ల అవినీతి పాల్పడ్డారని నాగం ఆరోపించారు. రివ్యూలు, రివిజన్ పేరు మీద కేసీఆర్ కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారు నాగం విమర్శించారు. కేసీఆర్ అవినీతిపై యుద్ధం చేస్తామని, ఈడీ, సీబీఐ దగ్గర కూర్చుంటామని అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులను కాంగ్రెస్ నిర్మిస్తే.. ఆ ఘనతను తన ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. సీఎం అవినీతిని సాక్ష్యాధారలతో నిరూపిస్తానని, అలా చేయకపోతే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని సవాల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment