సాక్షి, నల్గొండ : కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న బతుకమ్మ పండుగ ఇప్పుడు కవితమ్మ పండగగా మారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం అసువులు బాసిన బీజేపీ కార్యకర్త మైసయ్య ఈ గడ్డపై పుట్టిన వ్యక్తి అని పేర్కొన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంత్ చారి అమరుడైతే, కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని ఏలుతోందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. కమీషన్ కోసమే మిషన్ కాకతీయ, భగీరథ చేపట్టారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్, ఆయన మంత్రులు ఉస్మానియాలో అడుగుపెట్టాలంటే వణుకుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ శవాలతో రాజకీయాలు రకం అంటూ లక్ష్మణ్ ఘాటు విమర్శలు చేశారు. భారత దేశాన్ని తమ కుటుంబమే ఏలాలని నెహ్రూ కుటుంబం చూస్తోందని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన మోడీని చూసి ఓర్వలేక పోతోందని, కావాలనే ప్రధాని కులం, తినే ఆహారం పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. మోడీ విజయాల జైత్రయాత్ర సాగితే తమ ఉనికి పోతోందని కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీలు బయపడుతున్నాయని విమర్శించారు. ఫ్లోరైడ్ బాధితులు ఇబ్బందిపడున్నా కేసీఆర్ పట్టించుకోకుండా ఉన్నారని, ఫ్లోరైడ్ నిర్మూలణకు కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి పట్టించారని ఆరోపించారు. గతంలో వాజ్‌పేయ్ ప్రభుత్వం 350 కోట్లు ఇస్టే వాటిని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుదారి పట్టించిందని మండిపడ్డారు.
కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ, ఒక్క టీచర్ నియామకాలను చేపట్టలేదని లక్ష్మణ్ మండిపడ్డారు. కేసీఆర్ తన కేబినెట్‌లో ఒక్క మహిళకు చోటు ఇవ్వలేదంటే మహిళలపై ఉన్న గౌరవం ఎంటో అర్థం అవుతోందన్నారు. సుకన్య సంవృద్ధి యోజన కింద కోట్ల రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. తల్లి పడ్డ కష్టాలు చూసిన మోదీ ఏ మహిళా కష్టాలు పడకూడదని ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారని వెల్లడించారు. జనచైతన్య యాత్ర టీఆర్‌ఎస్ పతనానికి నాంది పలుకుతోందని అన్నారు. ఉపాధి హామీ పథకం కింద వచ్చిన 350 కోట్ల రూపాయలను ఎలా ఖర్చు చేశారో టీఆర్‌ఎస్ ప్రభుత్వం లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు.
నల్గొండ జిల్లాలో మొక్కల పెంపకానికి ఇచ్చిన 47 కోట్ల రూపాయలు ఏమయ్యాయని లక్ష్మణ్ నిలదీశారు. ఎన్నికల కోసమే రైతు బంధు పథకం కేసీఆర్ తెచ్చారని విమర్శించారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి పట్టదని, ఊరు ఉరా బార్లు తెరిచి ఆదాయం పొందుతున్నారని దయ్యబట్టారు. జిల్లాకు ఇచ్చిన 543 కోట్ల రూపాయలు లెక్కలేకుండా పోయాయని ఆరోపించారు. రైతు ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వమన్న లక్ష్మణ్, అధికారంలోకి వస్తే రైతులకు రూ 2లక్షల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతిరైతుకు చితంగా బోర్లు వేయిస్తామన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే బ్యాంకుల నుంచి వచ్చే వడ్డీని కూడా బీజేపీ కడుతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment