సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సిద్ధం అవుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 118 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లోనూ రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఇప్పటికే ప్రకటించారు. అభ్యర్థుల ఖరారుపైనా పార్టీ దృష్టి సారించింది. అయితే ఎన్ని స్థానాలు గెలుస్తారన్నదే కమలం పార్టీ శ్రేణులకు ఆందో«ళన కలిగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 118 స్థానాల్లో పోటీ చేసినా ఒక్కస్థానంలోనే గెలిచింది. వందకుపైగా స్థానాల్లో డిపాజిట్ సైతం కోల్పోయింది.
దీంతో లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై బీజేపీ నేతలు, శ్రేణుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఒంటిరిగా పోటీ చేసి సత్తా చాటాలని బీజేపీ భావించింది. పార్టీ బలోపేతం కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సైతం పర్యటించారు. తీరా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాత్రం కాషాయ పార్టీకి చేదునే మిగిల్చాయి. 2004 ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ బలం ఒక్క స్థానానికి పరిమితమైంది. ఈ ఓటమి నుంచి కోలుకోకముందే లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ప్రతి లోక్‌సభ సెగ్మెంట్‌పైనా బీజేపీ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. గెలుపు అవకాశాలు ఉన్న వారికి టికెట్లు ఇచ్చేలా కసరత్తు చేసింది.
ఆశావహులు అధికంగానే ఉన్నా..
పార్టీ నుంచి పోటీ చేసేందుకు అశావహులు అధికంగానే ఉన్నారు. అందులో పార్టీ సీనియర్లే ఎక్కువ మంది టికెట్లను ఆశిస్తున్నారు. ముఖ్యంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలంతా పార్లమెంటు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. వారిలో పార్టీ అధ్య క్షుడు లక్ష్మణ్ సహా ముఖ్య నేతలంతా ఉన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్, కిషన్‌రెడ్డి పోటీ చేయా లని భావిస్తున్నారు. మల్కాజిగిరి నుంచి పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ టికెట్ ఆశిస్తున్నారు. హైదరాబాద్ నుంచి షెహజాదీ ఉన్నారు.
కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మ పురి అర్వింద్, జహీరాబాద్ నుంచి బానాల లక్ష్మారెడ్డి ఉన్నారు. తనకు సికింద్రాబాద్‌లో టికెట్ ఇవ్వకపోతే చేవెళ్ల నుంచి ఇవ్వాలని కిషన్‌రెడ్డి కోరుతున్నట్లు తెలిసింది. భువనగిరి నుంచి పీవీ శ్యాం సుందర్, మహబూబ్‌నగర్ నుంచి శాంతికుమార్, నాగర్‌కర్నూల్ నుంచి బంగారు శృతి, రజినిరెడ్డి, మెదక్ నుంచి రఘునందన్‌రావు, రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, వరంగల్ నుంచి చింతా సాంబమూర్తి, జైపాల్ యాదవ్; పెద్దపల్లి నుంచి ఎస్.కుమార్, కాశిపేట లింగయ్య; నల్లగొండ నుంచి గోలి మధుసూదన్‌రెడ్డి, పాదూరి కరుణ ఆశిస్తుండగా మరో మూడు స్థానాలనుంచి అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తోంది.
15న అభ్యర్థుల జాబితాతో రండి: అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర బీజేపీ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలిచ్చారు. ఈ నెల 15లోపు రాష్ట్ర స్థాయిలో అభ్యర్థులను ఖరారు చేసి జాబితాతో రావాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల కోసం తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తదితరులు అమిత్ షాను సోమవారం ఢిల్లీలోని ఆయ న నివాసంలో కలిశారు.
ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తును పూర్తి చేసి ఈ నెల 15న తిరిగి రావాలని అమిత్ షా సూచించినట్టు సమాచారం. పార్టీ అభ్యర్థులను ఈ నెల 15న బీజేపీ ఖరారు చేయనుంది. ఈ నెల 14వ తేదీనాడే పార్టీ కోర్ కమిటీ సమావేశమై అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి, జాతీయ పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం కోసం పంపించ నుంది. 14న రాత్రికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆ జాబితాను తీసుకెళ్లనున్నారు. 15న పార్లమెంట రీ బోర్డు సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేసి, ఢిల్లీలోనే ప్రకటించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment