తాండూరు: త్వరలోనే ఏపీఎస్‌ఆర్టీసీ విభజన జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా తాండూరులో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత ఏపీఎస్‌ఆర్టీసీని రెండుగా విభజించే ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందన్నారు. రెండు మూడు నెలల్లో ఆర్టీసీ విభజన ప్రక్రియ పూర్తవుతుందని ఆయన సూచనప్రాయంగా చెప్పారు.
తెలంగాణలో ఆర్టీసీని లాభాల్లోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర సీఎం చంద్రశేఖర్‌రావు ప్రత్యేక దృష్టిసారించారన్నారు. ఇక్కడ ఆర్టీసీకి ఎందుకు నష్టాలు వస్తున్నాయి, వాటిని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఆర్టీసీ అధికారులతో సమీక్షిస్తున్నట్టు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోల్చితే తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారని, ఆదాయం కూడా అధికమేనని మంత్రి అన్నారు. తెలంగాణలో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీలో సంస్కరణలకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోందన్నారు.
ఇందులో భాగంగా ముంబయి తరహాలో సిటీ బస్సులను ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తున్నందన్నారు. ఈనెల 20వ తేదీ తరువాత ముంబయికి తాను వెళ్లనున్నట్టు చెప్పారు. ముంబయిలో ఆర్టీసీ ప్రయాణికులకు అందిస్తున్న సేవలు, నగర ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా సిటీ బస్సులు నడుపుతున్న పద్ధతులు, ట్రాఫిక్ నియంత్రణకు పాటిస్తున్న పద్ధతులను అధ్యయనం చేయడానికి ముంబయికి వెళ్లనున్నట్టు మంత్రి వివరించారు.
ముంబయి తరహాలో తెలంగాణలోని జిల్లాల్లో సిటీ బస్సులు నడిపించేందుకు ఇటీవలనే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని కలిసి, 500 బస్సులు కావాలని కోరినట్టు మంత్రి తెలిపారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని, తెలంగాణకు సుమారు 200-300 కొత్త బస్సులు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలలో రూ.80కోట్లతో 80 సిటీ బస్సులు నడపనున్నట్టు చెప్పారు. ఈ బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ 50 శాతం, కేంద్ర ప్రభుత్వం 35 శాతం, రాష్ట్రం 15 శాతం నిధులను భరిస్తాయని మంత్రి వివరించారు. ఆయా జిల్లాల్లో ఐదు నిమిషాలకు ఒకసారి సిటీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయన్నారు.
తెలంగాణలో తీవ్ర రూపం దాల్చిన విద్యుత్ సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి చెప్పారు. రెండుమూడేళ్లు తెలంగాణలో కరెంట్‌కష్టాలు తప్పవన్నారు. సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి కరెంట్ కొనుగోలు చేసేందుకు సీఎం ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. క్రెడిట్ కో-ఆపరేటివ్ సోసైటీ(సీసీఎస్) నిధుల వ్యయం విషయమై సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖతో మాట్లాడి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొ.జయశంకర్ పేరు పెట్టడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు జయశంకర్ జీవితాన్నే త్యాగం చేశారని కొనియాడారు. శంషాబాద్ విమానాశ్రయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని, దాని పేరు మార్పుపై తాను మాట్లాడలేనని పేర్కొన్నారు.
త్వరలో ఆర్టీసీ విభజన
Published Sat, Aug 9 2014 12:31 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
Advertisement
Advertisement