కేసీఆర్ తాట తీస్తాం!
నరేంద్రమోడీని, దళిత నాయకులను తిడితే ఊరుకోబోం
తెలంగాణ నీవల్లే వచ్చిందని విర్రవీగొద్దు
ఒక్కో ఎంపీ సీటు 30కోట్లకు అమ్ముకున్నావ్!
హరీశ్‌రావుకు బొత్సతో కేబుల్ వ్యాపారాలు
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలు
హుస్నాబాద్: బీసీ వర్గానికి చెందిన నరేంద్రమోడీని, దళిత నాయకులను తిట్టినా, ఆరోపణలు చేసినా టీఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖరరావు తాట తీస్తామని జనసేన పార్టీ అధిపతి పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తనకు పిరికితనం చిన్నప్పటి నుంచీ లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన వరంగల్ జిల్లా పాలకుర్తి, కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లలో జరిగిన ప్రచారంలో మాట్లాడారు. ఎందరో విద్యార్థులు, యువకులు ప్రాణాలర్పించడంతోపాటు ఎర్రబెల్లి దయాకర్‌రావు వంటి అనేక మంది నేతల కృషి ద్వారానే తెలంగాణ వచ్చిందన్నారు. ‘‘కేసీఆర్ తన వల్లే తెలంగాణ వచ్చిందని విర్రవీగుతున్నారు. అది సరికాదు. ఎప్పుడూ ఆంధ్రావాళ్లను తిట్టే కేసీఆర్ కుటుంబం వారితోనే వ్యాపారాలు చేస్తోంది. కేసీఆర్ ఒక్కో ఎంపీ సీటుకు రూ.30 కోట్లు వసూలు చేశారు.
ఆంధ్రావాళ్ల బంధువులకే టికెట్లిచ్చారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో హరీష్‌రావుకు కేబుల్ వ్యాపారాలున్నాయి. కేసీఆర్ కూతురు కవిత ఆంధ్ర వ్యాపారుల వద్ద చందాలు వసూలు చేశారు. కేటీఆర్ ఆంధ్రలో చదువుకున్నారు’’ అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే దారుణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రాన్ని పాలించే సత్తా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు లేదని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాలేదని, బీజేపీతోనే తెలంగాణ వచ్చిందని చెప్పారు. తుదిశ్వాస వరకు దేశం కోసమే పనిచేస్తానన్న పవన్... దమ్ము, సత్తా లేని కాంగ్రెస్ నేతలు తెలంగాణను పాలించలేరని, ఆ పార్టీని నుంచి దేశం నుంచి సాగనంపాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్‌లో మద్దతు తెలిపినందుకే బీజేపీకి తన సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు.తొర్రూరులో పవన్‌కల్యాణ్‌తోపాటు ఎంపీ అభ్యర్థి పరమేశ్వర్, ఎమ్మెల్యే అభ్యర్థి దయాకర్‌రావు, వర్ధన్నపేట ఎంఎస్‌పీ ఎమ్మెల్యే అభ్యర్థి మంద కృష్ణమాదిగ పాల్గొనగా... హుస్నాబాద్‌లో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి చెన్నమనేని విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు.