జైపూర్‌లో మూడో యూనిట్!
విద్యుత్ కొరతను అధిగమించే దిశగా సీఎం నిర్ణయం
నిర్మాణంలోని ఈ ప్లాంట్‌లో ప్రస్తుతం 600 మెగావాట్ల రెండు యూనిట్లు
తాజాగా మరో 600 మెగావాట్ల యూనిట్ నెలకొల్పాలని నిర్ణయం
ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశం
ఈ యూనిట్ విద్యుత్ మొత్తం తెలంగాణకే!
నేటి సింగరేణి బోర్డు సమావేశంలో ప్రతిపాదనలు
సాక్షి, ఆదిలాబాద్ / హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ సమస్యను ఎదుర్కోవడానికి చర్యలు చేపడుతున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు.. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద సింగరేణి నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రంలో అదనంగా మరో యూనిట్ (600 మెగావాట్లు)ను కూడా నెలకొల్పాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సింగరేణి ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జైపూర్‌లో ఒక్కోటి 600 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ గురువారం మంత్రులు, సింగరేణి, బీహెచ్‌ఈఎల్, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి ప్లాంటు నిర్మాణ పనులను పరిశీలించారు.
తరువాత అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించి... పనుల ప్రగతిపై సంబంధిత సంస్థల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టులో మరో యూనిట్‌ను అదనంగా నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం జరగనున్న సింగరేణి బోర్డు సమావేశంలో మూడో యూనిట్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తీసుకుని, ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఆదేశించారు. ప్లాంటు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని.. నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. మూడో యూనిట్ నెలకొల్పేందుకు అవసరమైన మౌలిక వసతుల విషయమై సీఎం ఆరా తీశారు. చివరగా ఏరియల్ సర్వే కూడా చేసి విద్యుత్ కేంద్రం పనులను పరిశీలించారు.
నిర్వాసితులను ఆదుకుంటాం..
జైపూర్ విద్యుత్ ప్లాంటు నిర్మాణంతో భూములు కోల్పోయిన నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నిర్వాసిత కుటుంబాల్లో అర్హులైన వారికి ప్లాంటులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం వెంట మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎంపీలు కె.కేశవరావు, గోడం నగేష్, బాల్క సుమన్, పార్లమెంటరీ సెక్రటరీ కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ వెంకట్రావు, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, జి.విఠల్‌రెడ్డి, నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, రేఖా శ్యాంనాయక్, రాథోడ్ బాబూరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.
సింగరేణిపైనే ఆశలు!
రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సింగరేణి చేపట్టిన కొత్త ప్రాజెక్టులపైనే రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం జైపూర్ ప్లాంట్‌లో రెండు యూనిట్లు కూడా ఇప్పటికే పూర్తి కావాల్సినా... ఆలస్యమయ్యాయి. 2016 మార్చిలో మొదటి యూనిట్, 2016 అక్టోబర్‌లో రెండో యూనిట్ అందుబాటులోకి వస్తుందని సింగరేణి అధికారులు సీఎంకు వివరించారు. ఇక్కడి 1,200 మెగావాట్లలో సింగరేణి తమ సొంత అవసరాలకు 150 మెగావాట్లు వాడుకోనుంది. మిగతా 1,050 యూనిట్ల విద్యుత్‌ను విక్రయిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న ఒప్పందం కావటంతో ఇందులో 53.89 శాతం (సుమారు 3,855 మిలియన్ యూనిట్లు) వాటా తెలంగాణకు దక్కుతుంది. అయితే జైపూర్ ప్లాంటులో ప్రస్తుతం నిర్మించతలపెట్టిన మూడో యూనిట్ నుంచి ఉత్పత్తయ్యే 600 మెగావాట్ల విద్యుత్‌ను మొత్తంగా తెలంగాణ రాష్ట్రమే వాడుకునే అవకాశముంది.
విద్యుత్‌పైనే సీఎం ఫోకస్..!
రాష్ట్రంలో విద్యుత్ సమస్యను అధిగమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నారు. మూడు రోజులుగా ఆయన విద్యుత్ అంశంపైనే దృష్టిపెట్టడం గమనార్హం. మంగళవారం కృష్ణా తీరంలోని దామరచెర్ల మండలంలో సీఎం ఏరియల్ సర్వే చేసి... థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించారు. ఏకంగా 7,600 మెగావాట్ల సామర్థ్యంతో ఎన్టీపీసీ, టీజెన్‌కో ఆధ్వర్యంలో విద్యుత్ కేంద్రాలను నిర్మించాలని అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నారు. గుర్తించిన భూములు రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉండటంతో.. అప్పటికప్పుడు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు ఫోన్ చేసి ఆ విషయాన్ని చర్చించారు.
800 మెగావాట్ల సోలార్, పనవ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ఒక సంస్థ ముందుకురాగా.. ఉత్పత్తికి అవకాశాలను అధ్యయనం చేయాలని బుధవారం అధికారులను ఆదేశించారు. అదనంగా 2 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక గురువారం జైపూర్ లో మరో 600 మెగావాట్ల యూనిట్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు.