Shortage of electricity
-
జైపూర్‌లో మూడో యూనిట్!
విద్యుత్ కొరతను అధిగమించే దిశగా సీఎం నిర్ణయం నిర్మాణంలోని ఈ ప్లాంట్‌లో ప్రస్తుతం 600 మెగావాట్ల రెండు యూనిట్లు తాజాగా మరో 600 మెగావాట్ల యూనిట్ నెలకొల్పాలని నిర్ణయం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశం ఈ యూనిట్ విద్యుత్ మొత్తం తెలంగాణకే! నేటి సింగరేణి బోర్డు సమావేశంలో ప్రతిపాదనలు సాక్షి, ఆదిలాబాద్ / హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ సమస్యను ఎదుర్కోవడానికి చర్యలు చేపడుతున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు.. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద సింగరేణి నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రంలో అదనంగా మరో యూనిట్ (600 మెగావాట్లు)ను కూడా నెలకొల్పాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సింగరేణి ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జైపూర్‌లో ఒక్కోటి 600 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ గురువారం మంత్రులు, సింగరేణి, బీహెచ్ఈఎల్, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి ప్లాంటు నిర్మాణ పనులను పరిశీలించారు. తరువాత అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించి... పనుల ప్రగతిపై సంబంధిత సంస్థల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టులో మరో యూనిట్‌ను అదనంగా నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం జరగనున్న సింగరేణి బోర్డు సమావేశంలో మూడో యూనిట్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తీసుకుని, ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఆదేశించారు. ప్లాంటు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని.. నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. మూడో యూనిట్ నెలకొల్పేందుకు అవసరమైన మౌలిక వసతుల విషయమై సీఎం ఆరా తీశారు. చివరగా ఏరియల్ సర్వే కూడా చేసి విద్యుత్ కేంద్రం పనులను పరిశీలించారు. నిర్వాసితులను ఆదుకుంటాం.. జైపూర్ విద్యుత్ ప్లాంటు నిర్మాణంతో భూములు కోల్పోయిన నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నిర్వాసిత కుటుంబాల్లో అర్హులైన వారికి ప్లాంటులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం వెంట మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎంపీలు కె.కేశవరావు, గోడం నగేష్, బాల్క సుమన్, పార్లమెంటరీ సెక్రటరీ కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ వెంకట్రావు, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, జి.విఠల్‌రెడ్డి, నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, రేఖా శ్యాంనాయక్, రాథోడ్ బాబూరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు. సింగరేణిపైనే ఆశలు! రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సింగరేణి చేపట్టిన కొత్త ప్రాజెక్టులపైనే రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం జైపూర్ ప్లాంట్‌లో రెండు యూనిట్లు కూడా ఇప్పటికే పూర్తి కావాల్సినా... ఆలస్యమయ్యాయి. 2016 మార్చిలో మొదటి యూనిట్, 2016 అక్టోబర్‌లో రెండో యూనిట్ అందుబాటులోకి వస్తుందని సింగరేణి అధికారులు సీఎంకు వివరించారు. ఇక్కడి 1,200 మెగావాట్లలో సింగరేణి తమ సొంత అవసరాలకు 150 మెగావాట్లు వాడుకోనుంది. మిగతా 1,050 యూనిట్ల విద్యుత్‌ను విక్రయిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న ఒప్పందం కావటంతో ఇందులో 53.89 శాతం (సుమారు 3,855 మిలియన్ యూనిట్లు) వాటా తెలంగాణకు దక్కుతుంది. అయితే జైపూర్ ప్లాంటులో ప్రస్తుతం నిర్మించతలపెట్టిన మూడో యూనిట్ నుంచి ఉత్పత్తయ్యే 600 మెగావాట్ల విద్యుత్‌ను మొత్తంగా తెలంగాణ రాష్ట్రమే వాడుకునే అవకాశముంది. విద్యుత్‌పైనే సీఎం ఫోకస్..! రాష్ట్రంలో విద్యుత్ సమస్యను అధిగమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నారు. మూడు రోజులుగా ఆయన విద్యుత్ అంశంపైనే దృష్టిపెట్టడం గమనార్హం. మంగళవారం కృష్ణా తీరంలోని దామరచెర్ల మండలంలో సీఎం ఏరియల్ సర్వే చేసి... థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించారు. ఏకంగా 7,600 మెగావాట్ల సామర్థ్యంతో ఎన్టీపీసీ, టీజెన్‌కో ఆధ్వర్యంలో విద్యుత్ కేంద్రాలను నిర్మించాలని అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నారు. గుర్తించిన భూములు రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉండటంతో.. అప్పటికప్పుడు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు ఫోన్ చేసి ఆ విషయాన్ని చర్చించారు. 800 మెగావాట్ల సోలార్, పనవ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ఒక సంస్థ ముందుకురాగా.. ఉత్పత్తికి అవకాశాలను అధ్యయనం చేయాలని బుధవారం అధికారులను ఆదేశించారు. అదనంగా 2 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక గురువారం జైపూర్ లో మరో 600 మెగావాట్ల యూనిట్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. -
తెలంగాణ వచ్చిందన్న సంతోషమే లేదు
ప్రకృతి సహకరించకే ఈ కష్టాలు కరెంటును కొనుగోలు చేస్తే రాదు టీడీపీ శవరాజకీయాలు తగవు ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ హుజూరాబాద్: వర్షాభావం.. కరెంటు కొరతతో తెలంగాణ సాధించుకున్న సంతోషం కనిపిం చడం లేదని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఈ కష్టాలకు ప్రకృతి సహకరించకపోవడమే కారణమన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ శివారులోని కేసీ క్యాంపులో 220 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ల్లోనే కాకుండా ఈసారి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో నూ కరువు నెలకొందని ఆవేదన చెందారు. దీనిని అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు రాజకీ యం చేస్తున్నారని మండిపడ్డారు. శవరాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. కరెంటు కొంటే వస్తుందా..? కరెంటును కొనుగోలు చేయాలని అర్థం లేకుండా విమర్శలు చేయడం అనాలోచితమని ఈటెల అన్నారు. కొనుగోలు చేసినంత మాత్రాన అక్కడి నుంచి ఇక్కడకు లైన్లు ఉండొద్దా? అని ప్రశ్నించారు. ఆంధ్ర పాలకులు ఆ లైన్లన్నీ వారివైపే వేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణకు 6,700 మెగావాట్ల విద్యుత్ అవసరముండగా, 4వేల పైచిలుకు మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే ఉందన్నారు. డిసెంబర్లో శంకుస్థాపన కరీంనగర్ జిల్లా రామగుండంలో 1,300 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు డిసెంబర్ మొదటి వారంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నామని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ చెప్పారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో కూడా 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈటెల సభపై తేనెటీగల దాడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ శివారు కేసీ క్యాంపులో మంగళవారం మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్న ఓ సభపై తేనెటీగలు దాడి చేశాయి. ఇక్కడ మంత్రి 220 కేవీ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. అనంత రం మంత్రి మాట్లాడుతుండగా పక్కనే ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా ఈటెల, కలెక్టర్ వీరబ్రహ్మయ్యను చుట్టుముట్టాయి. పోలీసులు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది టవల్స్ తెచ్చి వారిపై రక్షణగా కప్పారు. పావుగంట అనంతరం మళ్లీ సభను కొనసాగించారు. -
కేసీఆర్‌కు చేతకాకుంటే మేం చేసి చూపుతాం
కరెంటు కోతల నివారణపై ఎర్రబెల్లి, రేవంత్ సవాల హైదరాబాద్: కరెంటు కొరతను తీర్చడం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చేతకాకుంటే తాము చేసి చూపిస్తామని టీడీపీ ముఖ్యనేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి సవాల్ చేశారు. సోవువారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టుభవన్లో పార్టీ అధినేత చంద్రబాబును కలసిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రైతుల కష్టాన్ని తీర్చకుండా, సమస్యలను పరిష్కరించకుండా, పాలించడం చేతకాక తవు పార్టీ అధినేత చంద్రబాబుపై కేసీఆర్ అక్కసు వెళ్లగక్కుతున్నారని ఎర్రబెల్లి విమర్శించారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ఆంధ్రా, తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధిపొందాలని కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. విద్యుత్ సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టకుండా అటు కేంద్రంతోనూ, ఇటు ఇరుగుపొరుగు రాష్ట్రాలతోనూ గొడవలు పెట్టుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌తోపాటు కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్‌రావు తప్ప ఎవరూ సంతోషంగా లేరని రేవంత్ రెడ్డి విమర్శించారు. జిల్లాల్లో పర్యటన తెలంగాణలో రైతుల సమస్యలపై పోరుబాట పట్టాలని టీటీడీపీ నిర్ణయించింది. ఈ అంశంపై సోవువారం పార్టీ అధినేత చంద్రబాబుతో ముఖ్యనేతలు ఎల్.రమణ, రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు సమావేశమయ్యారు. తెలంగాణ ముఖ్యనేతలంతా ఒకే వాహనంలో జిల్లాల వారీగా పర్యటించాలని నిర్ణరుుంచారు. స్థానిక సమస్యలపై ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు, సభలను నిర్వహించాలని నిర్ణయించారు. -
ఇక పల్లెల్లో సౌర వెలుగులు!
- కరెంటు కొరతకు అధిగమించేందుకు సర్కార్ ప్లాన్ - సిద్దిపేట కేంద్రంగా ప్రయోగం - 3 గ్రామాల్లో పెలైట్ ప్రాజెక్ట్ - ఫలిస్తే తెలంగాణ అంతటా అమలు సిద్దిపేట రూరల్: తెలంగాణను పట్టిపీడిస్తున్న కరెంటు కొరతను అధిగమించేందుకు సర్కార్ ప్లాన్ సిద్ధం చేసింది. గుజరాత్ లాగా మన రాష్ట్రంలోనూ సౌర విద్యుత్‌తో పల్లెల్లో వెలుగులు నింపాలని భావిస్తోంది. ఇందుకోసం సిద్దిపేట కేంద్రంగా ప్రయోగం ప్రారంభించింది. సోలార్ ప్రాజెక్టు ప్రయోగం కోసం సిద్దిపేట మండలంలోని మూడు గ్రామాలను ఎంపిక చేసిన సర్కార్ నాలుగు దశల్లో ఇక్కడ ప్రయోగాలు చేసి ఫలితాలను సమీక్షించాక సౌరకాంతులను తెలంగాణ అంతటా ప్రసరింపజేయాలని భావిస్తోంది. గుజరాత్‌ను ఆదర్శంగా... బంగారు తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ సర్కార్ కరెంటు కొరతను అధిగమించడమే ప్రధాన లక్ష్యంగా ఎం చుకుంది. ఇందుకోసం గుజరాత్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని సోలార్ ప్రాజెక్టు చేపట్టింది. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సూచన మేరకు సిద్దిపేట కేంద్రంగా నాబార్డ్, మెడ్క్యాబ్లఆధ్వర్యంలో సోలార్ ప్రాజెక్టు చేపట్టిన అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. సోలార్ ప్రయోగాలకు వేదికలుగా నిలిచిన సిద్దిపేట మండలం ఎల్లుపల్లిలో ఆండ్రోమెడ సోలార్ పవర్ ప్యాక్ కంపెనీ, బంజారుపల్లిలో టాటా సోలార్, కోదండరావుపల్లిలో సైబర్ మోషన్ కంపెనీలు సోలార్ పరికరాలను అమర్చడం, సరఫరా చేయడం బాధ్యతలను స్వీకరించాయి. ఈ క్రమంలోనే ఆయా కంపెనీల ప్రతినిధులు శనివారం గ్రామాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వీరికి విద్యుత్, రెవెన్యూ, వ్యవసాయ తదితర శాఖల అధికారులు సహకరిస్తున్నారు. తొలిదశలో సోలార్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేసి సౌర శక్తితో తయారైన విద్యుత్‌ను గ్రామాల్లోని అన్ని ఇళ్లకు సరఫరా చేస్తారు. ఈ ప్రయోగ ఫలితాన్ని పరిశీలించిన అనంతరం రెండో దశలో గ్రామంలోని వ్యవసాయ బావుల వద్ద సోలార్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసి పంపుసెట్లకు సౌరశక్తిని సరఫరా చేస్తారు. మూడో దశలో ఉత్పత్తి చేసిన సౌర శక్తిని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ద్వారా సరఫరా చేసే విధానాన్ని అమలు పరుస్తారు. ఈ మూడు దశల అనంతరం ఏవైనా లోపాలు తలెత్తితే వాటిని సవరించి పక్కాగా సౌర విద్యుత్‌ను తయారు చేసి గ్రామంలోని అన్ని విద్యుత్ అవసరాలకు సరఫరా చేస్తారు. ఈ మూడు గ్రామాల్లో సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్‌లు విజయవంతమైన అనంతరం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు దశల వారీగా విస్తరించడానికి నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు సోలార్ కంపెనీల ప్రతినిధులు చర్చలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని విద్యుత్ వినియోగంపై సర్వే ప్రారంభమైంది. 15 రోజుల్లో ఈ సోలార్ పవర్ పెలైట్ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.