తెలంగాణ వచ్చిందన్న సంతోషమే లేదు
ప్రకృతి సహకరించకే ఈ కష్టాలు
కరెంటును కొనుగోలు చేస్తే రాదు
టీడీపీ శవరాజకీయాలు తగవు
ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్
హుజూరాబాద్: వర్షాభావం.. కరెంటు కొరతతో తెలంగాణ సాధించుకున్న సంతోషం కనిపిం చడం లేదని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఈ కష్టాలకు ప్రకృతి సహకరించకపోవడమే కారణమన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ శివారులోని కేసీ క్యాంపులో 220 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్‌ల్లోనే కాకుండా ఈసారి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో నూ కరువు నెలకొందని ఆవేదన చెందారు. దీనిని అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు రాజకీ యం చేస్తున్నారని మండిపడ్డారు. శవరాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు.
కరెంటు కొంటే వస్తుందా..?
కరెంటును కొనుగోలు చేయాలని అర్థం లేకుండా విమర్శలు చేయడం అనాలోచితమని ఈటెల అన్నారు. కొనుగోలు చేసినంత మాత్రాన అక్కడి నుంచి ఇక్కడకు లైన్లు ఉండొద్దా? అని ప్రశ్నించారు. ఆంధ్ర పాలకులు ఆ లైన్లన్నీ వారివైపే వేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణకు 6,700 మెగావాట్ల విద్యుత్ అవసరముండగా, 4వేల పైచిలుకు మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే ఉందన్నారు.
డిసెంబర్‌లో శంకుస్థాపన
కరీంనగర్ జిల్లా రామగుండంలో 1,300 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు డిసెంబర్ మొదటి వారంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నామని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ చెప్పారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో కూడా 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
ఈటెల సభపై తేనెటీగల దాడి
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ శివారు కేసీ క్యాంపులో మంగళవారం మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్న ఓ సభపై తేనెటీగలు దాడి చేశాయి. ఇక్కడ మంత్రి 220 కేవీ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. అనంత రం మంత్రి మాట్లాడుతుండగా పక్కనే ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా ఈటెల, కలెక్టర్ వీరబ్రహ్మయ్యను చుట్టుముట్టాయి. పోలీసులు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది టవల్స్ తెచ్చి వారిపై రక్షణగా కప్పారు. పావుగంట అనంతరం మళ్లీ సభను కొనసాగించారు.