సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీలో ప్రవేశపెట్టనున్న మినీ ఏసీ ఎలక్ట్రికల్ బస్సుల మోడల్‌ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చైనాకు చెందిన బీవైడీ బస్సు కంపెనీ జీఎం లియో జూలింగ్, ఈడీ జాంగ్ జీ, ఇతర ప్రతినిధులతో కేసీఆర్ చర్చించారు. బస్సుల పనితీరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మూడు గంటలపాటు చార్జింగ్ చేస్తే 300 నుంచి 400 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ ప్రతినిధులు సీఎంకు వివరించారు. అనంతరం బీవైడీ ప్రతినిధులతో కలిసి కేసీఆర్ ప్రగతి భవన్ ఆవరణలో కాసేపు బస్సులో చక్కెర్లు కొట్టారు.
జీహెచ్‌ఎంసీలో ఎలక్ట్రికల్ బస్సులతో వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని, తక్కువ ఖర్చుతో పాటు, పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తాయని సీఎం ఈ సందర్భంగా వెల్లడించారు. మొదటి విడతగా హైదరాబాద్‌లో 500 బస్సులు ప్రవేశ పెట్టేందుకు వీలుగా సీఎం కంపెనీ ప్రతినిధులను వివరాలు ఆరా తీశారు. దీనిపై స్పందించిన బీవైడీ ప్రతినిధులు అవసరం అయితే ప్లాంట్ పెట్టడానికి సిద్దమని వెల్లడించినట్లు సమాచారం. చైనా బయట తొలిసారి తెలంగాణలో తమ యూనిట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖా మంత్రి మహేందర్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ రమణారావు, ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment