సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిరంకుశత్వానికి పరాకాష్ట అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సీఎం పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే సంపత్ కుమార్ గృహ నిర్బంధం దారుణమని ఆయన మండిపడ్డారు. ఒక దళిత శాసనసభ సభ్యుడిని గృహ నిర్బంధం చేయడం దారుణమని, ఇది ప్రభుత్వానికి తగదని హితవు పలికారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ఎమ్మెల్యే సంపత్ పోరాడి సాధించారని పేర్కొన్నారు. గట్టు ఎత్తిపోతల పథకానికి గత కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం పనులు చేపట్టడం లేదని ఆరోపించారు.
దళిత శాసన సభ్యుడైనందువల్లే సంపత్‌ను టీఆర్‌ఎస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వేధిస్తోందని, ఇందులో భాగంగానే శాసన సభ్యత్వాన్ని రద్దు చేసిందని ఉత్తమ్ ధ్వజమెత్తారు. హైకోర్టు రెండు సార్లు ఆదేశించినా కూడా కేసీఆర్ పట్టించుకోకుండా కోర్టు ఆదేశాలను ధిక్కరించారని మండిపడ్డారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యేను పాల్గొననివ్వాలని, తన నియోజకవర్గంలోని సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ క్యాంప్ కార్యాలయంలో అధికారులు భారీగా పోలీసులను మొహరించారు. ఎమ్మెల్యేను గృహ నిర్బంధం చేశారు. దీనిపై కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీ నేతలు భగ్గుమన్నారు. ఒక ఎమ్మెల్యేకు తన నియోజక వర్గంలోని సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పుకొనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment