సంపత్ కుమార్
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగాన్ని విస్మరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నాయని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మండిపడ్డారు. ప్రభుత్వాల తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఇందిరా పార్కులో సోమవారం దీక్ష చేపట్టింది. ఈ ధర్నాలో ఆయనతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కుంతియా, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమారుతో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంపత్ కమార్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని బీజేపీ అడ్డుకోవాలని చూస్తుందన్నారు. రిజర్వేషన్లను పున సమీక్షిస్తామని సుప్రీంకోర్టు తీర్పుతో దేశవ్యాప్తంగా బడుగు, బలహీనవర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దళితులు, బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్‌కు వ్యతిరేకంగా అడుగులు పడుతున్నాయని, మానవ హక్కులను కాపాడుకోవడానికి పోరాటం చేయవలసిన దౌర్బాగ్యం వచ్చిందన్నారు. రాజ్యాంగంలో ఉన్న వాటిని అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ అని.. తమ పార్టీ బీదల పార్టీ అని ఆయన పేర్కొన్నారు.
ఓబీసీ సెల్ చైర్మన్ కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ.. అంబేద్కర్ భావజాలాన్ని అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ అని.. సుప్రీంకోర్టు తీర్పు కొన్ని వర్గాల వారికి మాత్రమే అనుకూలంగా ఉందని ధ్వజమెత్తారు. బడుగు బలహీన వర్గాల వారిని హీనంగా చూస్తున్న అగ్రవర్ణాల వారికి అనుకూలంగా ఈ తీర్పు ఉందన్నారు. బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లపై సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్ళిందో చెప్పాలన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకోవాలన్నారు. ఈ కుట్ర వెనుక మోహన్ భగవత్ ఉన్నారని ఆరోపించారు. తెలంగాణలో బీసీల రిజర్వేషన్లు తగ్గిస్తే బీసీ నాయకుడుగా చెప్పుకునే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించింది కూడా కాంగ్రెస్‌మే అని తెలిపారు. దేశంలో 80 శాతం ఉన్న బడుగు బలహీన వర్గాల నుంచి తొలగించి.. అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించారని, రిజర్వేషన్లపై దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment