protest deeksha
-
న్యాయ నిపుణులతో రెజ్లర్ల చర్చలు
న్యూఢిల్లీ: పోలీసుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ భారత స్టార్ రెజ్లర్లు తమ నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు కావడం, సుప్రీంకోర్టులో కేసు విచారణ ముగియడం... ఢిల్లీ న్యాయపరిధిలో తేల్చుకోవాలన్న కోర్టు సూచనపై రెజ్లర్లు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ‘శుక్రవారం రెండు కమిటీలు ఏర్పాటు చేశాం. ఖాప్ పంచాయత్, రైతులు, మహిళా సంఘాలకు చెందిన 31 మంది సభ్యులున్న ఒక కమిటీ, తొమ్మిది మంది సభ్యులుగా ఉన్న మరో కమిటీని ఏర్పాటు చేశాం. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ నిజం వైపు నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముగ్గురు రెజ్లర్లకే ఈ పోరాటం పరిమితం కాదు. హైకోర్టుకు వెళ్లి మళ్లీ మా పోరాటం మొదలుపెట్టే అవకాశాలున్నాయి’ అని రెజ్లర్ బజరంగ్ పూనియా తెలిపాడు. దర్యాప్తుతోనే వాస్తవాలు: క్రీడల మంత్రి ఠాకూర్ ‘రెజ్లర్ల డిమాండ్లన్నీ తీరుతాయి. ముందయితే ఢిల్లీ పోలీసుల దర్యాప్తు జరగనివ్వండి. దీనిపై సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. విచారణలో పోలీసులు పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేటతెల్లం చేస్తే... న్యాయబద్ధంగా గట్టి చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది’ అని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. గంగూలీ ఏమన్నాడంటే... భారత జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ‘రెజ్లర్లు దేశానికెంతో చేశారు. అంతర్జాతీయ వేదికలపై పతకాలతో కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. వారి పోరాటం వాళ్లని చేసుకోనివ్వండి. ఈ వ్యవహారంపై నాకు పూర్తి వివరాలు తెలియదు. పత్రికల్లో చదివిందే! ఏదేమైనా ఈ వివాదం త్వరలోనే పరిష్కారం కావాలని ఆశిస్తున్నా’ అని అన్నాడు. -
‘ఆ కుట్ర వెనుక మోహన్ భగవత్’
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగాన్ని విస్మరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నాయని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మండిపడ్డారు. ప్రభుత్వాల తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఇందిరా పార్కులో సోమవారం దీక్ష చేపట్టింది. ఈ ధర్నాలో ఆయనతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కుంతియా, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమారుతో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంపత్ కమార్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని బీజేపీ అడ్డుకోవాలని చూస్తుందన్నారు. రిజర్వేషన్లను పున సమీక్షిస్తామని సుప్రీంకోర్టు తీర్పుతో దేశవ్యాప్తంగా బడుగు, బలహీనవర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దళితులు, బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్‌కు వ్యతిరేకంగా అడుగులు పడుతున్నాయని, మానవ హక్కులను కాపాడుకోవడానికి పోరాటం చేయవలసిన దౌర్బాగ్యం వచ్చిందన్నారు. రాజ్యాంగంలో ఉన్న వాటిని అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ అని.. తమ పార్టీ బీదల పార్టీ అని ఆయన పేర్కొన్నారు. ఓబీసీ సెల్ చైర్మన్ కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ.. అంబేద్కర్ భావజాలాన్ని అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ అని.. సుప్రీంకోర్టు తీర్పు కొన్ని వర్గాల వారికి మాత్రమే అనుకూలంగా ఉందని ధ్వజమెత్తారు. బడుగు బలహీన వర్గాల వారిని హీనంగా చూస్తున్న అగ్రవర్ణాల వారికి అనుకూలంగా ఈ తీర్పు ఉందన్నారు. బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లపై సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్ళిందో చెప్పాలన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకోవాలన్నారు. ఈ కుట్ర వెనుక మోహన్ భగవత్ ఉన్నారని ఆరోపించారు. తెలంగాణలో బీసీల రిజర్వేషన్లు తగ్గిస్తే బీసీ నాయకుడుగా చెప్పుకునే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించింది కూడా కాంగ్రెస్మే అని తెలిపారు. దేశంలో 80 శాతం ఉన్న బడుగు బలహీన వర్గాల నుంచి తొలగించి.. అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించారని, రిజర్వేషన్లపై దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. -
టికెట్ కోసం కాంగ్రెస్ అభ్యర్థి నిరసన..!
సాక్షి, సత్తుపల్లి(ఖమ్మం): పార్టీ టికెట్ రాకపోయే సరికి కొందరు రెబల్స్‌గా నామినేషన్ దాఖలు చేయగా..అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సత్తుపల్లి మున్సిపాలిటీ 11వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను ఆశిస్తున్న షేక్ ఖాదర్ అలీ శుక్రవారం ఏకంగా మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. నామినేషన్ స్క్రూట్నీ తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తామని కాంగ్రెస్ నాయకులు సముదాయించారు. 17వ వార్డులో బీజేపీ తరఫున నామినేషన్ వేయకుండా ఊట్ల లక్ష్మీని కిడ్నాప్ చేశారంటూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో నామినేషన్ కేంద్రం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఈ ఆరోపణలను అధికార టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఊట్ల లక్ష్మీని ఎవరూ కిడ్నాప్ చేయలేదని, అసలు ఆవిడ వచ్చిందో, లేదో స్పష్టత లేకుంటే ఎలా అని మండిపడుతుంది. చైర్మన్ వార్డులైన 2, 4, 22, 23వ వార్డుల్లో నామినేషన్లు వేసేందుకు ఆసక్తి కనబర్చారు. 16వ వార్డు జనరల్ అయినా బీసీ సామాజిక వర్గం నుంచి టిక్కెట్ కేటాయించే అవకాశాలు కన్పిస్తున్నాయి. సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులకు గాను మొత్తం 122 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు ప్రకటించారు. -
ప్రేమించి మోసం చేశాడు: యువతి నిరసన
సాక్షి, కారేపల్లి(ఖమ్మం): వెంటపడి ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి యువతిని మోసం చేసి.. మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ సంఘటన గురువారం కారేపల్లి మండల పరిధిలోని పోలంపల్లిలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. భాగ్యనగర్ తండాకు చెందిన వాంకుడోత్ సోనియా ఖమ్మంలో డిగ్రీ చదువుతోంది. తల్లిదండ్రులు వాంకుడోత్ లక్ష్మి, లాలు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. దీంతో సోనియాను తమ పెద్దకూతురు వద్ద ఉంచారు. అదే గ్రామానికి చెందిన అజ్మీరా సంపత్ పీజీ పూర్తి చేశాడు. డిగ్రీ చదువుతున్న సోనియా వెంటపడి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు. పెళ్లి విషయం ఎత్తగానే అక్కాచెల్లెళ్ల వివాహాల తర్వాత చేసుకుంటానంటూ నాలుగేళ్లుగా వాయిదా వేస్తున్నాడు. ఈ క్రమంలో మరో యువతితో పెళ్లి ఖరారు చేసుకున్నారని తెలియడంతో సోనియా బుధవారం సంపత్ ఇంటికి వచ్చి నిలదీసింది. పెళ్లి చేసుకోవాలని దీక్షకు దిగింది. ‘నిన్ను తప్ప మరొకరిని పెళ్ళి చేసుకోనని, మీ అమ్మనాన్నలను పిలిపించాలని’మళ్లీ నమ్మబలికాడు. పెద్దలు జోక్యం చేసుకోని గురువారం పంచాయితీ చేద్దామని, అప్పటివరకు ఎవరి ఇంటికి వారు వెళ్లాలని తెలిపారు. తీరా గురువారం సంపత్ ఇంటికి రాగా బుధవారం రాత్రే అతను పెళ్లి చేసుకున్నాడు. తనకు ప్రియుడితోనే వివాహం జరిపించాలని, అతనితోనే చావైనా, బతుకైనా అంటూ సంపత్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. తన తల్లిదండ్రులతో కలిసి కారేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టారు. -
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి!
సాక్షి, ఉట్నూర్(ఖానాపూర్): ఆదివాసీ మహిళా లోకం కదం తొక్కింది. ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఐటీడీఏ ముట్టడి నిర్వహించారు. సూమారు ఐదు వేలకు పైగా ఆదివాసీలు అందోళనలో పాల్గొనడంతో ఉట్నూర్ మండల కేంద్రంతో పాటు ఐటీడీఏలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ముందుగా ఆదివాసీలు మండల కేంద్రంలోని వీధుల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఏటీడీఏకు వేల సంఖ్యలో ఆదివాసీలు చేరుకోవడంతో ఉట్నూర్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఐటీడీఏ ప్రధాన రహదారిపై ఆదివాసీలు బైటాయించి నిరసన తెలిపారు. సబ్ కలెక్టర్ అక్కడకు చేరుకుని వారి నుంచి వినతిపత్రం స్వీకరించారు. అయినా ఆందోళనను ఆదివాసీలు విరమించలేదు. ఐటీడీఏ కార్యలయం వద్ద పోలీసులు భారికేడ్లు ఏర్పాటు చేయడమే కాకుండా కార్యాలయం లోకి ఎవరూ వెళ్లకుండా గేటుకు తాళం వేశారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని కలువాలంటూ పెద్ద ఎత్తున మహిళలు లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. పలువురు గోడపై నుంచి దూకి లోనికి వెళ్లగా మహిళలు ఒక్కసారిగా మరో గేటు నుంచి కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లారు. ఐటీడీఏ ప్రధాన ద్వారం వద్దకు బైటాయించి నిరసన తెలిపారు. అడిషనల్ ఎస్పీ రవికుమార్, డీఎస్పీ డేవిడ్‌లు ఆదివాసీలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆదివాసీ మహిళ సంఘం నాయకులు మాట్లాడుతూ ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలన్నారు. లంబాడీలకు ఏజెన్సీ ధ్రువపత్రాలు ఇవ్వకూడదన్నారు. ఇచ్చిన తహసీల్దార్లపై చర్యలు తీసుకోవాలన్నారు. టీఆర్టీలో తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించిన 25 మంది అభ్యర్థులపై చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ మహిళా సంఘం అధ్యక్షురాలు గోడం రేణుకబాయి, ఉపాధ్యక్షురాలు సోయం లలితబాయి, మహిళా నాయకులు మర్సకొల సరస్వతి, రంభబాయి, ఆత్రం సుగుణ, నాయకులు కనక వెంకటేశ్వర్లు, మర్సకొల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. కుమురం భీం విగ్రహానికి నివాళులు.. నార్నూర్: ఉట్నూర్‌లో నిర్వహించిన ఆదివాసీ మహిళల ఐక్యత ర్యాలీకి నార్నూర్, గాదిగూడ మండలాల నుంచి మహిళలు భారీగా తరలివెళ్లారు. మండల కేంద్రంలోని కుమురంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వారు మాట్లాడుతూ వలస వచ్చిన లంబాడీలతో ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ 9న ఢిల్లీలో నిర్వహిస్తున్న సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మహిళా నాయకులు అడ సీతాబాయి, ఆత్రం అనసూయ, కనక సరిత, మందాడి కౌసల్యబాయిలతో పాటు తుడందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు తొడసం నాగోరావు, మేస్రం శేఖర్, మండలాధ్యక్ష, కార్యదర్శలు మానిక్‌రావు, ప్రభాకర్, నాయకులు మాన్కు, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు. -
మృతదేహంతో స్టేషన్ ఎదుట ధర్నా
సాక్షి, ఆత్మకూరు(నెల్లూరు): భార్యాభర్తల మధ్య వివాదం నేపథ్యంలో కౌన్సెలింగ్ పేరుతో పోలీసులు తీవ్రంగా కొట్టడంతో ఓ వ్యక్తి అవమానంగా భావించి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి బంధువులు మృతదేహంతో జిల్లా ప్రభుత్వాస్పత్రి ఎదుట, పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. ఏఎస్‌పేట మండలం కొండమీద కొండూరు గ్రామానికి చెందిన దగ్గుమాటి కామిరెడ్డి (48) బోయిళచిరువెళ్లకు చెందిన సంపూర్ణమ్మను ద్వితీయ వివాహం చేసుకున్నాడు. అంతకు ముందే అతనికి వివాహమై ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. తొలి భార్య మృతి చెందటంతో సంపూర్ణమ్మను ద్వితీయ వివాహం చేసుకున్నాడు. మూడేళ్లుగా ఆ దంపతుల మధ్య విభేదాలు చోటు చేసుకోవడంతో విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో కాపురానికి తీసుకెళ్లాలని భర్తను కోరింది. ఆమె ప్రవర్తన మంచిది కాదని, తీసుకువెళ్లలేనని కామిరెడ్డి ఖరాఖండిగా చెప్పాడు. దీంతో ఆమె ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శుక్రవారం కామిరెడ్డిని కౌన్సెలింగ్ పేరుతో తీసుకువచ్చి తీవ్రంగా కొట్టారని, రెండు రోజుల పాటు స్టేషన్లోనే ఉంచారన్న అవమానం భరించలేక శనివారం సాయంత్రం టీ తాగి వస్తానని బయటకు వచ్చి పురుగు మందు తాగి స్టేషన్ ఆవరణలో పడిపోయాడు. పోలీసులు అతన్ని ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో పట్టణంలోని మరో ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. సోమవారం తెల్లవారు జామున పరిస్థితి తీవ్రంగా విషమించటంతో నెల్లూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. దీంతో మృతుడి బంధువులు కేవలం పోలీసులు కొట్టిన దెబ్బలు, చేసిన అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఇది పోలీసులు చేసిన హత్యేనని ఆత్మకూరు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అంతకు ముందు నెల్లూరు నుంచి కామిరెడ్డి మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఆత్మకూరులోని ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం కోసం తీసుకువచ్చారు. అప్పటికే ఆస్పత్రి వద్ద వివిధ పోలీస్స్టేషన్ల ఎస్సైలు, సిబ్బందితో మోహరించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, పోలీసులే దీనికి కారణమని మృతుడి బంధువులు పోస్టుమార్టం చేయనీకుండా అడ్డుకున్నారు. మృతదేహంతో పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేసేందుకు సిద్ధం కాగా పోలీసులు అడ్డుకున్నారు. ఒక దశలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంబులెన్స్‌లో నుంచి మృతదేహాన్ని దించి భుజాలపై మోసుకుంటూ 2 కి.మీ దూరంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. దారిలో పలుచోట్ల పోలీసులు అడ్డుకున్నా విఫలమయ్యారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్ ఎదుట రోడ్డుపై మృతదేహాన్ని ఉంచి ధర్నా నిర్వహించారు. సీఐ బి పాపారావుతో వాగ్వాదానికి దిగారు. తమ గ్రామం ఏఎస్‌పేట మండలానికి చెందినది అయినా ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌కు కామిరెడ్డిని ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. డీఎస్పీ వచ్చి సమాధానం చెప్పేంత వరకు ధర్నా విరమించబోమని భీషి్మంచుకు కూర్చున్నారు. డీఎస్పీ ఎస్.మక్బుల్ అక్కడికి చేరుకుని మృతుడి బంధువులతో చర్చించారు. అయితే పోలీసులపై కేసు నమోదు చేయాలని, ఇందుకు బాధ్యులను శిక్షించాలని, పోస్టుమార్టం సైతం వీడియో చిత్రీకరణ చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఒప్పుకున్న డీఎస్పీ ఫిర్యాదు ఇవ్వాలని బంధువులను స్టేషన్లోకి తీసుకెళ్లి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. దీంతో మృతుని బంధువులు శాంతించి పోస్టుమార్టం కోసం మృత దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తలించారు. గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉండే కామిరెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
ప్రియుడి ఇంటి ఎదుట యువతి ఆందోళన
సాక్షి, విజయవాడ(నందిగామ) : ఒంటరిగా ఉంటున్న మహిళను యువకుడు మాయ మాటలు చెప్పి లోబర్చుకుని గర్భవతిని చేసి ముఖం చాటేయటంతో బాధిత మహిళ బంధువులతో కలసి ప్రియుడి ఇంటి ముందు నిరసన చేపట్టిన ఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన తోట లక్ష్మీప్రసన్నకు మూడేళ్ల క్రితం కంచికచర్ల పట్టణానికి చెందిన యువకుడితో వివాహమైంది. ఇద్దరి మధ్య విబేధాలు రావటంతో విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో వెల్లంకి గ్రామానికి చెందిన షేక్ సలీం ఆమెకు దగ్గరయ్యాడు. వీరిరువురు కుటుంబ సభ్యులకు తెలియకుండా సుమారు రెండేళ్ల నుంచి ఇబ్రహీంపట్నంలో సహజీవనం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సలీం కుటుంబ సభ్యులు అతడిని స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఆ తరువాత కూడా కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆమెతో సంబంధం సాగించాడని మహిళ చెబుతోంది. ప్రస్తుతం ఆరు నెలల గర్భివతినని న్యాయం చేయాలని మహిళ కోరుతోంది. విషయం తెలుసుకున్న ఎస్ఐ రామగణేష్ గ్రామానికి చేరుకుని మహిళ, బంధువులతో మాట్లాడి అక్కడి నుంచి పంపించివేశారు. -
సిగ్నల్ టవర్‌పైకి ఎక్కి యువకుల నిరసన!
సాక్షి, తూర్పుగోదావరి(అమలాపురం) : అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని అధికారులు తొలగించిన ఘటన ఉప్పలగుప్తంలో తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్తతకు దారి తీసింది. రెండు రోజులుగా దళిత సంఘాలతో ఆందోళన, ధర్నాలు, రాస్తారోకోలతో ఉప్పలగుప్తం రగలిపోతుండగా తాజాగా బుధవారం ఉదయం ఐదుగురు దళిత యువకులు అధికారుల తీరును నిరసిస్తూ అక్కడే తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న సైక్లోన్ సిగ్నల్ టవర్‌పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఉప్పలగుప్తం మెయిన్ సెంటర్లో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. అనుమతులు లేవన్న కారణంతో ఆ విగ్రహాన్ని అధికారులు అక్కడి నుంచి తొలగించారు. దీనిపై దళిత సంఘాల నాయకులు నిరసనకు దిగడం... అధికారులను నిలదీయడం వంటి వరస పరిణామాలు తెలిసిందే. బుధవారం ఉదయం తిరిగి దళితుల ఉద్యమం మొదలైంది. ఆర్డీవో బి.వెంకటరమణ, డీఎస్పీ షేక్ మసూమ్ బాషా ఆధ్వర్యంలో అధికారులు కోనసీమ దళిత ఐక్యవేదిక నాయకులు డీబీ లోక్, ఇసుకపట్ల రఘుబాబు, గెడ్డం సురేష్‌బాబు, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ఎంఏకే భీమారావు, దళిత నాయకులు కొంకి వెంకట బాబ్జి, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు, బీఎస్పీ రాష్ట్ర నాయకుడు గెడ్డం సంపదరావు తదితరులతో పలుమార్లు నిర్వహించిన చర్చలు సఫలం కాలేదు. సమస్య పరిష్కారానికి అధికారులు మూడు రోజులు గడువు కోరినా దళిత నాయకులు ససేమిరా అన్నారు. తొలుత తొలగించిన విగ్రహాన్ని యథాస్థానంలో ఉంచాలని...తొలగించిన అధికారులను సస్పెండ్ చేయాలన్న డిమాండ్లు అధికారుల ముందు ఉంచారు. ఇదే సమయంలో సమస్య పరిష్కారం కావడం లేదన్న అసహనం, ఆగ్రహంతో ఐదుగురు దళిత యువకులు అక్కడే ఉన్న సైక్లోన్ సిగ్నల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి దిగడంతో ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పైన ఉన్న యువకులను దిగమని ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు దిగిరాలేదు. విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించకపోతే దూకి చనిపోతామన్న సంకేతాలు పంపించారు. వారు అన్నంత పని చేస్తారనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా అక్కడ నేలపై నెట్లు సిద్ధం చేశారు. సుమారు ఐదు గంటలపాటు టవర్‌పై యువకులు చేసిన హైరానాతో వాతావరణం వేడిక్కింది. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన దళితులు పెద్ద ఎత్తున అక్కడికి చేరడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మరోవైపు వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అంబేడ్కర్ విగ్రహాన్ని అక్కడ పునః ప్రతిష్టించేందుకు వీల్లేదంటూ కవ్వింపు చర్యలకు దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతాయని గ్రహించిన పోలీసులు అదనపు బలగాలను అక్కడకి రప్పించి భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. టవర్ ఎక్కిన యువకులు భార్యలు, తల్లులు వచ్చి దిగిపోమ్మని ఏడుస్తూ అభ్యర్ధించినా వారు దిగరాలేదు. పరిస్థితి చేజారిపోతుండడంతో దళిత నాయకులు సమన్వయం పాటించాలని యువకులను కోరారు. మరోసారి అధికారులతో చర్చించారు. సమస్య పరిష్కారానికి మూడు రోజుల గడువు ఇవ్వాలని అధికారులు కోరడంతో దళిత నాయకులు ఆందోళనకారులకు నచ్చజెప్పి పంపించారు. చివరకు యువకులు టవర్ దిగిరావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
భర్త ఇంటి ముందు వివాహిత నిరసన
సాక్షి, ఖమ్మం(సత్తుపల్లిటౌన్) : మాయమాటలు చెప్పి ప్రేమపెళ్లి చేసుకొని ఉడాయించాడని ఓ మహిళ భర్త ఇంటి ముందు నిరసన దీక్షకు దిగిన సంఘటన సత్తుపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలు కథనం ప్రకారం.. అశ్వారావుపేట మండలం అనంతారం గ్రామానికి చెందిన బాణోతు పద్మజ 2017లో సత్తుపల్లిలో ఇంటర్ చదివేటప్పుడు.. సత్తుపల్లిలోని శ్రీనివాసా టాకీస్‌రోడ్‌లోని షేక్ ఖుర్షీద్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. హైదరాబాద్‌లో చదువుకునేందుకు వెళ్లి ఇరువురు కలిసి తిరిగారు. రెండేళ్లు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పద్మజను మతమార్పిడి చేయించాడు. ఇరువైపుల పెద్దలకు తెలియకుండానే హైదరాబాద్‌లోని మోతినగర్‌లోని ఓ ఫంక్షన్హాల్లో ఎనిమిది నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. పెళ్లి తరువాత కొన్నిరోజులు హాస్టల్లో ఉండమని చెప్పి.. కాపురం పెట్టేందుకు ఆమె వద్ద నుంచి పొలం అమ్ముకొని వచ్చిన రూ.15 లక్షలను తీసుకొని సత్తుపల్లి వచ్చాడు. ఆ తర్వాత ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించటం లేదని వాపోయింది. మతం మారటంతో తన కుటుంబ సభ్యులు కూడా తనను ఇంటికి రానివ్వటంలేదని కన్నీళ్లు పెట్టింది. దీంతో సోమవారం నేరుగా సత్తుపల్లిలోని అతని ఇంటికి వచ్చింది. దీంతో ఖుర్షీద్ కుటుంబ సభ్యులు తమకు సంబంధం లేదంటూ దూషించటంతో ఆమె ఇంటి ముందే నిరసనకు దిగింది. సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ టి.సురేష్ తెలిపారు. -
భర్త ఇంటిముందు భార్య దీక్ష
సాక్షి, ఖమ్మం(పాల్వంచ) : పెళ్లికి ముందే మరో మహిళతో సహజీవనం చేయడమేగాక ఒక కూతురు ఉన్న విషయాన్ని దాచి తనను పెళ్ళి చేసుకున్నాడని, తనకు న్యాయం చేయాలని ఓ మహిళ అత్తారింటి ఎదుట బైటాయించింది. తనకు కూడా కూతురు పుట్టడంతో వదిలించుకోవాలని చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. పట్టణంలోని ఇందిరా కాలనీకి చెందిన ద్రాక్ష భాస్కర్ రావు రెండో కొడుకు వాసు బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన సునీతను 2018 ఫిబ్రవరి 24వ తేదీన వివాహం చేసుకున్నాడు. పెళ్ళి అయిన రెండో రోజే భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందనే విషయాన్ని తెలుసుకుని నిలదీసింది. అయితే గిట్టని వాళ్లు చేసే పని అని వాసు నమ్మించాడు. కొంత కాలానికి అది నిజమేనని అతడే భార్యకు చెప్పాడు. ఈ లోగా సునీత కూడా గర్భవతి కావడంతో పాటు వారి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. 2019 ఫిబ్రవరిలో సునీత ఒక పాపకు జన్మనిచ్చింది. కూతురు పుట్టిందని మరింత భార్యపై కక్ష పెంచుకున్నాడు. ఆమెను చిత్రహింస పెట్టసాగాడు. భర్తతో పాటు అత్తమామలు సైతం వేధిస్తుండటంతో తాళలేక ఆమె పుట్టింటికి వెళ్ళింది. ఈ విషయంపై బూర్గంపాడు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోక పోవడంతో తనకు న్యాయం జరగడం లేదని... ఆదివారం పాల్వంచలోని ఇందిరాకాలనీలో ఉంటున్న అత్తామామల ఇంటి ముందు కూతురు లిఖిత, తల్లి విమలతో కలిసి బైఠాయించింది. తీవ్ర స్థాయిలో వాగ్వాదం సునీత అత్తారింటి ముందు బైటాయించడంతో మామ భాస్కర్, మరిది వేణులతో తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. అయితే తన భర్త వాసు ఎక్కడున్నది తెలపాలని, ఇక్కడికి పిలిపించి న్యాయం చేయాలని సునీత వాపోయింది. భర్త వేరే మహిళతో పాల్వంచలోనే ఇటీవల కాపురం పెట్టాడని ఆరోపించింది. సమాచారం అందుకున్న ఎస్ఐ తిరుపతి, సిబ్బందితో అక్కడి చేరుకున్నారు. స్టేషన్‌కు రావాలని, వాసుని పిలిపించి తగు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. కానీ తనకు అత్తారింటి వద్దే న్యాయం చేయాలని, అప్పటి వరకు ఇక్కడే ఉంటానని బైఠాయించింది. -
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి దీక్ష
సాక్షి, ఖమ్మం(కొత్తగూడెం) : ప్రేమ పేరుతో తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడిపై చర్య తీసుకోవాలని ఓ ప్రియురాలు లక్ష్మీదేవిపల్లి మం డలం అనిశెట్టిపల్లి పంచాయతీ మాలగూడెంలో మంగళవారం దీక్ష చేపట్టింది. బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణ పరిధిలోని బర్మాక్యాంపునకు చెందిన అంగూరు శిరీష అనే యువతి పులిపాటి పారామెడికల్ కళాశాలలో నర్సింగ్ కోర్సు చదువుతోంది. మాలగూడేనికి చెందిన కాకెల్లి దిలీప్‌తో ఏడాది క్రితం పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. శారీరకంగా వాడుకుని పెళ్లి చేసుకుంటానని, ఇంటి నుంచి వచ్చేయమంటూ తీసుకెళ్లాడని శిరీష వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రియుడు, ప్రియురాలు ఇద్దరిని పోలీసులు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. మాయమాటలు చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లడం సరికాదని, పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు దిలీప్‌ను నిలదీయగా ఆమె ఎవరో తనకు తెలియదని చెప్పడంతో ప్రియురాలు శిరీష కిద్ది రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని న్యాయం చేయాలంటూ దిలీప్ ఇంటి వద్ద మంగళవారం దీక్షకు పూనుకుంది. శిరీష దీక్ష చేస్తున్న సమాచారం తెలుసుకున్న లక్ష్మీదేవిపల్లి ఎస్సై నరేష్ బాధితురాలు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి న్యాయం చేస్తానని తెలిపారు. -
తపాలా పెట్టెకు సమ్మె తాళం !
ఆదోని అర్బన్ : గ్రామీణప్రాంతాల్లో పనిచేస్తున్న తపాలా ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో పోస్టాఫీసులు మూతపడ్డాయి. దేశవ్యాప్తంగా తపాలాశాఖలో పనిచేసే గ్రామీణ డాక్ సేవక్స్ (జీడీఎస్)లకు పనికి తగిని వేతనం, సమయ పాలన, సర్వెంట్ హోదాతో పాటు 7వ ఆర్థిక వేతన సంఘం సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మే 22 నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. తపాలా ఉద్యోగుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అయ్యే ఉత్తరాల బట్వడా ఆగిపోయింది. వీటిలో ప్రధానంగా టెలిఫోన్ బిల్లులు, పార్శల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు వెళ్లే బల్క్ ఉత్తరాలు, నిరుద్యోగులకు కాల్ లెటర్లు, ఉద్యోగ నియామక రాత పరీక్షలకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆదోని సబ్ డివిజన్లో 140 బ్రాంచ్ తపాలా కార్యాలయాలు, 9 సబ్ పోస్టాఫీసులు ఉన్నాయి. దాదాపు 327మంది గ్రామీణ డాక్‌సేవక్‌లు (జీడీఎస్), డిపార్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. జీడీఎస్‌లు రూ.7వేల నుంచి రూ.12వేల వేతనంతో జీవనం సాగిస్తున్నారు. వీరి సమస్యల పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్‌లో కమలేష్ చంద్ర కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదిక ఇచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు అమలుకు నోచుకోవడం లేదు. దీంతో సమ్మెబాట పట్టారు ఉద్యోగులు. ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. 12వ రోజుకు చేరిన ఉద్యోగుల ఆందోళన పట్టణంలో హెడ్ పోస్టాఫీసు ఆవరణలో గ్రామీణ డాక్ సేవక్‌లు చేపట్టిన నిరవధిక సమ్మె శనివా రానికి 12వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా పీ3, పీ4 బ్రాంచ్ సెక్రటరీలు విజయలక్ష్మీ, గంగాధర్, జీడీఎస్ సంఘం సబ్ డివిజన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, మాజీ బ్రాంచ్ సెక్రటరీ మునీ, సం ఘం నాయకులు రాజు, నరేష్ సింగ్, శ్రీనివాస స్వామి, ప్రహ్లాద్ మాట్లాడారు. సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిం దన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. -
పోలవరంపై పోరు ఉధృతం చేస్తాం
చింతూరు, న్యూస్‌లైన్: ఆదివాసీలను జలసమాధి చేస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు పోరును మరింత ఉధృతం చేస్తామని పీపుల్స్ ఎగెనైస్ట్ పోలవరం ప్రాజెక్టు(పీఏపీపీ)కమిటీ ప్రకటించింది. కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన ఆదివాసీలతో కలసి మూడు రాష్ట్రాల కూడలైన ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా మోటులో మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు ప్రభాకర్ హంతల్ మాట్లాడుతూ గ్రామసభల తీర్మానం లేకుండా కేంద్ర, ఆంధ్రా ప్రభుత్వాలు ఏకపక్షంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నాయని, గ్రామసభ తీర్మానం లేదనే కారణంగా సుప్రీంకోర్టు ఆదేశాలతో తమ రాష్ట్రంలో బాక్సైట్ తవ్వకాలు నిలిపి వేశారని, ఇదే క్రమంలో పోలవరం ప్రాజెక్టును కూడా నిలిపివేయాలని డిమాండ్ చేసారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసుకు సంబంధించి ఎలాంటి తీర్పు వెలువడకుండానే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. 1986 వరద అంచనా ప్రకారం పోలవరం వలన ఒడిశాలోని 4 బ్లాకుల పరిధిలో 129 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, వీటికి నష్టపరిహారం ఎలా చెల్లిస్తారనేది ఆంధ్రా ప్రభుత్వం ఇంతవరకు స్పష్టం చేయలేదని తెలిపారు. ఇప్పటికే గోదావరి నదిపై అనేక చిన్నతరహా ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు అందిస్తున్నా పెట్టుబడిదారులకు లబ్ధి చేకూర్చేందుకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారని ఆయన ఆరోపించారు.ప్రభుత్వం బయోడైవర్శిటీ సదస్సు నిర్వహించి వన్యప్రాణులను రక్షించాలని ఓ ప్రక్క చెబుతూ పోలవరం ప్రాజెక్టుతో లక్షలాది ప్రజలు నిరాశ్రయులవుతున్నా పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం వలన పాపికొండలు, పొరింగ వంటి అభయారణ్యాలతో పాటు వందల ఏళ్ల చరిత్ర కలిగిన భద్రాద్రి రామయ్య మునిగిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా లేదని కమిటీ ప్రధాన కార్యదర్శి సున్నం వెంకటరమణ విమర్శించారు. లక్షలాది మంది ఆదివాసీలను నిరాశ్రయులను చేస్తున్న పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరుతూ రాష్ట్రపతికి రాసిన లేఖను మోటు తహశీల్దార్‌కు సమర్పించారు. శబరినదిలో జలదీక్ష: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆదివాసీలు వినూత్నంగా శబరినదిలో జలదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డౌన్ డౌన్, ఆంధ్రా సర్కార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలవరం ప్రాజెక్టును నిలిపివేయాలని పర్యావరణాన్ని కాపాడాలంటూ నినదించారు. ఈ సందర్భంగా మోటు గ్రామం నుంచి శబరినది వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పీఏపీపీ ఆర్గనైజింగ్ కార్యదర్శి రుద్రపాత్రో, ఉపాధ్యక్షుడు సోడె మురళి, ఆదివాసీ కొండరెడ్ల సంఘం గౌరవ అధ్యక్షుడు ముర్ల రమేష్, రేల స్వచ్ఛందసంస్థ ప్రధాన కార్యదర్శి కె.రమేష్, తెలంగాణ నిర్వాసితుల సంఘం ప్రధాన కార్యదర్శి జంజర్ల రమేష్, జల్లి నరేష్, దారలింగ, ధనం తదితరులు పాల్గొన్నారు.