సిగ్నల్‌ టవర్‌పైకి ఎక్కి యువకుల నిరసన! | 5 Dalit Youngs Protest By Climbing Signal Tower In East Godavari | Sakshi
Sakshi News home page

సిగ్నల్‌ టవర్‌పైకి ఎక్కి యువకుల నిరసన!

Published Thu, Sep 12 2019 11:08 AM | Last Updated on Thu, Sep 12 2019 11:10 AM

5 Dalit Youngs Protest By Climbing Signal Tower In East Godavari Over Remove Ambedkar Statue   - Sakshi

విగ్రహం తక్షణం ఏర్పాటు చేయాలంటూ సిగ్నల్‌ టవరెక్కిన దళిత యువకులు

సాక్షి, తూర్పుగోదావరి(అమలాపురం) : అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని అధికారులు తొలగించిన ఘటన ఉప్పలగుప్తంలో తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్తతకు దారి తీసింది. రెండు రోజులుగా దళిత సంఘాలతో ఆందోళన, ధర్నాలు, రాస్తారోకోలతో ఉప్పలగుప్తం రగలిపోతుండగా తాజాగా బుధవారం ఉదయం ఐదుగురు దళిత యువకులు అధికారుల తీరును నిరసిస్తూ అక్కడే తహసీల్దార్‌ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న సైక్లోన్‌ సిగ్నల్‌ టవర్‌పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఉప్పలగుప్తం మెయిన్‌ సెంటర్‌లో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని నెలకొల్పారు. అనుమతులు లేవన్న కారణంతో ఆ విగ్రహాన్ని అధికారులు అక్కడి నుంచి తొలగించారు. దీనిపై దళిత సంఘాల నాయకులు నిరసనకు దిగడం... అధికారులను నిలదీయడం వంటి వరస పరిణామాలు తెలిసిందే. బుధవారం ఉదయం తిరిగి దళితుల ఉద్యమం మొదలైంది.

ఆర్డీవో బి.వెంకటరమణ, డీఎస్పీ షేక్‌ మసూమ్‌ బాషా ఆధ్వర్యంలో అధికారులు కోనసీమ దళిత ఐక్యవేదిక నాయకులు డీబీ లోక్, ఇసుకపట్ల రఘుబాబు, గెడ్డం సురేష్‌బాబు, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ఎంఏకే భీమారావు, దళిత నాయకులు కొంకి వెంకట బాబ్జి, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు, బీఎస్‌పీ రాష్ట్ర నాయకుడు గెడ్డం సంపదరావు తదితరులతో పలుమార్లు నిర్వహించిన చర్చలు సఫలం కాలేదు. సమస్య పరిష్కారానికి అధికారులు మూడు రోజులు గడువు కోరినా దళిత నాయకులు ససేమిరా అన్నారు. తొలుత తొలగించిన విగ్రహాన్ని యథాస్థానంలో ఉంచాలని...తొలగించిన అధికారులను సస్పెండ్‌ చేయాలన్న డిమాండ్లు అధికారుల ముందు ఉంచారు. ఇదే సమయంలో సమస్య పరిష్కారం కావడం లేదన్న అసహనం, ఆగ్రహంతో ఐదుగురు దళిత యువకులు అక్కడే ఉన్న సైక్లోన్‌ సిగ్నల్‌ టవర్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి దిగడంతో ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పైన ఉన్న యువకులను దిగమని ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు దిగిరాలేదు. విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించకపోతే దూకి చనిపోతామన్న సంకేతాలు పంపించారు. వారు అన్నంత పని చేస్తారనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా అక్కడ నేలపై నెట్‌లు సిద్ధం చేశారు.

సుమారు ఐదు గంటలపాటు టవర్‌పై యువకులు చేసిన హైరానాతో వాతావరణం వేడిక్కింది. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన దళితులు పెద్ద ఎత్తున అక్కడికి చేరడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మరోవైపు వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అంబేడ్కర్‌ విగ్రహాన్ని అక్కడ పునః ప్రతిష్టించేందుకు వీల్లేదంటూ కవ్వింపు చర్యలకు దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతాయని గ్రహించిన పోలీసులు అదనపు బలగాలను అక్కడకి రప్పించి భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. టవర్‌ ఎక్కిన యువకులు భార్యలు, తల్లులు వచ్చి దిగిపోమ్మని ఏడుస్తూ అభ్యర్ధించినా వారు దిగరాలేదు. పరిస్థితి చేజారిపోతుండడంతో దళిత నాయకులు సమన్వయం పాటించాలని యువకులను కోరారు. మరోసారి అధికారులతో చర్చించారు. సమస్య పరిష్కారానికి మూడు రోజుల గడువు ఇవ్వాలని అధికారులు కోరడంతో దళిత నాయకులు ఆందోళనకారులకు నచ్చజెప్పి పంపించారు. చివరకు యువకులు టవర్‌ దిగిరావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement