మృతదేహం పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా అడ్డుకోవడంతో రోడ్డుపైనే మృత దేహంతో బైఠాయించిన మృతుడి బంధువులు
సాక్షి, ఆత్మకూరు(నెల్లూరు): భార్యాభర్తల మధ్య వివాదం నేపథ్యంలో కౌన్సెలింగ్ పేరుతో పోలీసులు తీవ్రంగా కొట్టడంతో ఓ వ్యక్తి అవమానంగా భావించి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి బంధువులు మృతదేహంతో జిల్లా ప్రభుత్వాస్పత్రి ఎదుట, పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. ఏఎస్‌పేట మండలం కొండమీద కొండూరు గ్రామానికి చెందిన దగ్గుమాటి కామిరెడ్డి (48) బోయిళచిరువెళ్లకు చెందిన సంపూర్ణమ్మను ద్వితీయ వివాహం చేసుకున్నాడు. అంతకు ముందే అతనికి వివాహమై ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. తొలి భార్య మృతి చెందటంతో సంపూర్ణమ్మను ద్వితీయ వివాహం చేసుకున్నాడు. మూడేళ్లుగా ఆ దంపతుల మధ్య విభేదాలు చోటు చేసుకోవడంతో విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో కాపురానికి తీసుకెళ్లాలని భర్తను కోరింది. ఆమె ప్రవర్తన మంచిది కాదని, తీసుకువెళ్లలేనని కామిరెడ్డి ఖరాఖండిగా చెప్పాడు.
దీంతో ఆమె ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శుక్రవారం కామిరెడ్డిని కౌన్సెలింగ్ పేరుతో తీసుకువచ్చి తీవ్రంగా కొట్టారని, రెండు రోజుల పాటు స్టేషన్‌లోనే ఉంచారన్న అవమానం భరించలేక శనివారం సాయంత్రం టీ తాగి వస్తానని బయటకు వచ్చి పురుగు మందు తాగి స్టేషన్ ఆవరణలో పడిపోయాడు. పోలీసులు అతన్ని ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో పట్టణంలోని మరో ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. సోమవారం తెల్లవారు జామున పరిస్థితి తీవ్రంగా విషమించటంతో నెల్లూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. దీంతో మృతుడి బంధువులు కేవలం పోలీసులు కొట్టిన దెబ్బలు, చేసిన అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఇది పోలీసులు చేసిన హత్యేనని ఆత్మకూరు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అంతకు ముందు నెల్లూరు నుంచి కామిరెడ్డి మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఆత్మకూరులోని ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం కోసం తీసుకువచ్చారు. అప్పటికే ఆస్పత్రి వద్ద వివిధ పోలీస్‌స్టేషన్ల ఎస్సైలు, సిబ్బందితో మోహరించారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, పోలీసులే దీనికి కారణమని మృతుడి బంధువులు పోస్టుమార్టం చేయనీకుండా అడ్డుకున్నారు. మృతదేహంతో పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేసేందుకు సిద్ధం కాగా పోలీసులు అడ్డుకున్నారు. ఒక దశలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంబులెన్స్‌లో నుంచి మృతదేహాన్ని దించి భుజాలపై మోసుకుంటూ 2 కి.మీ దూరంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. దారిలో పలుచోట్ల పోలీసులు అడ్డుకున్నా విఫలమయ్యారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్ ఎదుట రోడ్డుపై మృతదేహాన్ని ఉంచి ధర్నా నిర్వహించారు. సీఐ బి పాపారావుతో వాగ్వాదానికి దిగారు. తమ గ్రామం ఏఎస్‌పేట మండలానికి చెందినది అయినా ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌కు కామిరెడ్డిని ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. డీఎస్పీ వచ్చి సమాధానం చెప్పేంత వరకు ధర్నా విరమించబోమని భీషి్మంచుకు కూర్చున్నారు. డీఎస్పీ ఎస్.మక్బుల్ అక్కడికి చేరుకుని మృతుడి బంధువులతో చర్చించారు.
అయితే పోలీసులపై కేసు నమోదు చేయాలని, ఇందుకు బాధ్యులను శిక్షించాలని, పోస్టుమార్టం సైతం వీడియో చిత్రీకరణ చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఒప్పుకున్న డీఎస్పీ ఫిర్యాదు ఇవ్వాలని బంధువులను స్టేషన్‌లోకి తీసుకెళ్లి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. దీంతో మృతుని బంధువులు శాంతించి పోస్టుమార్టం కోసం మృత దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తలించారు. గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉండే కామిరెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment