psr nelluru
-
రైతులు దర్జాగా ధాన్యం అమ్మకం
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులకు ఇబ్బందులు లేకుండా సర్కారే నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ప్రతిపక్ష పార్టీలు పని గట్టుకుని అసత్య ప్రచారాలు చేసినా లక్షల టన్నుల ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలుస్తోంది. కొనుగోలు చేయడమే కాకుండా రైతులకు రావాల్సిన నగదును వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ధాన్యం కొనుగోలులోను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లాలోని ఉన్నతాధికారులు కూడా ఎక్కడా చిన్న పొరపాటు కూడా లేకుండా ధాన్యం సేకరణ నిర్వహిస్తున్నారు. నెల్లూరు (సెంట్రల్): జిల్లాలో రబీ సీజన్లో దాదాపుగా 5.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. తద్వారా 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. పౌరసరఫరాల శాఖ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 4.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. రూ.600 కోట్ల వరకు చెల్లింపులు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 246 ఆర్బీకేల ద్వారా ఇప్పటి వరకు 22,202 మంది రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించి మొత్తం 948.87 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే రూ.648 కోట్లను ఆయా రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇంకా ఆర్బీకేల ద్వారా ఇంకా భారీ మొత్తంలో మిల్లులకు ధాన్యం సరఫరా చేశారు. అయితే వీటికి సంబంధించి బ్యాంక్ గ్యారెంటీలు రాకపోవడంతో ట్రక్ షీట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే ఇంకా ఎక్కువ మొత్తంలో ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారిక ధ్రువీకరణ లభిస్తుంది. ఇటీవల కొనుగోలు చేసి వాటికి మాత్రమే మిగిలిన నగదు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. త్వరలో రైతుల ఖాతాల్లో పడే విధంగా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రతి ఏటా పెరుగుదల రాష్ట్ర సర్కారు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసే ధాన్యం పరిశీలిస్తే ప్రతి ఏటా అధికంగానే కొనుగోలు చేస్తోంది. 2020లో దాదాపు 3.90 లక్షల మెట్రిక్ టన్నులు, 2021లో 4.40 లక్షల మెట్రిక్ టన్నులు, 2022లో ఇప్పటి వరకు 4.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లకు ఏ రైతులు విక్రయం చేయడానికి వచ్చినా కచ్చితంగా కొనుగోలు చేసే విధంగా అధికారులు గట్టి చర్యలు తీసుకోవడంతో ఎక్కడా ఇబ్బందులు లేకుండా నిర్వహించారు. త్వరలోనే ఇస్తాం జిల్లాలోని ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రావాల్సిన నగదును త్వరితగతిన ఇచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతోంది. చాలా మంది రైతుల ఖాతాల్లో నగదు చేయడం జరిగింది. ఇటీవల కొనుగోలు చేసిన రైతులకు మాత్రమే నగదు ఇవ్వాల్సి ఉంది. త్వరలోనే ఇస్తాం. – పద్మ, పౌరసరఫరా శాఖ సంస్థ జిల్లా మేనేజర్ చదవండి: స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రప్రథమం... భూవివాదాలకు చెక్..! -
సోనూసూద్.. హైదరాబాద్‌లో కలుద్దామన్నారు: నాగలక్ష్మి
ఆమె ముఖంలోని రెండు కళ్లు సరిగా చూడలేవు.. ఆమె మనో నేత్రం ప్రపంచాన్ని చూడగలదు.. సాటివారి ఇబ్బందులను తెలుసుకోగలదు.. వారికి చేతనైన సహాయం చేయించగలదు.. నెల్లూరు జిల్లా వరికుంటపాడు వాస్తవ్యులు బొడ్డు నాగలక్ష్మి మనోనేత్రం సామాన్యుల కళ్ల కంటే కరోనా బాధితుల కష్టాలను మరింత చేరువగా చూసింది. తన ఐదు మాసాల పెన్షన్‌ను విరాళం ఇచ్చేలా ప్రోత్సహించింది. ‘‘కళ్లు లేకపోతేనేం, నా మనసుతో ప్రపంచాన్ని చూస్తాను. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే కృత నిశ్చయంతో ఉన్నాను. గెలుపు సాధించి, అందరికీ స్ఫూర్తిగా ఉండాలనే తపనతో ఉన్నాను. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ఆత్మస్థయిర్యంతో ఎదుర్కోవాలి’’ అంటారు కావలికి చెందిన బొడ్డు నాగలక్ష్మి. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం ఆండ్రవారిపల్లె గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి, లక్ష్మమ్మ దంపతుల నాలుగో సంతానం నాగలక్ష్మి. పుట్టుకతోనే అంధురాలు. ఎడమ కన్ను పూర్తిగా కనిపించదు. కుడి కన్ను కేవలం ఐదు శాతం మాత్రమే కనిపిస్తుంది. అది కూడా వస్తువును చాలా దగ్గరగా పెట్టుకుంటేనే కనిపిస్తుంది.‘‘మా నాన్న కృష్ణారెడ్డి చిన్న రైతు. మాది అతి సాధారణమైన కుటుంబం. మమ్మలి కష్టపడి పెంచి పెద్ద చేశారు’’ అంటున్న నాగలక్ష్మికి చిన్నతనం నుంచి చిన్న అన్నయ్య ఆదిరెడ్డితో అనుబంధం ఎక్కువ. ఆ అన్నయ్య ప్రోత్సాహంతో ఐదవ తరగతి వరకు చదువుకున్నారు నాగలక్ష్మి. ఏడు సంవత్సరాల క్రితం నాగలక్ష్మి తల్లి కాలం చేశారు. దానితో చిన్న అన్నయ్యకు నాగలక్ష్మి బాధ్యత రెట్టింపయింది. ఆమెను జాగ్రత్తగా, కన్నబిడ్డలా చూసుకోవటం ప్రారంభించారు. చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు చూసిన నాగలక్ష్మికి, ఎవరైనా తమ కష్టాలు చెప్పుకుంటే, తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేయటం అలవాటు. ఇది ఆమెకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. చిన్న అన్నయ్య ఆదిరెడ్డికి ఎం.ఎస్సి. చదివిన కవితతో వివాహం నిశ్చయమైనప్పుడు, ‘మనతో పాటు అంధురాలైన నా చెల్లెలు కూడా ఉంటుంది’ అని చెప్పారట. అందుకు కవిత అంగీకరించారట. అలా వదినతో నాగలక్ష్మికి అనుబంధం ఏర్పడింది. ఇంట్లో ఏ పనీ లేకుండా ఉండటం నాగలక్ష్మికి నచ్చలేదు. కాని ఏదైనా పని చేయాలంటే చేయలేని పరిస్థితి. ‘‘మా వదినతో కలిసి ఆరు నెలల క్రితం యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను. కుటుంబ బంధాలు, ఇంటి పనులు–వంటపనుల్లో మహిళలు పాటించవలసిన మెళకువలు, పిల్లల పెంపకం... ఇలా పలు అంశాలపై వీడియోలు చేయడం మొదలు పెట్టాం. కేవలం ఆరు నెలల్లో 1.75 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ చేరారు. కోటీ యాభై లక్షల మంది మా యూ ట్యూబ్ ఛానల్‌ను వీక్షించారు. నాకు, వదినకు ఎంతో సంబరంగా అనిపించింది’’ అంటారు నాగలక్ష్మి. ఇటీవలే అంటే సెకండ్ వేవ్‌లో నాగలక్ష్మి కరోనా బారిన పడ్డారు. ఆ సమయంలో ఆమెను ప్రత్యేకంగా ఒక గదిలో పెట్టారు. ‘‘గదిలో ఒంటరిగా ఉండటం వల్ల బోర్‌గా అనిపించేది. కంటికి దగ్గరగా పెట్టుకుని యూట్యూబ్ వీడియోలు చూడటం మొదలుపెట్టాను. అలా గమనిస్తూండగా, ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ కరోనా భాధితుల కోసం చేస్తున్న సహాయాలకు సంబంధించిన అంశాలను గమనించాను. నాకు ప్రభుత్వం ప్రతినెల మూడు వేల రూపాయలు పింఛన్‌గా అందిస్తోంది. నేను నా ఐదు నెలల పింఛన్‌ను దాచిపెట్టాను. అలా దాచిన పదిహేను వేల రూపాయలను సోనూసూద్ ట్రస్ట్‌కు అందచేశాను’’ అంటూ ఎంతో ఆనందంగా చెప్పారు నాగలక్ష్మి. నగదు పంపిన మూడు రోజులు తర్వాత సోనూసూద్.. నాగలక్ష్మికి నేరుగా ఫోన్ చేసి, మూడు నిమిషాల పాటు మాట్లాడారు. ‘‘ఆయన హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాట్లాడారు. ఆయన మాటల్లో ‘యూ ఆర్ రియల్ హీరో. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కబురు పెడతాను, హైదరాబాద్‌లో కలుద్దాం’ అన్న మాటలు మాత్రమే అర్థం అయ్యాయి’’ అంటూ తృప్తిగా తన సంభాషణ ముగించారు నాగలక్ష్మి. – కె.ఎస్, కావలి, సాక్షి నెల్లూరు జిల్లా -
365 రోజులు రాసుకోండి.. ఐ డోంట్ కేర్: మంత్రి
సాక్షి, నెల్లూరు: ఈ నెల 25న పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. గురువారం ఎన్టీఆర్ నగర్లో పర్యటించిన మంత్రి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్ 25 క్రిస్మిస్‌తో పాటు ముక్కోటి ఏకదశి కూడా ఉందన్నారు. ఈ రెండు పండగలు ఒకేరోజు వచ్చినందున్న ఆరోజే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడతామన్నారు. ఆ మహాకార్యాన్ని ఏ చంద్రబాబు కూడా ఆపలేడని ఆయన అన్నారు. ఇక ఎల్లో మీడియా తనపై రాస్తున్న పుకార్లపై స్పందిస్తూ.. ‘నా మీద కట్టుకథలు రాస్తున్న ఆంధ్రజ్యోతి పేపర్‌కు నేను భయపడను. కావాలంటే 365 రోజుల రాసుకోండి ఐ డోంట్ కేర్’ అని మంత్రి వ్యాఖ్యానించారు. -
నెల్లూరులో బాలుడి కిడ్నాప్ కలకలం
సాక్షి, నెల్లూరు : నగరంలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు అచ్చుత్ అనే బాలుడిని కిడ్నాప్ చేశారు. అయితే వీరు స్థానికుల కంటపడటంతో ఓ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పారిపోయిన మరో నిందితుడు కోసం గాలింపు చేపడుతున్నారు. అయితే ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. బాలుడు కిడ్నాప్ కాకుండా స్థానికులు కాపాడటంతో అతని తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తమకు దగ్గరివారే ఇలాంటి కుట్రకు పాల్పడి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ప్లాస్మా థెరపీపై ఎలాంటి అపోహలు వద్దు: ఆళ్ల నాని
సాక్షి, నెల్లూరు: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అవసరం అయిన అన్ని చర్యలు తీసుకుంటోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. గురువారం నెల్లూరులో ఆయన కరోనాపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆస్పత్రుల్లో అందుతున్న సేవలు, కావల్సిన సదుపాయాలపై చర్చించారు. అనంతరం మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడూ పరిస్థితిని సమీక్షిస్తూ సూచనలు ఇస్తున్నారన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా రాష్ట్రంలో అత్యధికంగా కరోనా పరీక్షలు చేస్తున్నామని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. దేశంలోనే అత్యధికంగా పరీక్షలు చేస్తూ వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు కూడా అధికంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. కోవిడ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ. 350 కోట్లను వెచ్చిస్తోందని వెల్లడించారు. ఆసుపత్రులలో బాధితులకు మెరుగైన వసతులు కల్పించి సేవలందిస్తున్నామని ఆయన చెప్పారు. కరోనాపై ప్రజలు ఆందోళన పడాల్సిన పని లేదని, ప్లాస్మా థెరపీపై ఎలాంటి అపోహలు వద్దన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు, అర్హులైన వారంతా ప్లాస్మా దానం కోసం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్లాస్మా దానం చేసే వారికి 5 వేల రూపాయల ప్రోత్సాహకాన్ని కూడా ఇస్తున్నామని తెలిపారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించి ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనపై నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. -
నెల్లూరులో నాట్స్ ఆహార పంపిణీ
నెల్లూరు: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) పేదలకు సాయం చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయిన కూలీలకు అండగా నిలిచేందుకు, వారి ఆకలి బాధలు తీర్చేందుకు తన వంతు సాయం అందిస్తోంది. తాజాగా నెల్లూరు నగరంలోని పేదలకు నాట్స్ ఆహార పంపిణీ చేసింది. నాట్స్ సభ్యులు ఎం.శ్రీనివాస్, ఎ. శ్రీధర్ చొరవతో నెల్లూరులోన మినీ బైపాస్ సాయిబాబా గుడి దగ్గర ఈ ఆహార పంపిణీ జరిగింది. స్థానికంగా ఉండే వినయ్ కుమార్ అతని మితృబృందం నాట్స్ సాయాన్ని పేదలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు. మూడు రోజుల పాటు పేదలకు నాట్స్ సాయంతో ఇక్కడ ఆహారాన్ని పంపిణీ చేయనున్నారు.. నెల్లూరు నగరంలో పేదలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని నాట్స్ సభ్యులు.. నాట్స్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ మంచికలపూడి శ్రీనివాస్‌లు దృష్టికి తీసుకురావడంతో వెంటనే వారు స్పందించి పేదలకు కావాల్సిన ఆహార పంపిణీకి కావాల్సిన సహాయ సహాకారాలు అందించారు. అర్థాకలితో ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో నాట్స్ ఆహారపంపిణీ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని పేదలు హర్షం వ్యక్తం చేశారు. -
అమరుల త్యాగాలు మరువలేనివి
సాక్షి, నెల్లూరు : దేశ, సమాజ రక్షణలో తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని జాయింట్ కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అన్నారు. నెల్లూరులోని జిల్లా పోలీసు కవాతు మైదానంలో సోమవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో ఉన్న జవాన్లు యుద్ధం వచ్చినప్పుడే పోరాడుతారని, పోలీసులు సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిత్యం కృషి చేస్తుంటారని అన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, మతతత్వం, ఫ్యాక్షనిజం వంటి విచ్ఛిన్నకర శక్తులు, అసాంఘిక శక్తులతో పోరాడే క్రమంలో ఎందరో తమ ప్రాణాలను అరి్పస్తున్నారన్నారు. వారు భౌతికంగా మృతిచెందినా అందరి హృదయాల్లో చిరస్మరణీయులుగా నిలుస్తారన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది విధి నిర్వహణలో 292 మంది మృతిచెందగా జిల్లాలో 19 మంది అమరులయ్యారని తెలిపారు. నేటి మన నిశి్చంత జీవనం వారి అవిశ్రాంత త్యాగఫలమన్నారు. వారి ఆశయ సాధనకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏఎస్పీ క్రైమ్స్ పి.మనోహర్‌రావు మాట్లాడుతూ అవినీతి, అక్రమాలకు దూరంగా ఉంటూ ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలను అందించడమే అమరవీరులకిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను అరి్పంచిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్క పోలీసు విధులు నిర్వహించాలన్నారు. అనంతరం అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, పెయింటింగ్, కార్టూన్ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఘన నివాళి పోలీసు కవాతు మైదానంలోని అమరవీరుల స్థూపం వద్ద జాయింట్ కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్, ట్రైనీ కలెక్టర్ కల్పనకుమారి, ఏఎస్పీ క్రైమ్స్ పి.మోహన్‌రావు, మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రూప్‌కుమార్‌యాదవ్, డీఎస్పీలు ఎన్.కోటారెడ్డి, బి.లక్ష్మీనారాయణ, జె.శ్రీనివాసులురెడ్డి, కె.వి.రాఘవరెడ్డి, బి.భవానీహర్ష, మల్లికార్జునరావు, వై.రవీంద్రరెడ్డి, నగర ఇన్స్పెక్టర్లు ఎన్.మధుబాబు, కె.వేమారెడ్డి, కె.రాములునాయక్, మిద్దె నాగేశ్వరమ్మ, టి.వి.సుబ్బారావు, వైవీ సోమయ్య, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిపాటి ప్రసాదరావు, ఆర్ఐలు చంద్రమోహన్, మౌలాలుద్దీన్, రమే‹Ùకృష్ణన్, ఎస్ఐలు, సిబ్బంది పుష్పగుచ్చాలుంచి నివాళులరి్పంచారు. అనంతరం అమరవీరుల స్మృత్యర్థం పోలీసు సిబ్బంది స్మృతి పరేడ్ నిర్వహించారు. జోరువానలోనూ అక్కడ నుంచి నగరంలో ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరిరూరల్: శాంతిభద్రల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా విడిచిన పోలీసు అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదని 9వ బెటాలియన్ కమాండెంట్ ఎల్ఎస్ పాత్రుడు అన్నారు. పోలీసు అమరవీరుల దినం సందర్భంగా వెంకటగిరి మండలంలోని వల్లివేడు సమీపంలో ఉన్న 9వ బెటాలియన్‌లో సోమవారం బెటాలియన్ సిబ్బంది అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులరి్పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీలో పోలీసుల పాత్ర చాలా కీలకమైందని అన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ 9వ బెటాలియన్‌లో ప్రతి ఏటా స్మరించుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబసభ్యులకు స్మారక జ్ఞాపికలను అందజేశారు. గత వారం రోజులుగా నిర్వహించిన వారోత్సవాల్లో విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలైన వారికి బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ మోహన్‌ప్రసాద్, అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాసులు, శివరామప్రసాద్, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు. -
వివాహ వేడుకల్లో విషాదం
సాక్షి, అనుమసముద్రంపేట(నెల్లూరు): పెళ్లింట్లో విద్యుద్దీపాలంకరణ చేసేందుకు వచ్చిన ఓ ఎలక్ట్రీషియన్ విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈఘటన మండలంలోని చౌటభీమవరం గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్సై సమాచారం మేరకు.. ఆత్మకూరు పట్టణం జేఆర్‌పేటకు చెందిన డీ చెన్నకేశవుల కుమారుడు కేశవులు (26) ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. గతేడాది ఆత్మకూరులో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ పెట్టి నష్టాలు రావడంతో మూతవేశాడు. కుటుంబ పోషణ కోసం పెళ్లిళ్లకు లైటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం చౌటభీమవరానికి చెందిన భీమవరపు సురేష్ వివాహ వేడుకలకు లైటింగ్ పనులు చేసేందుకు వెళ్లారు. ఉదయం 5 గంటల సమయంలో చేతులు కడుక్కునేందుకు వాటర్ డ్రమ్ముల వద్దకు వెళ్లాడు. అక్కడ విద్యుత్ వైరుకు సరఫరా వచ్చి అక్కడికక్కడే పడిపోయాడు. గ్రామస్తులు ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించడంతో ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేశవులు మృతితో కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఏఎస్‌పేట ఎస్సై గోపాల్ ఏరియా వైద్యశాలకు చేరుకుని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మృతదేహంతో స్టేషన్ ఎదుట ధర్నా
సాక్షి, ఆత్మకూరు(నెల్లూరు): భార్యాభర్తల మధ్య వివాదం నేపథ్యంలో కౌన్సెలింగ్ పేరుతో పోలీసులు తీవ్రంగా కొట్టడంతో ఓ వ్యక్తి అవమానంగా భావించి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి బంధువులు మృతదేహంతో జిల్లా ప్రభుత్వాస్పత్రి ఎదుట, పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. ఏఎస్‌పేట మండలం కొండమీద కొండూరు గ్రామానికి చెందిన దగ్గుమాటి కామిరెడ్డి (48) బోయిళచిరువెళ్లకు చెందిన సంపూర్ణమ్మను ద్వితీయ వివాహం చేసుకున్నాడు. అంతకు ముందే అతనికి వివాహమై ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. తొలి భార్య మృతి చెందటంతో సంపూర్ణమ్మను ద్వితీయ వివాహం చేసుకున్నాడు. మూడేళ్లుగా ఆ దంపతుల మధ్య విభేదాలు చోటు చేసుకోవడంతో విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో కాపురానికి తీసుకెళ్లాలని భర్తను కోరింది. ఆమె ప్రవర్తన మంచిది కాదని, తీసుకువెళ్లలేనని కామిరెడ్డి ఖరాఖండిగా చెప్పాడు. దీంతో ఆమె ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శుక్రవారం కామిరెడ్డిని కౌన్సెలింగ్ పేరుతో తీసుకువచ్చి తీవ్రంగా కొట్టారని, రెండు రోజుల పాటు స్టేషన్లోనే ఉంచారన్న అవమానం భరించలేక శనివారం సాయంత్రం టీ తాగి వస్తానని బయటకు వచ్చి పురుగు మందు తాగి స్టేషన్ ఆవరణలో పడిపోయాడు. పోలీసులు అతన్ని ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో పట్టణంలోని మరో ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. సోమవారం తెల్లవారు జామున పరిస్థితి తీవ్రంగా విషమించటంతో నెల్లూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. దీంతో మృతుడి బంధువులు కేవలం పోలీసులు కొట్టిన దెబ్బలు, చేసిన అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఇది పోలీసులు చేసిన హత్యేనని ఆత్మకూరు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అంతకు ముందు నెల్లూరు నుంచి కామిరెడ్డి మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఆత్మకూరులోని ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం కోసం తీసుకువచ్చారు. అప్పటికే ఆస్పత్రి వద్ద వివిధ పోలీస్స్టేషన్ల ఎస్సైలు, సిబ్బందితో మోహరించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, పోలీసులే దీనికి కారణమని మృతుడి బంధువులు పోస్టుమార్టం చేయనీకుండా అడ్డుకున్నారు. మృతదేహంతో పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేసేందుకు సిద్ధం కాగా పోలీసులు అడ్డుకున్నారు. ఒక దశలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంబులెన్స్‌లో నుంచి మృతదేహాన్ని దించి భుజాలపై మోసుకుంటూ 2 కి.మీ దూరంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. దారిలో పలుచోట్ల పోలీసులు అడ్డుకున్నా విఫలమయ్యారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్ ఎదుట రోడ్డుపై మృతదేహాన్ని ఉంచి ధర్నా నిర్వహించారు. సీఐ బి పాపారావుతో వాగ్వాదానికి దిగారు. తమ గ్రామం ఏఎస్‌పేట మండలానికి చెందినది అయినా ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌కు కామిరెడ్డిని ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. డీఎస్పీ వచ్చి సమాధానం చెప్పేంత వరకు ధర్నా విరమించబోమని భీషి్మంచుకు కూర్చున్నారు. డీఎస్పీ ఎస్.మక్బుల్ అక్కడికి చేరుకుని మృతుడి బంధువులతో చర్చించారు. అయితే పోలీసులపై కేసు నమోదు చేయాలని, ఇందుకు బాధ్యులను శిక్షించాలని, పోస్టుమార్టం సైతం వీడియో చిత్రీకరణ చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఒప్పుకున్న డీఎస్పీ ఫిర్యాదు ఇవ్వాలని బంధువులను స్టేషన్లోకి తీసుకెళ్లి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. దీంతో మృతుని బంధువులు శాంతించి పోస్టుమార్టం కోసం మృత దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తలించారు. గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉండే కామిరెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
వైఎస్సార్ రైతు భరోసా నేడు ప్రారంభం
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ పథకాన్ని నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం అక్కడి బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులు, కౌలుదారుల కుటుంబాల పేరిట బ్యాంకు అకౌంట్లలో నేరుగా పెట్టుబడి సాయాన్ని మంగళవారం జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 40 లక్షల మంది రైతులు, కౌలు రైతుల కుటుంబాలు ఇందుకు అర్హమైనవిగా అధికారులు తేల్చారు. సరళీకరించిన నిబంధనల ప్రకారం మరో 14 లక్షల మంది వరకు లబ్ధిదారుల జాబితాలో చేరే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ పథకం కింద చెక్కులు పంపిణీ చేస్తారు. ► ‘వైఎస్సార్ రైతు భరోసా’ ప్రకటించిన తేదీ, ప్రాంతం: జులై 8వ తేదీ 2017 – గుంటూరు (పార్టీ ప్లీనరీలో) ► తొలుత అర్హత : ఐదు ఎకరాలలోపు సన్న, చిన్నకారు రైతులు ► తర్వాత మారిన అర్హత : అన్నదాతలందరికీ వర్తింపు ► తొలుత ప్రకటించిన సాయం : ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50,000 ► తాజాగా ప్రకటించిన సాయం : ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలలో రూ.67,500 ► జగన్ ప్లీనరీలో ప్రకటన తర్వాత ఇదే తరహా పథకాన్ని (రైతు బంధు) అమలు చేసిన రాష్ట్రం : తెలంగాణ ► కేంద్రం ఇటీవల అమల్లోకి తెచ్చిన పథకం : పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి సాక్షి ప్రతినిధి, నెల్లూరు : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగే రైతుభరోసా ప్రారంభోత్సవ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ శాఖలకు చెందిన స్టాళ్లను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 11 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. స్టాళ్లను పరిశీలించిన తర్వాత రైతుభరోసా చెక్కులు పంపిణీ చేసి అన్నదాతలతో మాట్లాడతారు. సభ ముగిశాక రేణిగుంట చేరుకుని విమానంలో గన్నవరం వెళ్తారు. -
రొట్టెల పండుగ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అనిల్‌కుమార్
సాక్షి, నెల్లూరు: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ ఏర్పాట్లను రాష్ట్ర్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోమవారం పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి అనిల్ మీడియాతో మాట్లాడుతూ..గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లకు తావులేకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో ఏర్పాట్లు చేశామన్నారు. రొట్టెల పండుగ పూర్తయ్యే వరుకూ బారా షాహీద్ దర్గాలోనే భక్తులకు అందుబాటులో ఉంటానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియా సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి ... రొట్టెల పండుగ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, నేతలు మాలెం సుధీర్‌కుమార్ రెడ్డి, దర్గా కమిటీ ఛైర్మన్ రజాక్,మున్నా తదితరులు పాల్గొన్నారు. -
దాడి చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం
సాక్షి, నెల్లూరు : డోలేంద్ర ప్రసాద్‌పై తాను దాడి చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. నెల్లూరులోని రూరల్ వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 11వ తేదీ రాత్రి తాను డోలేంద్ర ప్రసాద్‌పై దాడి చేసి, ఎవరినో కిడ్నాప్ చేశానని కేసు నమోదు చేయించారని, అప్పుడు తాను మద్యం మత్తులో ఉన్నానని చెప్పడం జరిగిందన్నారు. తనకు ప్రసాద్ 1981 సంవత్సరం నుంచి తెలుసన్నారు. రెండు విషయాల్లో విభేదాలు తనకు డోలేంద్ర ప్రసాద్‌కు రెండు విషయాల్లో విభేదాలు వచ్చాయన్నారు. ఎన్నికలకు మూడునెలల ముందు డోలంద్ర నా వద్దకు వచ్చారని ఎమ్మెల్యే వెల్లడించారు. ‘చంద్రబాబుతో అంతా మాట్లాడాను. నేను చెప్పినట్లే సీట్లు ఇస్తామన్నారు. టీడీపీలో చేరి రూరల్ నుంచి పోటీ చేయి. ఖర్చంతా చంద్రబాబే చూసుకుంటారు. ఈసారి టీడీపీ ప్రభుత్వమే వస్తుంది’ అని డోలేంద్ర తనకు చెప్పారన్నారు. తాను దీనిని వ్యతిరేకించి రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఆయనతోనే నా ప్రయాణం తప్ప, ఇంకో పార్టీ మారేది లేదని తెగేసి చెప్పానని కోటంరెడ్డి తెలిపారు. అలాగే ‘కస్తూరీదేవి స్కూల్ విషయలో తనను ఉద్యమం చేయమన్నారు. అయితే ఉద్యమం చేసేందుకు అక్కడేముందని అడిగాను. జీవీకే సంస్థ కూడా స్కూల్లో జీతాలు, కార్పొరేట్ స్థాయిలో పేద విద్యార్థులకు విద్యను, ఇతర వసతులు కల్పిస్తానని చెప్పడం జరిగింది. ఇక ఎందుకు ఉద్యమం చేయాలి’ తాను డోలేంద్రతో అనడంతో కక్ష కట్టినట్టుగా ఉన్నారని చెప్పారు. ప్రమాణం చేస్తారా? డోలేంద్ర ప్రసాద్ ఫోన్ చేసి మాట్లాడాలని, ఎక్కడ ఉన్నావో చెబితే వస్తానని అడిగారని ఎమ్మెల్యే వెల్లడించారు. అయితే మీరెందుకు తానే వస్తానని ప్రసాద్‌కు చెప్పి 11వ తేదీ రాత్రి ఆయన ఇంటికి వెళ్లడం జరిగిందన్నారు. అయితే అప్పటికే అతను మద్యం మత్తులో ఉన్నాడని ఎమ్మెల్యే తెలిపారు. కస్తూరీదేవి విద్యాలయానికి వెళుతున్నావని తెలిసిందని, అక్కడ ఉద్యమం చేయాలని తనతో డోలేంద్ర అన్నారన్నారు. అయితే తాను ఎందుకు ఉద్యమం చేయాలని ప్రశ్నించడం జరిగిందన్నారు. ఈ మాటతో జీవీకే వారికి అమ్ముడుపోయావని తనను ప్రసాద్ అన్నారని, తాను కల్పించుకుని ఎక్కడ ఏ సమస్య ఉన్నా నిజాయితీగా పోరాటం చేస్తానని, గతంలో ఈ సమస్యపై 72 రోజులు పోరాటం చేసిన వ్యక్తిని అని చెప్పడంతోపాటు, ఎవరు ఎవరికి అమ్ముడుపోయారో జిల్లాలోని అందరికీ తెలుసని చెప్పానన్నారు. ఈ విషయంపై మాత్రమే మాట్లాడి వచ్చేశానన్నారు. అక్కడే తమ కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉన్న డాక్టర్ వసుంధర కూడా ఉన్నారన్నారు. ఈ విషయాన్ని వక్రీకరిస్తూ తాను మద్యం మత్తులో దాడి చేసినట్లుగా పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారన్నారు. దీంతోపాటు ఎవరినో కిడ్నాప్ చేసినట్లుగా కూడా కేసు పెట్టడం జరిగిందన్నారు. కాగా ప్రత్యక్ష సాక్షి అయిన వసుంధర ఏమి చెప్పిందో స్టేషన్లో అందరూ తెలుసుకోవచ్చన్నారు. తాను మద్యం మత్తులో ఉన్నట్లు మీ బిడ్డలపై ప్రమాణం చేయడానికి సిద్ధమా అని డోలేంద్రకు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి సవాల్ విసిరారు. అయితే తాను దాడి చేసినట్లుగా కేసు పెట్టిన వ్యక్తి ఆ సమయంలో వైద్యశాలకు ఎందుకు వెళ్లలేదో చెప్పాలన్నారు. తాను ఎప్పుడూ హింసకు దూరమని, గాంధీగిరి పద్ధతిలోనే సమస్యలకు పరిష్కారం చూపే తనపై ఈ విధంగా ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. డోలేంద్ర చేస్తున్న అవినీతిని, దుర్మార్గాలను అడ్డుకుంటానన్నారు. పత్రిక ముసుగులో చేస్తున్న బ్లాక్‌మెయిల్‌ను, అవినీతి, అక్రమాలను అడ్డుకుంటానన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రూప్‌కుమార్ యాదవ్, నాయకులు తాటి వెంకటేశ్వర్లు, బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, బొబ్బల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కేసు నమోదు నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, అతని అనుచరులపై దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఈనెల 11వ తేదీ రాత్రి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన అనుచరులు తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి దాడి చేశారని లెక్చరర్స్‌కాలనీలో నివాసం ఉంటున్న జమీన్రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ దర్గామిట్ట పోలీసులకు లిఖిత ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేతోపాటు ఆయన పీఏ విష్ణు, మురళీకృష్ణ యాదవ్, సురేష్, మరో ఇద్దరిపై దర్గామిట్ట పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
వేనాడు, ఇరకం దీవుల ప్రకృతి అందాలు
ఆధునిక ప్రపంచం.. ఎటుచూసినా కాలుష్యం.. భయాందోళనకు గురిచేస్తున్న వాతావరణం.. ఇలాంటి పరిస్థితులకు దూరంగా స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉన్న పల్లెలు ప్రస్తుతం చాలా అరుదుగా ఉన్నాయి. స్వచ్ఛతకు ప్రతిరూపమైన తడ మండలంలోని వేనాడు, ఇరకం దీవుల్లో ప్రతిదీ విలువైనదే. ఈ దీవులకు ప్రత్యేకత ఉంది. ఇక్కడి ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉన్నారనే భావన తప్ప నేటి కాలుష్య జీవితం నుంచి దూరంగా ప్రకృతి ఒడిలో ఆహ్లాదంగా గడుపుతున్నారన్న వీరి సంతృప్తిని చూసి ఎవరైనా అసూయ పడాల్సిందే. పర్యాటక కేంద్రంగా ఇరకం పులికాట్ సరస్సు నడుమ ప్రకృతి అందాలతో కాలుష్య కోరలకు దూరంగా ప్రశాంతంగా ఉండే దీవి గ్రామం ఇరకం. ఈ గ్రామానికి చేరుకోవాలంటే పడవ ప్రయాణం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. గ్రామం చుట్టూ ఉప్పునీరు ఉన్నప్పటికీ గ్రామంలో మాత్రం తియ్యటి మంచినీళ్లు లభించడం దీని ప్రత్యేకత. గ్రామం నిండా మంచి నీటికోసం తవ్విన దొరువులు వాటి పక్కన మొగలి పొదలు కనిపిస్తాయి. వరి ప్రధాన పంట కాగా ఇక్కడ మొగలి పొదలు, వెదురు, పేము, కొన్ని రకాల మూలికా వేర్లు విరివిగా లభిస్తాయి. ఈ పంటలను వ్యాపారాత్మకంగా పెంచేలా ప్రభుత్వం అవగాహన కల్పించి సహకరిస్తే ఎంతో మందికి జీవనోపాధి లభిస్తుంది. వేనాడులో ప్రకృతి కనువిందు రాకెట్ ప్రయోగ కేంద్రం షార్కు సమీపంలో ఉన్న ఈ గ్రామం కూడా పులికాట్ సరస్సు మధ్యలో ఉంటూ గతంలో దీవిగా ఉండేది. కానీ షార్ రోడ్డు నుంచి వేనాడు వరకు పసల పెంచలయ్య మంత్రిగా పనిచేసిన కాలంలో ఏర్పాటు చేసిన గ్రావెల్ రోడ్డు ఒక్కటే మార్గం. ప్రస్తుతం అది కూడా గతుకులమయంగా మారి ప్రయాణికులకు నరకం చూపుతోంది. గ్రామం కాలుష్యపు కోరలకు దూరంగా తెల్లటి ఇసుక దిబ్బలతో అందంగా కనిపిస్తుంది. ఇక్కడ షేక్ షావలి అల్లా దర్గా, శ్రీశృంగేశ్వర శ్రీరంగ పెరుమాళ్ ఆలయం వంటి ఆధ్యాత్మిక విశేషాలు చాలానే ఉన్నాయి. వరి ప్రధాన పంట. తాగునీటికి సమస్య లేదు. కానీ ఈ గ్రామం నుంచి గ్రామస్తులు పనులపై మండల కేంద్రం తడకు రావాలంటే దాదాపు 33 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడ జీడిమామిడి, పేము, వెదురు, తంగేడిపూలు, సీగిరేణి(అరిపాకు) ఆకు విరివిగా లభిస్తాయి. గతంలో ఈ గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సీగిరేణి ఆకుతోనే తల స్నానాలు చేసేవారు. దీని వల్ల చుండ్రు, జుత్తురాలే సమస్యలు తగ్గడంతోపాటు చలవ చేసే గుణం కూడా ఉండేది. అనంతర కాలంలో షాంపులు రావడంతో ఈ ఆకును వాడే వారు కరువైపోయారు. ఇక్కడ లభించే ఉత్పత్తులను వాణిజ్యపరంగా సాగు చేసేలా ఇక్కడి గిరిజనులు, ఇతరులను ప్రోత్సహించడం ద్వారా పలువురికి ఉపాధి లభించే అవకాశం ఏర్పడుతుంది. వేనాడు, ఇరకం దీవులకు కూతవేటు దూరంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం ఉండగా మరికొద్ది దూరంలోనే శ్రీసిటీ, మాంబట్టు పారిశ్రామిక వాడలు ఉన్నాయి. రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో ఈ గ్రామాల్లోని యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయి గ్రామాలకే పరిమితమవుతున్నారు. ఈ రెండు గ్రామాల చుట్టూ పులికాట్ సరస్సు ఉప్పు నీళ్లు ఉన్నా గ్రామాల్లో మాత్రం స్వచ్ఛమైన తియ్యటి నీళ్లు ఉండడం వీరు అదృష్టంగా భావిస్తారు. ఈ నీటి ఆసరాగా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయ భూమి పరిమితంగా ఉండి కూలీలు ఎక్కువగా ఉండడంతో వీరికి సరైన పని లభించడం లేదు. ఇరకం, వేనాడు దీవుల్లో ప్రశాంతమైన వాతావరణంతోపాటు ప్రతి చెట్టూ, వేరూ, ఆకూ, పువ్వూ, కాయ, పండూ అన్నీ ఏదో ఒక అద్భుతమైన ఔషధగుణం కలిగినవిగా ఉంటాయి. వేనాడులో ఎక్కువ శాతం చెట్లు క్లోనింగ్ మొక్కల తరహాలో ఓ మోస్తరు ఎత్తు మాత్రమే పెరుగుతాయి. భారీ వృక్షాలు ఇక్కడ పెద్దగా కనిపించకపోవడం విశేషం. బయటి ప్రాంతాల్లో రావి, వేపచెట్ల తరహాలో ఈ గ్రామంలో వేపచెట్లు ఆరిపాకు చెట్లతో పెనవేసుకుని కనిపిస్తాయి. ఈ గ్రామాలకు వెళ్లే మార్గంలో పులికాట్ సరస్సులో నీళ్లు ఉన్న సమయంలో దేశ, విదేశీ విహంగాలు చేసే విన్యాసాలు కనువిందు చేస్తాయి. ఈ గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా అవి కార్యరూపం దాల్చడం లేదు. ఆ దీవుల అభివృద్ధికి కృషి చేస్తున్నాం వేనాడు, ఇరకం దీవులు అద్భుత గ్రామాలు. ఇక్కడి ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు అందించడంతోపాటు ఈ గ్రామాల్లోని ప్రజలకు ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు చేపట్టాల్సిన చర్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి నెరవేరుస్తాం. ఇరకం దీవిలో పర్యాటక పెట్టుబడుల కోసం ఇప్పటికే చెన్నైలోని ‘వీజీపీ’ ప్రతినిధులతో చర్చలు జరిపాం. వారు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఇక్కడి ప్రజల సౌకర్యార్థం రోడ్డు వసతి, పులికాట్ ముఖద్వారాల పూడికతీత, సౌకర్యాల కల్పనకు కృషి చేస్తా. – కిలివేటి సంజీవయ్య, సూళ్లూరుపేట ఎమ్మెల్యే గతంలో అరిపాకే అందరికీ మా చిన్నతనంలో అరిపాకుతోనే తల స్నానం చేసే వాళ్లం. దీని వల్ల జుట్టుకి సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చేవి కావు. ఈ ఆకును పొడి కొట్టించడం, స్నానం చేసేందుకు కూడా ఎక్కువ సమయం పట్టడం వంటి కారణాలతో ప్రజలు షాంపూల వైపు మళ్లారు. తిరిగి ప్రస్తుతం పాత అలవాట్లకు వస్తున్న ప్రజలు ఇప్పుడిప్పుడు ఈ ఆకు కోసం గ్రామానికి వస్తున్నారు. గ్రామంలో నీటి చెమ్మ ఉన్న ప్రాంతాల్లో పేము బాగా పెరుగుతుంది. ఇక్కడ పట్టా భూముల్లో సాగయ్యే పేముని వేలం పాట ద్వారా విక్రయిస్తాం. ఆకు నుంచి, కాడ వరకు ముళ్లతో ఉండే ఈ పేముని గిరిజనులు తప్ప ఇతరులు కొయ్యలేరు. ఈ రెండింటినీ బాగా సాగు చేసి వినియోగంలోకి తెస్తే కొందరికైనా ఉపాధి లభిస్తుంది. – కె.వాసుమొదలి, వేనాడు గ్రామం, తడ మండలం -
అంతా.. ట్రిక్కే..!
అధ్యాపకులు లేకున్నా రిజిస్టర్లలో పేర్లుంటాయి..విద్యార్థులు లేకున్నా లెక్కల్లో చూపిస్తూ ప్రైవేట్ విద్యా సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. అంతా మాయ చేస్తున్నాయి.. ఇదేమని అడిగేవారు లేకపోవడంతో బయోమెట్రిక్ విధానాన్ని యాజమాన్యాలు పక్కదోవ పట్టిస్తున్నాయి. విద్యార్థుల స్కాలర్ షిప్‌లు స్వాహా చేస్తున్నాయి. రూ.లక్షల్లో ప్రభుత్వ నిధులను కాజేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సాక్షి, నెల్లూరు : ఇంటర్ కళాశాలల్లో తప్పనిసరిగా బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయి. ఇంటర్ కళాశాలల్లో బయోమెట్రిక్ ద్వారా విద్యార్థులు, అధ్యాపకుల హాజరును పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దీనికి సంబంధించి విధిగా యంత్రాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. అయితే జిల్లాలో ఏ ఒక్క కళాశాలలో కూడా బయోమెట్రిక్ యంత్రాన్ని ఏర్పాటు చేయలేదు. బయోమెట్రిక్ ఏర్పాటుకు నిరాకరిస్తే కళాశాల గుర్తింపు రద్దు చేస్తామన్న హెచ్చరికను కూడా వారు పెడచెవిన పెట్టడం గమనార్హం. ప్రభుత్వ ఆదేశాలు విస్మరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న ఇంటర్ బోర్డు అధికారులు కళాశాలల్లో ఉన్న పరిస్థితులపై ప్రస్తుతం నోరు మెదపడం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రతి ఏటా స్కాలర్షిప్ రూపంలో కొంత మొత్తాన్ని అందజేస్తున్నారు. బోగస్ హాజరుతో ప్రభుత్వం ఇచ్చే నిధులను కార్పొరేట్, ప్రభుత్వ యాజమాన్యాలు పక్కదారి పట్టిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు హాజరు తక్కువ ఉందని విద్యార్థుల నుంచి కొత్త మొత్తాన్ని అదనంగా వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. జిల్లాలో 126 కార్పొరేట్, 26 ప్రభుత్వ, 15 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి దాదాపు 60వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లను ప్రతినెలా మంజూరు చేస్తుంది. ఒక్కో విద్యార్థికి నెలకు రూ.325 చొప్పున 10 నెలలకు రూ.3,250 విడుదల చేస్తుంది. బోగస్ హాజరు చూపిస్తూ పలు కళాశాలలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. ప్రతిరోజు కళాశాలలకు రావాల్సిన అవసరం ఉండదని, పాస్ చేయించే బాధ్యత తమదేనని గ్యారెంటీ ఇచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులనుఎక్కువ మొత్తంలో చేర్చుకుంటున్నారు. వారు రోజు కళాశాలకు రాకపోయిన రికార్డుల్లో హాజరు చూపిస్తూ స్కాలర్‌షిప్పును ఎంచక్కా మెక్కేస్తున్నారు. అక్రమాలను అరికట్టేందుకు బయోమెట్రిక్ జూనియర్ కళాశాలల్లో అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్ యంత్రాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ప్రతి విద్యార్థి ఆధార్ నంబరును బయోమెట్రిక్‌కు అనుసంధానం చేసింది. ప్రతిరోజు విద్యార్థి ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ హాజరును పరిగణలోకి తీసుకుని స్కాలర్‌షిప్పును ప్రభుత్వం విడుదల చేస్తుంది. ప్రతి 100 మంది విద్యార్థులకు ఒక బయోమెట్రిక్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని ఇంటర్‌బోర్డు అధికారులు ఆదేశించారు. కళాశాలలో పనిచేసే అధ్యాపకుల హాజరు సైతం బయోమెట్రిక్ ద్వారా తీసుకోవాలని తెలిపారు. ఆర్ఐఓలే బాధ్యులు ... జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేయకపోతే ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్ఐఓ)నే బాధ్యులు అవుతారని ఉన్నతాధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం బయోమెట్రిక్ యంత్రాల అమలుపై ఎవరూ నోరు మెదపడం లేదు. ఇంటర్ బోర్డు అధికారులు సైతం పట్టించకోవడం లేదు. బయోమెట్రిక్ హాజరు లేకుండా ఏ ఒక్క కళాశాల నుంచి స్కాలర్షిప్పులకు దరఖాస్తులు స్వీకరించరాదని, పరీక్షల నిర్వహణకు, నామినల్ రోల్స్‌కు కూడా సిఫార్సు చేయవద్దని ఇంటర్‌బోర్డు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఇంటర్ బోర్డు చెప్పినట్లు యంత్రాలు అమలు చేస్తే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టేనని కొన్ని కళాశాలల నిర్వాహకులు చెబుతున్నారు. మాన్యువల్ విధానం ఉంటే విద్యార్థులు వచ్చినా రాకున్నా హాజరు వేసుకుని స్కాలర్‌షిప్పు మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించవచ్చనే ఆలోచనలో ఇంటర్ కళాశాలల యాజమాన్యాలు ఉన్నట్లు తెలిసింది. యంత్రాలు ఏర్పాటు చేస్తే అన్ని రకాలుగా నష్టదాయకమని భావించి వాటిని నిరాకరిస్తున్నారని సమాచారం. అయితే బయోమెట్రిక్ ద్వారా హాజరు పరిగణలోకి తీసుకంటే తమ పిల్లలు రోజు కళాశాలకు వెళుతున్నారా..లేదన్నది తల్లిదండ్రులకు తెలిసే అవకాశం ఉంది. దీంతో పాటు ఒక్కో యంత్రం ధర రూ.30వేల నుంచి రూ.35వేలుగా నిర్ణయించారు. ఇదిలా ఉండగా ప్రతి కళాశాలలో బయోమెట్రిక్ యంత్రం తప్పనిసరిగా బిగించాల్సిందేనని ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే శ్రీనివాసరావు, స్పష్టం చేశారు. ఏర్పాటు చేయనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఉల్లంఘనలు..
టీడీపీ ప్రభుత్వ హయాంలో అక్రమార్కులు చెలరేగిపోయారు. అధికారం అండతో టౌన్‌ప్లానింగ్ అధికారులను డమ్మీలను చేసి, అనుమతులు లేకుండా భారీ వ్యాపార సముదాయాలు నిర్మించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాల కారణంగా నగరంలో ట్రాఫిక్ సమస్యకు కారణమవుతోంది. కమర్షియల్ భవనాల్లో పార్కింగ్ వసతి కోసం సెల్లార్లు నిర్మించాల్సి ఉంది. చాలా మంది భవన యజమానులు సెల్లారు లేకుండానే భవనాలు నిర్మించారు. నిర్మించిన సెల్లార్లను దుకాణాలు, గోడౌన్లుగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఉల్లంఘనులపై కార్పొరేషన్ అధికారులు కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. సాక్షి, నెల్లూరు సిటీ : నెల్లూరు నగరంలో పాఠశాలలు, కళాశాలలు, వస్త్ర దుకాణాలు, బంగారు దుకాణాలు, ఇతర కమర్షియల్ భవనాల్లో సెల్లార్లు లేకుండానే యజమానులు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టారు. గత ప్రభుత్వం హయాంలో కొందరు భవన యజమానులు అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఆయా కమర్షియల్ భవనాల్లో సెల్లార్లు లేకపోవడంతో రోడ్లు పైనే పార్కింగ్ చేస్తున్నారు. ఫలితంగా నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. టౌన్‌ప్లానింగ్ అధికారుల అవినీతి, గత ప్రభుత్వ పాలకుల ఒత్తిడితో అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించకపోవడంతో ఇష్టానుసారంగా షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించారు. నిబంధలన ప్రకారం షాపింగ్ కాంప్లెక్స్‌లకు తప్పనిసరిగా పార్కింగ్ స్థలాన్ని కేటాయించాల్సి ఉంది. అయితే ఏ షాపింగ్ కాంప్లెక్స్ యజమాని తగినంత పార్కింగ్ స్థలాన్ని కేటాయించలేదు. దీంతో నగరంలో వాహనాలు రోడ్లు పైనే పార్కింగ్ చేస్తున్నారు. అసలే రోడ్లు 30 నుంచి 35 అడుగులు మాత్రమే ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నగర పాలక సంస్థ పరిధిలో దాదాపు 40 నుంచి 50 షాపింగ్ కాంప్లెక్స్‌లు, వందకు పైగా భారీ వ్యాపార దుకాణాల సముదాయాలు ఉన్నాయి. దాదాపు అన్ని షాపింగ్ కాంప్లెక్స్‌లు పార్కింగ్‌కు తగిన స్థలాన్ని ఏర్పాటు చేయలేదు. ముఖ్యంగా ట్రంకురోడ్డు, నర్తకీ సెంటర్, గాంధీబొమ్మ, వీఆర్సీ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, మినీబైపాస్‌రోడ్డు, కేవీఆర్ పెట్రోల్ బంక్, వేదాయపాళెం తదితర ప్రాంతాల్లో భారీ షాపింగ్ మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, దుకాణాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇదే సమస్య తలెత్తుతుంది. వీటి పరిస్థితిపై నగర పాలక సంస్థ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి దృష్టి సారించారు. సెల్లార్లు లేకుండా చేపట్టిన నిర్మాణాలు, సెల్లార్లు ఉండి దుకాణాలు, గోడౌన్లు వినియోగిస్తున్న భవనాలను గుర్తించాలని టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జరీ చేశారు. దీంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇప్పటి వరకు దాదాపు 35 భవనాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు భవన యజమానులకు నోటీసులు జారీ చేసి వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కళాశాలల భవనాల పరిస్థితి అంతే! నగరంలోని ప్రధాన కూడళ్లలో కళాశాలల భవనాల్లో దాదాపు 50 శాతం భవనాలకు పార్కింగ్ స్థలం లేదు. రోడ్డు మీదే వాహనాలు పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్యతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు సెల్లార్లు లేకుండా రెసిడెన్షియల్ భవనాలుగా నిర్మించి కళాశాలలకు భవనాలను బాడుగులకు ఇస్తున్నారు. దీంతో కళాశాలకు వచ్చే ఉపాధ్యాయులు, విద్యార్థుల వాహనాలను రోడ్లు పైనే పార్కింగ్ చేయాల్సి వస్తుంది. వారం రోజుల్లో నోటీసులు జారీ చేస్తాం గతంలో ఇష్టారాజ్యంగా సెల్లార్లు లేకండా భవనాలు నిర్మించారు. దీంతో షాపింగ్ మాల్స్‌కు వచ్చేవా రు రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. భవన యజమానులకు వారం రోజుల్లో నోటీసులు జారీ చేస్తాం. పోలీస్ శాఖ సహకారంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – పీవీవీఎస్ మూర్తి, కార్పొరేషన్ కమిషనర్ -
టీడీపీ ప్రలోభాలు,మద్యం బాటిళ్లు స్వాధీనం
-
నెల్లూరు వైఎస్ఆర్సీపీలోకి జోరుగా వలసలు
-
ఆరు క్లియర్.. నాలుగు పెండింగ్
టీడీపీ తొలి జాబితా విడుదలైంది. గురువారం రోజంతా అభ్యర్థుల ఎంపికపై అమరావతిలో హైడ్రామా నడిచింది. జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో గంటకొక పేరు తెరపైకి వచ్చింది. అంతా గందరగోళంగా మారింది. ముఖ్యంగా కావలి, సూళ్లూరుపేట, ఉదయగిరి, వెంకటగిరి విషయంలో అధిష్టానం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. రాత్రి 11 గంటల తర్వాత ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కావలికి సంబంధించి మధ్యాహ్నం నుంచి బీద, కాటంరెడ్డి పేర్లు దోబూచులాడాయి. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి తేలకపోవడంతో క్షణక్షణానికి సమీకరణాలు మారిపోయాయి. ఎటూ తేల్చుకోలేని అధిష్టానం పెండింగ్‌లో పెట్టింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు జిల్లా పార్లమెంట్ స్థానానికి టీడీపీ అభ్యర్థి కరువయ్యాడు. రెండు నెలలుగా భూతద్దంతో వెతుకుతున్నా పోటీకి నేతలు ఎవరూ దొరకని పరిస్థితి. ఎంపీ అభ్యర్థి చుట్టూ అసెంబ్లీ సీట్ల రాజకీయం రోజుకొక మలుపు తిరుగుతోంది. అసెంబ్లీ టికెట్ల ఖరారు అయినా ఎంపీ అభ్యర్థిపై సృష్టత లేకపోవడంతో గందరగోళం కొనసాగుతోంది. ప్రధానంగా కావలి నియోజకవర్గంలో రాజకీయ గందరగోళం రేగింది. జిల్లాలో ఇప్పటి వరకు నెల్లూరు సిటీ నుంచి నారాయణ, నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, సర్వేపల్లి నుంచి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గూడూరు నుంచి పాశం సునీల్ కుమార్, ఆత్మకూరుకు బొల్లినేని కృష్ణయ్య, కోవూరుకు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. వెంకటగిరి, సూళ్లూరుపేట, ఉదయగిరి, కావలి నియోజకవర్గాల అభ్యర్థిత్వాలపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఎంపీ టికెట్‌తో మొదలైన ప్రతిష్టంభన ప్రతిపక్ష పార్టీ ఎంపీకి దీటుగా ఉండే అభ్యర్థి టీడీపీకి కరువయ్యాడు. దీంతో వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యేలు కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, వంటేరు వేణుగోపాల్రెడ్డిలో ఒకరికి ఎంపీ టికెట్ ఇప్పిస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మంత్రి సోమిరెడ్డి హామీతో టీడీపీలోకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఎంపీ టికెట్ కుదరని పక్షంలో కావలి అసెంబ్లీ సీటు అయినా ఇస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి రెండు పక్షాల మధ్య తర్జనభర్జనలు సాగుతున్నాయి. కావలి అసెంబ్లీ నుంచి కచ్చితంగా పోటీ చేస్తానని చెప్పి పదే పదే చెప్పిన బీద మస్తానరావును ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా వెళ్లమని తొలుత పార్టీ సూచించింది. తనకు కావలి అసెంబ్లీ టికెట్ ఇవ్వమని కోరడటంతో కావలి ఖరారు చేశారు. మళ్లీ రెండు రోజుల నుంచి ఎంపీ అభ్యర్థిగా బీద మస్తాన్‌రావును పార్టీ ఖరారు చేసినట్లు ప్రచారం జరిగింది. కావలి సీటు కోసం బీద రవిచంద్ర లాబీయింగ్ మొదలు పెట్టారు. అయితే మస్తాన్‌రావు తనకు పార్లమెంట్‌కు పోటీ చేయడం ఇష్టం లేదని ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పడంతో మళ్లీ రగడ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి తనకు కావలి టీడీపీ టికెట్ ఖరారైందని, చంద్రబాబును కలవడానికి వెళ్తున్నానని సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెట్టడంతో తీవ్ర వివాదం రేగింది. దీంతో బీద వర్గీయులు టీడీపీకి రాజీనామా చేస్తామని హడావుడి చేశారు. దీంతో టిక్కెట్ ఏవరికి ఖరారు కాలేదని తొలుత ప్రచారం చేశారు. ఆతర్వాత బీద మస్తానరరావు కావలి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని మళ్లీ లీకులు మొదలు పెట్టారు. పార్టీలో చేరడానికి రమ్మంటే ఇలా టికెట్ ఇచ్చినట్లు ప్రచారం చేయడంపై పార్టీలో చర్చసాగుతోంది. -
థర్డ్ జండర్‌కు ఓటు హక్కు
సాక్షి,నెల్లూరు: భారత ఎన్నికల కమిషన్ పురుషులు, మహిళలతో పాటు థర్డ్ జండర్‌కు ఓటు హక్కు కల్పించింది. 2009 ఎన్నికల ముందు థర్డ్ జండర్‌కు ఓటు హక్కు లేదు. థర్డ్ జండర్లలో అవగాహన పెరగడం, సమాజంలో అందరితో సమానంగా జీవనం సాగిస్తున్నామని వారు అందోళన కార్యక్రమాలు చేశారు. దీంతో థర్డ్ జండర్‌కు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు మంజూరు చేశారు. వాటి ఆధారంగా దరఖాస్తులు చేసుకున్న వారికి ఓటు హక్కు కల్పించారు. 2009 ఎన్నికల నుంచి థర్డ్ జండర్‌కు ఓటు హక్కు కల్పించారు. 2014 ఎన్నికల నాటికి జిల్లాలో 298 మంది ఓటు హక్కు పొందారు. 2019 ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు 338 మంది ఓటు హక్కు పొందారు. -
ఆ ముగ్గురి టార్గెట్.. వైఎస్సార్సీపీ
సాక్షి, నెల్లూరు: ఈ ఇద్దరూ ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలే. కానీ వారి పార్టీలు వేరు. పశ్చిమగోదావరి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో విధినిర్వహణలో ఉన్న అధికారులపై దౌర్జన్యాలు, దాడులు చేసినా కూడా స్టేషన్ వద్దకు కూడా పిలిపించకుండా నోటీసు ఇచ్చి అక్కడ పోలీసులు మమ అనిపించారు. నెల్లూరు జిల్లాలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేపై మాత్రం ఎఫ్ఐఆర్ నమోదైన గంటల వ్యవధిలో భారీ పోలీసుల బలగాల సాయంతో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇదీ ప్రస్తుతం చంద్రబాబు పాలనలో నడిచిన పోలీస్ ‘పచ్చ’పాతం. వైఎస్సార్సీపీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేసి ఆ పార్టీ శ్రేణుల్ని భయభ్రాంతులకు గురి చేసేందుకు చినబాబు సారథ్యంలో జిల్లాకు చెందిన టీడీపీ పెద్దలు పోలీస్ శాఖలోని కీలక పదవుల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించుకుని పచ్చ కుట్రలకు తెర తీశారు. నెల్లూరురూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కేసు నమోదు నుంచి అరెస్ట్‌ల పర్వం వరకు ఆ ముగ్గురు పోలీస్ అధికారులే స్క్రీన్‌ప్లే దర్శకత్వం వహించి జైలుకెళ్లేలా వ్మూహాత్మకంగా వ్యవహరించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. జిల్లాపై పెద్దగా అవగాహన లేని పోలీస్ బాస్‌ను సైతం తప్పదోవ పట్టిస్తూ ఆ శాఖను ఆ ముగ్గురు తమ గుప్పెట్లో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేసేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కీలక పదవుల్లో వారే.. పోలీస్‌శాఖలో ప్రధానమైన ఇంటెలిజెన్స్, నగరంలో ఉన్న లా అండ్ఆర్డర్, స్పెషల్ బ్రాంచ్ శాఖలో ఉన్న పోలీస్ అధికారులు ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి వారే. టీడీపీ అధినేత సామాజిక వర్గానికి చెందిన ఆ ముగ్గురు అధికారులు పథకం ప్రకారం ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించేలా ప్రభుత్వ పెద్దలతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం ఉంది. అందులో భాగంగానే తొలి విడతగా ఎమ్మెల్యే కోటంరెడ్డిని జైలుపాలు చేయించారు. ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్న అధికారి ఏడాది కిందటే విజయవాడ నుంచి నెల్లూరుకు బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి కేవలం ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేస్తూ ఆ పార్టీ నేతలపై ప్రత్యేక నిఘా పెట్టి ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలకు సమాచారం చేరవేస్తున్నారు. అధికార పార్టీలో అసంతృప్తులను గుర్తించి వారి సమాచారం టీడీపీ పెద్దలకు చేరవేయడంతో పాటు వీరే నేతలను బుజ్జగించే పని కూడా చేస్తున్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీ ఓటర్ల తొలగింపు, ప్రభుత్వ అనుకూల సర్వేలు కూడా ఇంటెలిజెన్స్ విభాగం అధికారి కనుసన్నల్లో నడుస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల నెల్లూరు రూరల్‌లో ప్రభుత్వ అనుకూలంగా సర్వే చేస్తూ పట్టుబడిన యువకులకు ఇంటెలిజెన్స్ అధికారి బహిరంగంగా అండగా నిలవడంతో పాటు సర్వే చేసిన యువకులను పట్టించిన వారిపై కేసులు నమోదు వరకు ఆ అధికారి అన్ని తానై నడిపించినట్లు తెలిసింది. నగరంలో ఉన్న లా అండ్ ఆర్డర్లో ఉన్న పోలీస్ అధికారి సైతం ప్రతిపక్ష పార్టీ నేతలపై చిన్న ఫిర్యాదు వచ్చిన వెంటనే ఆయన స్వయంగా కలగజేసుకోవడం పాటు కేసులు పెట్టించి వారిని భయభ్రాంతులకు గురి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీస్ బాస్ కనుసన్నల్లో నడిచే స్పెషల్ బ్రాంచ్ విభాగంలో పనిచేసే ఓ అధికారి కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల బదిలీల్లో కూడా ఆయన పాత్రే కీలకంగా ఉందని విమర్శలు లేకపోలేదు. అధికార పార్టీకి సహకరించే వారికే పోస్టులు ఇప్పించేలా వ్యవహరించారని ఆ శాఖలోనే విమర్శలు వెల్లువెత్తాయి. గత ఎన్నికల సమయంలోనే జిల్లాలోనే పని చేసిన ఆ అధికారి ప్రస్తుత ఎన్నికల సమయంలో కూడా కీలక పోస్టులోనే ఉన్నారు. జిల్లా పోలీస్ బాస్నుకు అన్ని తానై వ్యవహరించే సదరు అధికారి అధికార పార్టీకి అనుకూలంగా ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ ప్రతిపక్ష పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నాడన్న విమర్శలు ఆశాఖ నుంచే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్ వెనుక ఈ అధికా రి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ ముగ్గురే ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేస్తూ ఎన్నికల సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా కుట్రలు పన్నే అవకాశాలు ఉంటాయన్న ఆరోపణలున్నాయి. ‘పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విధి నిర్వహణలో ఉన్న అధికారులను అడ్డుకోవడంతో పాటు దాడులు చేసిన ఘటనల్లో అక్కడ పోలీసులు 353 సెక్షన్ కింద కేసులు నమోదు చేసినప్పటికి స్టేషన్‌కు కూడా పిలిపించకుండా సుప్రీంతీర్పు ప్రకారం 41 నోటీసు ఇచ్చారు’ ‘నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే స్టేషన్‌కు వెళ్లి సీఐని ప్రశ్నిస్తే మాత్రం విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకున్నారంటూ కేసు నమోదు చేసి సుప్రీం తీర్పునకు విరుద్ధంగా 41 నోటీసు ఇవ్వకుండా కోర్టుకు హాజరు పరిచి జైలుకు పంపారు.’ -
మాట ఇస్తే తప్పని నేత
సాక్షి, నెల్లూరు(సెంట్రల్): రాష్ట్రంలో ప్రజలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట ఇచ్చారంటే ఎన్ని కష్టాలు వచ్చినా తప్పని గొప్ప నాయకుడు అని నెల్లూరుసిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ పేర్కొన్నారు. స్థానిక 42వ డివిజన్‌కు చెందిన మైనార్టీ సోదరులు షేక్ సత్తార్‌తోపాటు మరో 150 మంది స్థానిక మెక్లిన్స్ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ సమక్షంలో సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా నవరత్నాలు పథకాలు తీసుకొచ్చారన్నారు. ఈ ఐదేళ్లలో చంద్రబాబునాయుడు ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ఎన్నికల సమీస్తున్న నేపథ్యంలో మాయమాటలు చెప్పేదానికి మరొమారు సిద్ధమయ్యారన్నారు. ఇన్నేళ్లు మైనార్టీలను పట్టించుకోని చంద్రబాబు మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చి నాటకాలాడుతున్నారన్నారు. ఇమామ్ మౌజ్‌లకు 14 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోని చంద్రబాబు మైనార్టీలపై ప్రేమ చూపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనన్నారు. అందులో భాగంగానే నెల్లూరు నగరంలో బీసీకోటాలో అజీజ్‌ను మేయర్‌ను చేసినట్లు పేర్కొన్నారు. మేయర్ అయిన నెలరోజుల్లోపే 2019 ఎన్నికల్లో ఎమ్మెలే టికిట్ ఇస్తానని చెప్పి అజీజ్‌ను టీడీపిలోకి ఆహ్వానించిన మంత్రి నారాయణ ప్రస్తుతం మొండి చేయి చూపించారన్నారు. నారాయణే నగర అభ్యర్థిగా బరిలో దిగుతూ ముస్లిం మైనార్టీలను మోసం చేశారని విమర్శించారు. హౌస్ ఫర్ ఆల్ ఇళ్ల నిర్మాణం పేరుతో టీడీపీ నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఒక్క అవకాశం ఇస్తే ప్రజలకు మంచి చేసే అవకాశం కలుగుతుందన్నారు. షేక్ సర్దార్, జబ్బీర్, షాహుల్, ఆసిఫ్, షేక్ షబ్బీర్, నాసిర, షేక్‌హసీనా, షేక్ గౌసియా పార్టీలో వైఎస్సార్సీపీలో చేరారు. కార్యక్రమంలో ఇంతియాజ్,. ఖలీల్ అహ్మద్, హంజా ఉస్సేని, ఇస్మాయిల్, బాబా అబ్దుల్, ఎండీ తారిక్ అహ్మద్, మున్వర్, ఆలిం, మీరా మొహిద్దీన్, ఫజల్ అహ్మద్, శివపురం సురేష్, ఎస్కే హాజీ పాల్గొన్నారు. -
చంద్రబాబుకైనా ఓటమి తప్పదు
సాక్షి, సంగం: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి బొల్లినేని కృష్ణయ్యనాయుడే కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు పోటీ చేసినా గెలుపొందేది తానేనని ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. సంగం మండలం దువ్వూరుకు చెందిన నాయకుడు సూరి మదన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో 50 మంది సోమవారం నెల్లూరులోని ఎమ్మెల్యే నివాసంలో వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీ నాయకులకు ఏ అవసరమొచ్చినా తాను అందుబాటులో ఉంటానని తెలిపారు. టీడీపీ నాయకులు పెట్టే ప్రలోభాలకు ఆత్మకూరు నియోజకవర్గంలోని నాయకులు ఏ ఒక్కరూ లొంగబోరన్నారు. ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా పోటి చేస్తున్న బోల్లినేని కృష్ణయ్యనాయుడు ఆదివారం చేజర్ల మండలంలో మేకపాటి గౌతమ్‌రెడ్డిని ఓడిస్తానని అనడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. బొల్లినేని కృష్ణయ్య ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగే అవినీతి అక్రమాలను అరికట్టాలని తెలిపారు. రైతుల కష్టాలను గుర్తించి టీడీపీ ప్రభుత్వానికి ముందు తెలియజేయాలన్నారు. అంతేగానీ గౌతమ్‌రెడ్డిని ఓడిస్తానంటే కృష్ణయ్య కాదు కదా సాక్షాత్తు చంద్రబాబు పోటీ చేసినా తన చేతిలో ఓటమి తప్పదని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేపట్టడంతో పేదలు పడుతున్న కష్టాలను గుర్తించి ఆరోగ్య శ్రీ తదితర గొప్ప పథకాలు ప్రవేశపెట్టారన్నారు. పాదయాత్ర అనే పదానికి అర్థమే వైఎస్ కుటుంబమని, ఇది రాష్ట ప్రజలందరికీ తెలుసునన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని కుటుంబంలో నుంచి వచ్చిన రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని 2019లో ఓటు అనే ఆయుధంతో ఆశీర్వదించాలన్నారు. 2019లో రాజన్న రాజ్యం తిరిగి వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ వారు కోరిన పనిని ఒక్క రోజులో పూర్తి చేసే విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీలో చేరినవారిలో నాయకులు షేక్ మహబూబ్‌బాష, కరీముల్లా, నాయబ్బాషా, అబ్దుల్ జలీల్, రఫీ అహ్మద్, షాహుల్, హమీద్, అబిద్‌బాషా, జమీర్, అలీంబాషా, ఖాజారసూల్, సిరాజ్, ఇర్ఫాన్, వహాబ్బాషా, ఉస్మాన్, జలీల్, జన్నత్, చోటా, బాషా, గౌస్‌మొహిద్దీన్, షఫీ, సమీవుల్లా, గౌస్‌బాషా, జమీర్, నిజాం, అక్బర్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో నాయకులు మెట్టుకూరు వాసుదేవరెడ్డి, రేబాల సురేంద్రరెడ్డి, వేల్పుల కోటేశ్వరరావు, భువన రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
హడావుడిగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
సాక్షి, సూళ్లూరుపేట: మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల కోడ్ రానున్న దృష్ట్యా సోమవారం అధికారపార్టీ నాయకులు పట్టణంలో హడావుడిగా పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. రూ.40 లక్షలతో అన్న క్యాంటీన్, రూ.8 లక్షలతో అంగన్వాడీ భవనాన్ని, రూ.30 లక్షలతో నిర్మించిన పశువైద్యశాల భవనాన్ని, నుడా పార్కును ప్రారంభించారు. నుడా పార్కు నిర్మాణం ఇంకా పూర్తి కాకుండానే ప్రారంభం చేయడం విమర్శలకు దారితీసింది. రూ.142 కోట్లతో ఏఐఐబీ నిధులతో తాగునీటి పథకానికి, రూ. 34.65 కోట్లతో రోడ్లు, మురుగు నీటికాలువ నిర్మాణానికి, మటన్‌మార్కెట్, కంపోస్ట్ యార్డ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమాలకు మంత్రి నారాయణ వస్తున్నారని ప్రచారం చేశారు. సోమవారం సాయంత్రం మంత్రి రావడం లేదని తెలుగు తమ్ముళ్లు శంకుస్థాపన చేశారు. -
‘నేర’పురి కేరాఫ్ నెల్లూరు
ప్రశాంతతకు మారుపేరైన జిల్లాలో నేర సంస్కృతి జడలు విప్పుతోంది. పొట్టపోసుకునే వృత్తుల్లాగే ప్రాణాలు తీసే నేర ప్రవృత్తి సమాజంలో వేళ్లూనుకుపోతోంది. హత్యలు వణికిస్తున్నాయి. మహిళలపై అఘాయిత్యాలు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయి. మనం అనే భావన కన్నా నాది అనే స్వార్థం ఎక్కువైంది. కొందరు డబ్బు కోసం మానవత్వం మరిచి ఎంతకైనా తెగిస్తున్నారు. సాక్షి, నెల్లూరు(క్రైమ్): జిల్లాలో నేరాలు ఏడాదికేడాది పెరిగిపోతున్నాయి. ప్రజలకు భద్రత కరువైందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మారుమూల పల్లెల్లో శాంతిభద్రతల పరిరక్షణ సంగతి దేవుడెరుగు.. హైటెక్ వసతులు, అధికార యంత్రాంగం కేందీకృతమైన నగరం, పట్టణాల్లో సైతం శాంతిభద్రతల పరిరక్షణ కష్టతరంగా మారింది. రోజురోజుకు పెరుగుతున్న నేరప్రవృత్తి, పోలీసుల నిర్లక్ష్యం, ఏళ్ల తరబడి సాగుతున్న కేసుల పరిశోధన వెరసి ప్రజలకు సత్వర న్యాయం అందని ద్రాక్షాలా మారుతోంది. నగరవాసులకు సాధారణ భద్రత కల్పించలేని దుస్థితిలో పోలీసు వ్యవస్థ ఉండడం గమనార్హం. సిబ్బంది, ఆర్థిక, మానవ వనరుల కొరతను పోలీసులు సాకుగా చూపుతున్నప్పటికీ పౌరులకు భద్రత కల్పించాలనే ప్రాథమిక బాధ్యతను విస్మరించే పరిస్థితి తలెత్తుతోంది. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, లైంగికదాడులతో జిల్లాలో శాంతిభద్రతలు క్రమేపీ క్షీణదశకు చేరుకుంటున్నాయి. కొరవడిన నిఘా.. జాతీయ రహదారిపై వరుస దోపిడీలు, దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి. దీంతో దొంగలు బరితెగిస్తున్నారు. గతంలో వెంకటాచలం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ బంగారు వ్యాపారిపై దాడిచేసి సుమారు మూడు కేజీల బంగారు ఆభరణాలతోపాటు ఆయన కారును దుండగులు దోచుకెళ్లారు. ఘటన జరిగి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకూ ఆచూకీ కనుగొనడంలో పోలీసులు సఫలీకృతులు కాలేదు. ఇటీవల తడ శ్రీసిటీ నుంచి రూ.4.50 కోట్ల వ్యయం చేసే సెల్ఫోన్లను తరలిస్తున్న కంటైనర్‌ను దుండగులు దోచుకెళ్లారు. ఇంతవరకూ ఈ కేసులో పురోగతి లేదు. చిన్నాచితకా నేరాలు తరచూ చోటుచేసుకుంటూనే ఉన్నాయి. వీటిని అరికడతామని హైవే పెట్రోలింగ్ ముమ్మరం చేస్తామన్న ఉన్నతాధికారులు మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు. జనవరి నుంచి చోటుచేసుకున్నవి జనవరి 2న నెల్లూరు రాజీవ్‌గాంధీకాలనీలో శ్యామల అనే మహిళ దారుణ హత్యకు గురైంది. 8న బాలాయపల్లి మండలం చిలమాసూరుగ్రామ తిప్ప సమీపంలో జి.శ్రీనివాసులు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఫిబ్రవరి 1వ తేదీన సీతారామపురం పోరుమామళ్లి ఘాట్‌రోడ్డులో దుండగులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి పెట్రోలు పోసి తగులబెట్టారు. 9న ఇందుకూరుపేటలో కూతురిని వేధిస్తున్నాడని అల్లుడిని మామ దారుణంగా హత్య చేశాడు. 11న చిల్లకూరు మండలం నర్రావారిపాళెంలో వెంకటమ్మ (60) అనే వృద్ధురాలిని కుమారుడు చిన చెంచయ్య చంపేశాడు. 11న ప్రశాంతినగర్‌లో సంధ్య అనే మహిళను భర్త మహేష్ అతిదారుణంగా హత్య చేశాడు. 12న కోట మండలంలోని వీరారెడ్డిసత్రం కాలనీలో నరేష్ (45) అనే కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. 13న శ్రీసిటీ నుంచి కోల్‌కత్తాకు రూ.4.50 కోట్లు విలువచేసే సెల్ఫోన్లతో బయలుదేరిన కంటైనర్ అపహరణకు గురైంది. 19న పొదలకూరు మండలంలో మోటారుబైక్పై వెళుతున్న కాంతమ్మ అనే వృద్ధురాలిని బెదిరించి నాలుగు సవర్ల బంగారు గొలుసును లాక్కెళ్లారు. 19న లిఫ్ట్ ఇస్తామని బైక్‌పై ఎక్కించుకుని విశ్రాంత ఉద్యోగి నుంచి నాలుగుసవర్ల బంగారు చైన్, రూ.2 వేల నగదు, సెల్‌ఫోన్‌ను దోచుకెళ్లారు. 24న రాత్రి నెల్లూరు నగరంలోని రాయపుపాళెం విజయకృష్ణ, అతని కుటుంబసభ్యులపై ప్రత్యర్థులు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడిచేశారు. తీవ్రగాయాలై విజయకృష్ణ మృతిచెందాడు. 26న సూళ్లూరుపేట – శ్రీకాళహస్తి మార్గంలోని సంతవేలూరు నుంచి మంగళంపాడకు వెళ్లే రహదారిలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. 27న నేతాజీనగర్‌లో విశ్రాంత ఉద్యోగి వసంతకుమారి దారుణ హత్యకు గురైంది. నగలు, డాక్యుమెంట్స్‌ను అపహరించారు. బాలికలపై.. జనవరి 9వ తేదీన కోవూరులో బాలికపై యువకుడు లైంగికదాడి యత్నం చేశాడు. 12న డక్కిలి మండలంలో మైనర్ బాలికపై లైంగికదాడి యత్నం జరిగింది. 28న కావలిలో 12 ఏళ్ల కుమార్తెపై తండ్రి లైంగికదాడి చేసి సభ్యసమాజం తలదించుకునేలా చేశాడు. మార్చి 3వ తేదీ రాత్రి తడ మండలంలో పదేళ్ల బాలికను ఓ వ్యక్తి బలవంతంగా తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఏ సంవత్సరంలో ఎన్ని.. నమోదైన కేసులు 2017 2018 2019 దోపిడి హత్యలు 8 8 1 హత్యలు 57 61 9 దోపిడీలు 33 51 10 పగటి దొంగతనాలు 84 61 - రాత్రి దొంగతనాలు 290 325 - సాధారణ చోరీలు 835 693 - అత్యాచారాలు 59 62 10 జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.20 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు, నగదును దుండగులు అపహరించారు. రోడ్డు ప్రమాదాల్లో సుమారు 30 మందికిపైగా మృతిచెందారు. పదిమంది దారుణహత్యకు గురయ్యారు. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యం చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. ఒక్కో సమయంలో హత్యలకు వెనుకాడడం లేదు. గతంలో ఉస్మాన్‌సాహెబ్‌పేటలో విశాంత్ర ఆర్జేడీని గుర్తుతెలియని దుండగులు హత్యచేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అపహరించారు. ఈ ఘటనపై పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఇంతవరకూ చిన్నపాటి క్లూ దొరకలేదు. కేసు ఎక్కడివేసిన గొంగళి అక్కడే అన్నచందాన మారింది. తాజాగా నేతాజీనగర్ 6వ వీధిలో విశ్రాంత ఆర్ఐ వసంతకుమారి దారుణహత్యకు గురైంది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను దుండగులు అపహరించారు. సూళ్లూరుపేటలో యువతిపై అత్యాచార ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. గంజాయికి అలవాటుపడ్డ కొందరు ఈ దారుణానికి ఒడిగట్టారు. తడ మండలంలో పురుషులపై దాడులకు పాల్పడి, మహిళలపై లైంగిక దాడి చేసే ఓ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గంజాయి మత్తులో ఆ ప్రాంతంలో నేరాలు జరుగుతున్నట్లు పోలీసులు విచారణలో బయటపడింది. శ్యామల మృతదేహం (ఫైల్) -
కబంధ హస్తాల్లో మున్సిపల్ షాపులు
నెల్లూరు సిటీ: సొమ్మొకరిది..సోకొకరిది అన్నట్లుగా తయారైంది నగర పాలక సంస్థ మున్సిపల్ షాపుల పరిస్థితి. 20 ఏళ్లకుపైగా కొందరి కబంధ హస్తాల్లో మున్సిపల్ షాపులు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ, రాజకీయ నాయకుల అండదండలతో షాపు లీజుదారులు కొనసాగుతున్నారు. బయట వ్యక్తులకు ఎక్కువ మొత్తానికి షాపులను అద్దెకు ఇచ్చి కార్పొరేషన్ ఆదాయానికి గండికొడుతున్నారు. మున్సిపల్ షాపులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సైతం వెనుకంజ వేస్తున్నారు. నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో 14 మున్సిపల్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. అందులో 234 షాపులు ఉండగా, వాటిలో 64 షాపులు 20 ఏళ్లకు పైబడి కొందరి చేతుల్లో ఉన్నాయి. మరో 100 నుంచి 120 షాపులను పదేళ్లకుపైగా కొందరు బినామీలు నడుపుతున్నారు. మున్సిపల్ నిబంధనల ప్రకారం షాపు లీజుకు తీసుకుని మూడేళ్లు దాటితే వేలం పాట నిర్వహించాలి. అయితే ఈ నిబంధనలు అమలు కావడంలేదు. కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు కొన్ని సార్లు వేలం పాటలు నిర్వహించేందుకు యత్నించినా బడాబాబులు, అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లతో అడ్డుకుని షాపు లీజుదారుడికే కట్టబెట్టుతున్నారనే విమర్శలు ఉన్నాయి. లీజుదారుడు ఒకరు.. బాడుగకు ఉండేది మరొకరు... మున్సిపల్ షాపులను లీజుకు తీసుకున్న వారు మాత్రమే షాపు నిర్వహణ చేయాలి. అయితే లీజుదారుడు కార్పొరేషన్‌కు తక్కువ బాడుగ చెల్లిస్తూ బయట వ్యక్తికి ఎక్కువ బాడుగలకు ఇస్తున్నారు. చిన్నబజారు, డైకాస్రోడ్డు, మద్రాసుబస్టాండు, గాంధీబొమ్మ సెంటర్లోని మున్సిపల్ కాంప్లెక్స్‌లో కొందరు షాపులను వేలం పాటలో రూ.5 నుంచి రూ.7వేలకు తీసుకుని, బయట వ్యక్తికి అదే షాపును రూ.10వేల నుంచి రూ.15వేలకు బాడుగకు ఇస్తున్నారు. వేలం పాటలు నిర్వహించపోవడంతో ఏటా లక్షల రూపాయల కార్పొరేషన్ ఆదాయానికి గండి పడుతోంది. మున్సిపల్ షాపుల వేలానికి అడ్డంకులు గతంలో పనిచేసిన కమిషన్ పీవీవీఎస్ మూర్తి కార్పొరేషన్ పరిధిలోని 25 ఏళ్ల లీజు నిండిన 65 షాపులకు వేలం పాట నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. షాపుల వేలం పాట తేదీని సైతం ప్రకటించారు. అయితే ఆయా షాపుల లీజుదారులు కోర్టుకు వెళ్లడంతో తాత్కాలికంగా వేలం పాట నిలిపివేశారు. ఇది జరిగి ఒకటన్నర ఏడాది కావస్తున్నా అధికారులు అటు వైపుగా కన్నెత్తి చూడకపోవడం విశేషం. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి వేలం పాటలకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. షాపింగ్ కాంప్లెక్ పేరు షాపుల సంఖ్య ప్రకాశం పంతులు కాంప్లెక్స్ 18 సుబేదారుపేట కాంప్లెక్స్ 13 బీవీఎస్ఎం కాంప్లెక్స్ 16 పప్పులవీధి కాంప్లెక్స్ 24 ఏసీ భవన్ కాంప్లెక్స్ 12 పనుతల వారి కాంప్లెక్స్ 13 చిన్నబజారు కాంప్లెక్స్ 38 డైకాస్రోడ్డు 06 సౌదాన్య కాంప్లెక్స్ 15 డైకాస్రోడ్డు కాంప్లెక్స్ 05 ఏసీ విహార్ కాంప్లెక్స్ 05 ఏసీ సుబ్బారెడ్డి కాంప్లెక్స్ 22