కొత్తహాలు సమీపంలోని భారీ భవనం సెల్లారులో దుకాణాల ఏర్పాటు
టీడీపీ ప్రభుత్వ హయాంలో అక్రమార్కులు చెలరేగిపోయారు. అధికారం అండతో టౌన్‌ప్లానింగ్ అధికారులను డమ్మీలను చేసి, అనుమతులు లేకుండా భారీ వ్యాపార సముదాయాలు నిర్మించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాల కారణంగా నగరంలో ట్రాఫిక్ సమస్యకు కారణమవుతోంది. కమర్షియల్ భవనాల్లో పార్కింగ్ వసతి కోసం సెల్లార్లు నిర్మించాల్సి ఉంది. చాలా మంది భవన యజమానులు సెల్లారు లేకుండానే భవనాలు నిర్మించారు. నిర్మించిన సెల్లార్లను దుకాణాలు, గోడౌన్లుగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఉల్లంఘనులపై కార్పొరేషన్ అధికారులు కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు.
సాక్షి, నెల్లూరు సిటీ : నెల్లూరు నగరంలో పాఠశాలలు, కళాశాలలు, వస్త్ర దుకాణాలు, బంగారు దుకాణాలు, ఇతర కమర్షియల్ భవనాల్లో సెల్లార్లు లేకుండానే యజమానులు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టారు. గత ప్రభుత్వం హయాంలో కొందరు భవన యజమానులు అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఆయా కమర్షియల్ భవనాల్లో సెల్లార్లు లేకపోవడంతో రోడ్లు పైనే పార్కింగ్ చేస్తున్నారు. ఫలితంగా నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. టౌన్‌ప్లానింగ్ అధికారుల అవినీతి, గత ప్రభుత్వ పాలకుల ఒత్తిడితో అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించకపోవడంతో ఇష్టానుసారంగా షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించారు. నిబంధలన ప్రకారం షాపింగ్ కాంప్లెక్స్‌లకు తప్పనిసరిగా పార్కింగ్ స్థలాన్ని కేటాయించాల్సి ఉంది. అయితే ఏ షాపింగ్ కాంప్లెక్స్ యజమాని తగినంత పార్కింగ్ స్థలాన్ని కేటాయించలేదు. దీంతో నగరంలో వాహనాలు రోడ్లు పైనే పార్కింగ్ చేస్తున్నారు. అసలే రోడ్లు 30 నుంచి 35 అడుగులు మాత్రమే ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నగర పాలక సంస్థ పరిధిలో దాదాపు 40 నుంచి 50 షాపింగ్ కాంప్లెక్స్‌లు, వందకు పైగా భారీ వ్యాపార దుకాణాల సముదాయాలు ఉన్నాయి.
దాదాపు అన్ని షాపింగ్ కాంప్లెక్స్‌లు పార్కింగ్‌కు తగిన స్థలాన్ని ఏర్పాటు చేయలేదు. ముఖ్యంగా ట్రంకురోడ్డు, నర్తకీ సెంటర్, గాంధీబొమ్మ, వీఆర్సీ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, మినీబైపాస్‌రోడ్డు, కేవీఆర్ పెట్రోల్ బంక్, వేదాయపాళెం తదితర ప్రాంతాల్లో భారీ షాపింగ్ మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, దుకాణాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇదే సమస్య తలెత్తుతుంది. వీటి పరిస్థితిపై నగర పాలక సంస్థ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి దృష్టి సారించారు. సెల్లార్లు లేకుండా చేపట్టిన నిర్మాణాలు, సెల్లార్లు ఉండి దుకాణాలు, గోడౌన్లు వినియోగిస్తున్న భవనాలను గుర్తించాలని టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జరీ చేశారు. దీంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇప్పటి వరకు దాదాపు 35 భవనాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు భవన యజమానులకు నోటీసులు జారీ చేసి వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
కళాశాలల భవనాల పరిస్థితి అంతే!
నగరంలోని ప్రధాన కూడళ్లలో కళాశాలల భవనాల్లో దాదాపు 50 శాతం భవనాలకు పార్కింగ్ స్థలం లేదు. రోడ్డు మీదే వాహనాలు పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్యతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు సెల్లార్లు లేకుండా రెసిడెన్షియల్ భవనాలుగా నిర్మించి కళాశాలలకు భవనాలను బాడుగులకు ఇస్తున్నారు. దీంతో కళాశాలకు వచ్చే ఉపాధ్యాయులు, విద్యార్థుల వాహనాలను రోడ్లు పైనే పార్కింగ్ చేయాల్సి వస్తుంది.
వారం రోజుల్లో నోటీసులు జారీ చేస్తాం
గతంలో ఇష్టారాజ్యంగా సెల్లార్లు లేకండా భవనాలు నిర్మించారు. దీంతో షాపింగ్ మాల్స్‌కు వచ్చేవా రు రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. భవన యజమానులకు వారం రోజుల్లో నోటీసులు జారీ చేస్తాం. పోలీస్ శాఖ సహకారంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.
– పీవీవీఎస్ మూర్తి, కార్పొరేషన్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment