తెలుగుదేశం పార్టీ
టీడీపీ తొలి జాబితా విడుదలైంది. గురువారం రోజంతా అభ్యర్థుల ఎంపికపై అమరావతిలో హైడ్రామా నడిచింది. జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో గంటకొక పేరు తెరపైకి వచ్చింది. అంతా గందరగోళంగా మారింది. ముఖ్యంగా కావలి, సూళ్లూరుపేట, ఉదయగిరి, వెంకటగిరి విషయంలో అధిష్టానం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. రాత్రి 11 గంటల తర్వాత ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కావలికి సంబంధించి మధ్యాహ్నం నుంచి బీద, కాటంరెడ్డి పేర్లు దోబూచులాడాయి. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి తేలకపోవడంతో క్షణక్షణానికి సమీకరణాలు మారిపోయాయి. ఎటూ తేల్చుకోలేని అధిష్టానం పెండింగ్‌లో పెట్టింది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు జిల్లా పార్లమెంట్ స్థానానికి టీడీపీ అభ్యర్థి కరువయ్యాడు. రెండు నెలలుగా భూతద్దంతో వెతుకుతున్నా పోటీకి నేతలు ఎవరూ దొరకని పరిస్థితి. ఎంపీ అభ్యర్థి చుట్టూ అసెంబ్లీ సీట్ల రాజకీయం రోజుకొక మలుపు తిరుగుతోంది. అసెంబ్లీ టికెట్ల ఖరారు అయినా ఎంపీ అభ్యర్థిపై సృష్టత లేకపోవడంతో గందరగోళం కొనసాగుతోంది. ప్రధానంగా కావలి నియోజకవర్గంలో రాజకీయ గందరగోళం రేగింది. జిల్లాలో ఇప్పటి వరకు నెల్లూరు సిటీ నుంచి నారాయణ, నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, సర్వేపల్లి నుంచి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గూడూరు నుంచి పాశం సునీల్ కుమార్, ఆత్మకూరుకు బొల్లినేని కృష్ణయ్య, కోవూరుకు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. వెంకటగిరి, సూళ్లూరుపేట, ఉదయగిరి, కావలి నియోజకవర్గాల అభ్యర్థిత్వాలపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.
ఎంపీ టికెట్‌తో మొదలైన ప్రతిష్టంభన
ప్రతిపక్ష పార్టీ ఎంపీకి దీటుగా ఉండే అభ్యర్థి టీడీపీకి కరువయ్యాడు. దీంతో వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యేలు కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డిలో ఒకరికి ఎంపీ టికెట్ ఇప్పిస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మంత్రి సోమిరెడ్డి హామీతో టీడీపీలోకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఎంపీ టికెట్ కుదరని పక్షంలో కావలి అసెంబ్లీ సీటు అయినా ఇస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి రెండు పక్షాల మధ్య తర్జనభర్జనలు సాగుతున్నాయి. కావలి అసెంబ్లీ నుంచి కచ్చితంగా పోటీ చేస్తానని చెప్పి పదే పదే చెప్పిన బీద మస్తానరావును ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా వెళ్లమని తొలుత పార్టీ సూచించింది. తనకు కావలి అసెంబ్లీ టికెట్ ఇవ్వమని కోరడటంతో కావలి ఖరారు చేశారు.
మళ్లీ రెండు రోజుల నుంచి ఎంపీ అభ్యర్థిగా బీద మస్తాన్‌రావును పార్టీ ఖరారు చేసినట్లు ప్రచారం జరిగింది. కావలి సీటు కోసం బీద రవిచంద్ర లాబీయింగ్ మొదలు పెట్టారు. అయితే మస్తాన్‌రావు తనకు పార్లమెంట్‌కు పోటీ చేయడం ఇష్టం లేదని ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పడంతో మళ్లీ రగడ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి తనకు కావలి టీడీపీ టికెట్ ఖరారైందని, చంద్రబాబును కలవడానికి వెళ్తున్నానని సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెట్టడంతో తీవ్ర వివాదం రేగింది. దీంతో బీద వర్గీయులు టీడీపీకి రాజీనామా చేస్తామని హడావుడి చేశారు. దీంతో టిక్కెట్ ఏవరికి ఖరారు కాలేదని తొలుత ప్రచారం చేశారు. ఆతర్వాత బీద మస్తానరరావు కావలి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని మళ్లీ లీకులు మొదలు పెట్టారు. పార్టీలో చేరడానికి రమ్మంటే ఇలా టికెట్ ఇచ్చినట్లు ప్రచారం చేయడంపై పార్టీలో చర్చసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment