గిన్నిస్‌ రికార్డు అంటూ ఉంటే.. అది చంద్రబాబుకే..! | Chandrababu Naidu So Many Inaugurations In Amravati | Sakshi
Sakshi News home page

గిన్నిస్‌ రికార్డు అంటూ ఉంటే.. అది చంద్రబాబుకే..!

Published Mon, Apr 1 2019 12:12 PM | Last Updated on Mon, Apr 1 2019 12:55 PM

Chandrababu Naidu So Many Inaugurations In Amravati - Sakshi

సాక్షి, అమరావతి : ఒకే పనికి లెక్కకు మించి శంకుస్థాపనలు చేయడంలో గిన్నిస్‌ రికార్డు అంటూ ఉంటే.. అది కచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. రాజధాని అమరావతికి శంకుస్థాపనల పేరిట చంద్రబాబు నాలుగేళ్లుగా సాగించిన ప్రహసనం అంతాఇంతా కాదు. రాజధానికి భూమి పూజ.. అంతలోనే రాజధానికి మరో చోట శంకుస్థాపన.. అంతలోనే ఆర్థిక నగరం అంటూ మరో శంకుస్థాపన.. మళ్లీ స్టార్టప్‌ ఏరియాకు శంకుస్థాపన.. రాజధానిలో రోడ్ల నిర్మాణానికి ఇంకో శంకుస్థాపన.. ఇంతలోనే  అమరావతిలో సీడ్‌ యాక్సస్‌ రోడ్డు కోసమని మరో శంకుస్థాపన.. ఇలా శంకుస్థాపనల మీద శంకుస్థాపనల పరంపర కొనసాగింది.

ఒక్కో శంకుస్థాపనకు ఒక్కో ప్రముఖుడిని పిలుస్తూ.. మీడియాలో చేసిన హడావుడి అంతా ఇంతాకాదు. ప్రతిసారి కొత్త కొత్త గ్రాఫిక్కులు, డిజైన్లు విడుదల చేసి.. రాజధాని పేరిట రకరకాల సినిమాలు చూపించారు. కానీ నాలుగేళ్ల తరువాత ఆ శంకుస్థాపనలు జరిగిన చోట ఏముందో చూస్తే మాత్రం షాక్‌ అవడం ఖాయం..! శంకుస్థాపనలు జరిగిన చోట అంతా నిర్మానుష్యం, నిర్జీవం. చంద్రబాబు సర్కారు ఘోర వైఫల్యాలకు మూగ సాక్ష్యాలు, ప్రత్యక్ష  నిదర్శనాలివిగో..   –  వడ్డాది శ్రీనివాస్, సాక్షి, అమరావతి 

రాజధానికి చంద్రబాబు భూమి పూజ:


 అమరావతి కోసం ప్రభుత్వ భూమి 15 వేల ఎకరాలు, రైతులను  బెదిరించి బలవంతంగా 33 వేల ఎకరాలు సేకరించిన తరువాత..  చంద్రబాబు ప్రభుత్వం శంకుస్థాపనల పర్వానికి తెరతీసింది. రాజధాని నిర్మాణం కోసమని చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలసి 2015, జూన్‌ 6న తుళ్లూరు మండలం మందడంలో  ఘనంగా భూమి పూజ చేశారు. ఆ రోజు సర్వమత ప్రార్థనలతో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు...    

ప్రస్తుత పరిస్థితి:

చంద్రబాబు భూమి పూజ చేసిన ప్రాంతంలో ప్రస్తుతం ఎలాంటి నిర్మాణాలు జరగడం లేదు. ఆ ప్రాంతమంతా పూర్తి నిర్మానుష్యంగా కనిపిస్తోంది.  

సీడ్‌ యాక్సస్‌ రోడ్డు

అమరావతిని తాడేపల్లి వద్ద చెన్నై–కోల్‌కత్తా జాతీయ రహదారిని అనుసంధానిస్తూ.. సీడ్‌ యాక్సస్‌రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు చంద్రబాబు 2016, జూన్‌ 25న శంకుస్థాపన చేశారు. 60 అడుగుల వెడల్పు.. 21.50 కిలోమీటర్ల  పొడవు రోడ్డును రెండు దశల్లో నిర్మించాలన్నది ప్రణాళిక. మొత్తం రూ.579కోట్ల కాంట్రాక్టును సీఎం చంద్రబాబు తన సన్నిహిత సంస్థకు అప్పగించారు. తొమ్మిది నెలల్లో ఈ సీడ్‌ యాక్సస్‌ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు.    

  ప్రస్తుత పరిస్థితి.. 

రెండున్నరేళ్లు గడిచినా.. సీడ్‌ యాక్సస్‌రోడ్డు పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే! మొదటి దశ పనులు అర్ధాంతరంగా నిలిపేశారు. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థ పనులు చేపట్టనే లేదు. ఐదు ప్రదేశాల్లో పవర్‌ డక్ట్‌లలో రెండింటి పనులు మొదలు పెట్టి అర్ధాంతరంగా ఆపేశారు. మిగిలిన మూడు పవర్‌ డక్ట్‌ల పనులు నేటికీ మొదలుపెట్టనే లేదు. జాతీయ రహదారితో రాజధానిని అనుసంధానిస్తూ రెండో దశ పనులను ఇంతవరకు ప్రారంభించనే లేదు.   

రాజధానికి ప్రధాని మోదీతో శంకుస్థాపన 

రాజధాని శంకుస్థాపనల పరంపరలో.. ఈసారి ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించారు. అంతకుముందే రాష్ట్రంలోని అన్నిజిల్లాలు, అన్ని మతాల పుణ్యక్షేత్రాల నుంచి నీరు, మట్టి తీసుకువచ్చి భావోద్వేగాలు పలికించేందుకు ప్రయత్నించారు. 2015, అక్టోబరు 22న తుళ్లూరు మండలం ఉద్దండ్రాయునిపాలెంలో మోదీతో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయించారు. మీడియా మేనేజ్‌మెంట్‌ ద్వారా అంతర్జాతీయస్థాయి రాజధాని అంటూ ప్రచారార్భాటంతో ఊదరగొట్టారు.

  ప్రస్తుత పరిస్థితి.. 


ప్రధాని మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండ్రాయునిపాలెం ప్రాంతం చూస్తే.. శంకుస్థాపన సమయంలో భారీ ఏర్పాట్లతో హడావుడి చేసిన ప్రాంతం ఇదేనా అని ముక్కున వేలేసుకోవాల్సిందే! ఎందుకంటే.. శంకుస్థాపన చేసిన పరిసరాల్లోనే కాదు చుట్టూపక్కల వందల ఎకరాల్లో కూడా ఎక్కడా ఎలాంటి నిర్మాణం లేదు. అక్కడ ఓ షెడ్డు నిర్మించి రాజధాని మాస్టర్‌ప్లాన్‌ నమూనాను అందులో పొందుపరిచారు. వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులలో బలవంతంగా సందర్శకులను తెప్పించి రాజధాని ఇలా ఉండబోతోందని ఆ మాస్టర్‌ప్లాన్‌ను చూపిస్తున్నారు.    

సింగపూర్‌ స్టార్టప్‌ ఏరియాకు శంకుస్థాపన 

సింగపూర్‌ స్టార్టప్‌ ఏరియా నిర్మాణం పేరుతో సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ 2017, మే 15వ తేదీన తుళ్లూరు మండలం ఉద్ధండ్రాయుని పాలెం వద్ద శంకుస్థాపన చేశారు. 2019 చివరికి స్టార్టప్‌ ఏరియాను నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు.   

  ప్రస్తుత పరిస్థితి.. 

దాదాపు రెండేళ్లు అవుతున్నా.. స్టార్టప్‌ ఏరియా నిర్మాణం అసలు మొదలుకాలేదు. కృష్ణా నదికి సమీపంలో ఉన్న ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా కనిపిస్తోంది.  

పరిపాలనా నగరం పేరిట మరో శంకుస్థాపన: 

రాజధానికి మూడోసారి ప్రభుత్వం ‘పరిపాలనా నగరం నిర్మాణం’ శంకుస్థాపన అంటూ.. మరోసారి హడావుడి చేసింది. 2016, అక్టోబరు 28న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో తుళ్లూరు మండలం లింగాయపాలెం వద్ద పరిపాలనా నగర నిర్మాణానికి శంకుస్థాపన చేయించారు.  

ప్రస్తుత పరిస్థితి.. 

పరిపాలనా నగరానికి వేసిన శంకుస్థాపన శిలాఫలకం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనంగా నిర్జన ప్రదేశంలో పడి ఉంది. ఆ శిలా ఫలకం చుట్టు పక్కల కనుచూపు మేర ఎక్కడా చిన్న నిర్మాణం కూడా లేదు. 

ఎక్స్‌ప్రెస్‌ రోడ్లకు శంకుస్థాపన 

అమరావతిలో ఎక్స్‌ప్రెస్, అంతర్గత రహదారుల నిర్మాణంపేరిట చంద్రబాబు 2017, మార్చి 30న మంగళగిరి మండలం ఎర్రబాలెం వద్ద శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా ఈ రహదారులను పూర్తి చేస్తామని ఘనంగా ప్రకటించారు. మొత్తం 320 కిలోమీటర్ల మేర ఏడు ఎక్స్‌ప్రెస్‌  రహదారులు, 27 అంతర్గత రహదారులు నిర్మిస్తామని చెప్పారు. అందుకు ఏకంగా రూ.14వేల కోట్లతో ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించింది.   

ప్రస్తుత పరిస్థితి.. 

ఏడాదిన్నర తరువాత కూడా ప్రభుత్వం ఒక్క రోడ్డును కూడా పూర్తి చేయలేకపోయింది. అయిదు ప్రాధాన్య రహదారులలో ఒక్కటి కూడా పూర్తి కాలేదు. అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులు, గుంతలతో రహదారులు దర్శనమిస్తున్నాయి. ఆ గుంతల్లో భారీగా వర్షపు నీరు చేరింది. వీటిలో పడి ఇప్పటికే అయిదుగురు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు.  

హెల్త్‌ సిటీ శంకుస్థాపన తంతు 

చంద్రబాబు హెల్త్‌ సిటీ అంటూ.. బీఆర్‌ షెట్టి మెడిసిటీకి 2017, ఆగస్టు 10న శంకుస్థాపన చేశారు. ఆ సంస్థకు 150 ఎకరాలు కేటాయించారు. ఇక ఇండో యూకే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెడిసిటీ(ఐయూఐహెచ్‌)కు సీఎం చంద్రబాబు  2017, ఆగస్ట్‌ 16న శంకుస్థాపన చేశారు. ఆ సంస్థకు కూడా 100 ఎకరాలు కేటాయించారు.  2019 చివరికి ఈ మెడీసిటీ నిర్మాణం పూర్తవుతుందని చంద్రబాబు చెప్పారు. 

  ప్రస్తుత పరిస్థితి.. 

చంద్రబాబు శంకుస్థాపన చేసిన ఆ శిలాఫలకం చుట్టూ పిచ్చి మొక్కలు, పొదలు మొలిచాయి. అక్కడ ఎలాంటి నిర్మాణ కార్యకలాపాలు చేపట్టనే లేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement