నాడు అన్నపూర్ణ రాష్ట్రం.. నేడు అప్పుల రాష్ట్రం ! | Is Chandrababu Naidu Pushing Andhra Pradesh Into a Debt Trap | Sakshi
Sakshi News home page

నాడు అన్నపూర్ణ రాష్ట్రం.. నేడు అప్పుల రాష్ట్రం !

Published Wed, Apr 3 2019 10:49 AM | Last Updated on Wed, Apr 3 2019 10:54 AM

Is Chandrababu Naidu Pushing Andhra Pradesh Into a Debt Trap - Sakshi

సాక్షి, అమరావతి : సహజంగా మనం అప్పు ఎందుకు చేస్తాం?... ఏదైనా ఆస్తి కొనుగోలుకు అవసరమైతే! సాధారణంగా ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుంటే ఏం చేస్తాం? ...దానిని పెట్టుబడిగా పెట్టి కొంత రాబడి పొందాలని చూస్తాం! మరి... చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తోందో తెలుసా? వేల కోట్ల రూపాయిలను ఎలా ఖర్చు పెడుతోందో తెలుసా? అసలిప్పటివరకు ఎంత అప్పు చేసిందో తెలుసా?ఐదేళ్లలో మొత్తం ఏమేరకు రుణం తీసుకుందో తెలుసా? తెలుసుకోండి మరి...

మాట్లాడితే తనది నలభై ఏళ్ల అనుభవమని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు... దాంతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించలేకపోయారు. పైగా అందినకాడికి అప్పులు చేసి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను రుణగ్రస్తురాలిగా మార్చారు. ఉమ్మడి రాష్ట్రంలోని 1995– 2004 మధ్య నాటి పాలనా కాలమైనా, విభజిత ఏపీలోని ప్రస్తుత పాలనా కాలమైనా చాటుతున్నది ఇదే.

ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదిలో 300 రోజులు చే బదుళ్లతోనే నడిపించి, ఓ దశలో జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బుల్లేనంతటి పరిస్థితి వచ్చిందంటేనే చంద్రబాబు పాలనా తీరు ఏ విధంగా ఉందో చెప్పొచ్చు. తర్వాతైనా ఆయన ధోరణి మారలేదనడానికి గణాంకాలు సహా ఎన్నో ఉదాహరణలున్నాయి. అంతేగాక బడ్జెట్‌ బయట, బడ్జెట్‌ లోపల ఎడాపెడా అప్పులతో భవిష్యత్తులో అప్పు పుట్టడం గగనం అన్నంతగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు.

దివాలా తీయించారు...
ఓటమి తప్పదని నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు ఎన్నికల ముందు కూడా ఎడాపెడా రుణాలు తీసుకొచ్చారు. ఓపక్క వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో పెట్టి రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఆర్థిక శాఖ వర్గాలు నెత్తీనోరు కొట్టుకుంటున్నాయి. ఆఖరికి చే బదుళ్లనూ సకాలంలో చెల్లించకుండా డిఫాల్టర్‌గా మారి... వాటి వడ్డీలు చెల్లించిన ఘనత చంద్రబాబు సర్కారుకు దక్కింది. 

‘తల’సరి రూ.83 వేలు
ఐదేళ్ల కాలంలో చంద్రబాబు బడ్జెట్‌ లోపల, బడ్జెట్‌ బయట చేసిన అప్పులు తడిసి మోపెడయ్యాయి. అక్షరాలా అవి రూ.4.15 లక్షల కోట్లకు చేరాయి. దీనిప్రకారం చూస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై రూ.83 వేల అప్పున్నట్లు లెక్క. బడ్జెట్‌ లోపల ఇప్పటికే నిబంధనలకు మించిన ప్రభుత్వం... ఇంకా అనుమతి లేకపోవడంతో బడ్జెట్‌ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో భారీగా అధిక వడ్డీలకు తెచ్చింది. 

అంతా నిరర్ధకమే!
తీసుకున్న రుణాలను రాష్ట్రానికి ఉపయోగపడే ఆస్తుల కల్పనకు కాకుండా నిరర్ధక ఖర్చులకు ఉపయోగించారు. కమీషన్లు వచ్చేలా కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు, శంకుస్థాపనల హడావుడి, ప్రత్యేక విమానాల్లో పర్యటనలు, ఈవెంట్లు, రాజకీయ ప్రయోజనం కలిగించే ప్రచార ఆర్భాటాలకు వ్యయం చేశారు. రూపాయి కూడా వెనక్కురాని ఇలాంటివాటితో డబ్బంతా కర్పూరంలా హరించుకుపోతోంది. ఆ భారం పరోక్షంగా రాష్ట్ర ప్రజలపైనే పడుతోంది.

58 నెలల్లో రూ.1,93,870 కోట్లు
విభజన నాటికి రాష్ట్ర రుణ భారం రూ.96 వేల కోట్లుండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి అవి ఏకంగా రూ.2,89,870.02 కోట్లకు చేరింది. అంటే... 58 నెలల పాలనలో ఏకంగా రూ.1,93,870 కోట్లు అప్పు చేశారని స్పష్టమవుతోంది. వీటితో ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనం గాని, ప్రాజెక్టు గాని పూర్తి చేయలేదు. మరోపక్క రాజధాని, సాగునీటి ప్రాజెక్టులు, పట్టణ పేదల ఇళ్ల నిర్మాణం, వివిధ కార్పొరేషన్ల పేరిట భారీగా రుణాలు తీసుకున్నారు.

దొడ్డిదారి ప్రయత్నాలతో
బడ్జెట్‌లో ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా అప్పు చేసేందుకు నిబంధనలు అనుమతించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిన వెళ్తోంది. గతంలో ఇచ్చిన గ్యారెంటీలను దాచేస్తూ, బడ్జెట్‌ బయట పరిమితికి మించి ఎడాపెడా 
అప్పులు చేస్తోంది. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు దొరికినచోటల్లా చేయి చాస్తోందని అధికార వర్గాలు వాపోతున్నాయి.

ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం తుంగలోకి

ప్రభుత్వం ద్రవ్య జవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టం నిబంధనలకు మించి బడ్జెట్‌ బయట అప్పులు తెస్తూ ఆర్‌బీఐ నిబంధనలనూ ఉల్లంఘిస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. బడ్జెట్‌ బయట ప్రభుత్వ సంస్థల ద్వారా రాష్ట్ర సొంత ఆదాయంలో 90 శాతం అప్పు చేసేలా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు వీలుంది. నిబంధనల మేరకు రూ.94,555.89 కోట్ల రుణాలకు పూచీగా ఉండాల్సి ఉండగా అదనంగా రూ.1,154.25 కోట్లు తెచ్చారు. మరోవైపు ఎన్నికల ముందు 2 నెలల్లోనే రూ.29,465 వేల కోట్ల రుణం కోసం  ప్రయత్నాలు చేశారు. అన్ని వాణిజ్య బ్యాంకులకు చెందిన పెద్దలతో స్వయంగా సీఎం కార్యాలయం చర్చలు జరిపింది. వీటినీ తీసుకుంటే నిబంధనలకు మించి బడ్జెట్‌ బయట రూ.30,619 కోట్లు అప్పు చేసినట్లవుతుందని, ఇలా చేయడం రాష్ట్ర ప్రజలను ఊబిలోకి నెట్టడమేనని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానిస్తున్నారు.

పరిమితి మించి
2018 మార్చి 31 నాటికి ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి బడ్జెట్‌ బయట చేసిన అప్పులు రూ.37,489.56 కోట్లు. డిసెంబర్‌ నాటికి అవి రూ.47,379.56 కోట్లకు పెరిగాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో నిబంధనల మేరకు రూ.47,176.33 కోట్లకు మాత్రమే బడ్జెట్‌ బయట అప్పులకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాల్సి ఉండగా దాన్ని మించి రూ.1154.25 కోట్లు అదనంగా రూ.48,330,58 కోట్లకు గ్యారంటీ ఇచ్చేసింది.

కమీషన్ల కోసం..
ఎన్నికలకు రెండు నెలల ముందు రూ.29,465 కోట్లకు గ్యారంటీ ఇచ్చేసి బడ్జెట్‌ బయట కార్పొరేషన్ల పేరుతో అప్పు చేసేందుకు సర్కారు చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫైళ్లు ఆర్థిక శాఖలో చకచకా కదిలాయి. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ మార్చి 29న సాగునీటి ప్రాజెక్టుల పేరుతో గ్రామీణ విద్యుద్ధీకరణ కార్పొరేషన్‌ ద్వారా రూ.5,545 కోట్లు అప్పు చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతించింది.

వాణిజ్య బ్యాంకులతో బేరసారాలు సాగించి ఎక్కువ వడ్డీకైనా సరే అప్పులు చేయాలని స్వయంగా సీఎం చంద్రబాబే అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో వారు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే, వీటిని ప్రాజెక్టులకు కాకుండా రాష్ట్ర ఖజానాకు బదలాయిస్తూ అస్మదీయ కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు, అనుత్పాదక రంగాలపై వెచ్చిస్తున్నారు.

వాస్తవంగా ఏ ఉద్దేశంలో డబ్బు తెస్తే అందుకే వెచ్చించాల్సి ఉంది. కానీ, ఖజానాకు మళ్లించి ఇష్టానుసారం పంచుతున్నారని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే బడ్జెట్‌ లోపల చేసిన అప్పులను నిరర్ధక అంశాలపై ఖర్చు చేయడంతో అప్పులు పెరిగి ఆస్తులు తగ్గిపోతున్నాయి.

‘ప్రభుత్వంలో ఏ రంగం, ఏ శాఖ చూసినా అప్పు అనే పదం తప్ప మరొకటి వినిపించడం లేదు. ఏ ప్రాజెక్టుకు అప్పు కావాలంటే ఆ ప్రాజెక్టు ఆస్తులను తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణం తెచ్చుకోమని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే సూచిస్తున్నారు. దీంతో రాష్ట్రంపై భారం పెరిగిపోతోంది’ అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. 

రాష్ట్రం విడిపోయే నాటికి 13 జిల్లాలకు చెందిన అప్పు రూ.96 వేల కోట్లుండగా ఇప్పుడది రూ.2.89 లక్షల కోట్లయింది. వివిధ కార్పొరేషన్ల పేరిట గ్యారంటీతో తెచ్చే అప్పులను కూడా ప్రభుత్వమే తీర్చాల్సి ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వం పరిమితి మించడంతో వచ్చే ప్రభుత్వానికి రుణం దక్కే వెసులుబాటు కూడా లేకుండా పోతోందని, రాష్ట్రాన్ని ఆర్థిక అత్యవసర పరిస్థితిలోకి నెట్టేస్తున్నారని  ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

ఇప్పటికే రూ.30 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, అన్నింటికి నిలిపేస్తూ ముఖ్యమంత్రి చెప్పినవాటికి మాత్రమే బిల్లు చెల్లిస్తున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చిన్న చిన్న సప్లయర్స్‌ బిల్లుల కోసం కాళ్లు అరిగేలా తిరుగుతుండగా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు పైరవీలు, కమీషన్లతో ప్రభుత్వ పెద్దలతో కలిసి బిల్లులు పొందుతున్నారు.


రాజధాని ప్రజలపైనా...
భవిష్యత్తులో రూ.37 వేల కోట్ల అప్పులు చేయాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. ఇందుకోసం రైతుల నుంచి తీసుకున్న భూముల్లో 8,217 ఎకరాల విక్రయం, తాకట్టు పెట్టేందుకు ఆ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ అప్పుపై వచ్చే 18 ఏళ్లలో కేవలం వడ్డీ భారమే రూ.36,500 కోట్లవుతుందని సీఆర్‌డీఏ పేర్కొంది. అసలుతో సమానంగా వడ్డీ భారమై ఏకంగా రూ.73 వేల కోట్ల భారం రాజధాని ప్రజలపై పడనుంది. చిత్రమేమంటే సాగునీటి ప్రాజెక్టులు, మున్సిపల్‌ ఆస్తులను కూడా తాకట్టు పెట్టేసి బడ్జెట్‌ బయట అప్పు చేస్తున్నారు.

బడ్జెట్‌ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో సర్కారు గ్యారెంటీతో చేసిన అప్పులు (కోట్లలో)

  • గతేడాది 31 మార్చి నాటికి వివిధ కార్పొరేషన్ల పేరిట సర్కారు గ్యారెంటీతో అప్పులు    37,489.56 
  • సీఆర్‌డీఏ, ఆర్టీసీ, ట్రాన్స్‌కో, అపిట్‌కో, గ్రామీణ మంచినీటి సంస్థల పేరుతో ...     9890.00
  • ఏపీ ట్రాన్స్‌కో    9166.36
  • మచిలీపట్నం పోర్టు    1385.00
  • గ్రామీణ మంచినీటి సరఫరా సంస్థ    4300.00
  • ఏపీ సీఆర్‌డీఏ గవర్నమెంట్‌ క్వార్టర్స్‌    3307.00
  • ఏపీఆర్‌డీఏ    5940.00
  • మున్సిపల్‌ కార్పొరేషన్లు    13,035.00 
  • అపిట్‌కో    1164.22
  • గృహ నిర్మాణ సంస్థ    3600.00
  • ఆప్కో    150.00
  • ఏపీఐఐసీ    2000.00
  • ఏపీ ఫైబర్‌నెట్‌    3283.00
  • హడ్కో    1000.00

 మొత్తం    95,709

రెండు నెలల్లో కొత్తగా అప్పులు తెచ్చేందుకు ఫైలు ప్రోసెస్‌లో ఉన్న వివరాలు (రూ.కోట్లలో)
గ్రామీణ మంచినీటి సరఫరా సంస్థ : 9,400
ట్రాన్స్‌కో : 9,300
రైతు సాధికార సమితి : 4,000
జలవనరుల అభివృద్ధి సంస్థ : 3,000
రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ : 3,000
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ : 500
కర్నూలు మున్సిపాలిటీ : 265
మొత్తం : 29,465 

- బడ్జెట్‌ లోపల రూ. 2,89,870.02 కోట్లు
- బడ్జెట్‌ బయట కార్పొరేషన్ల పేరుతో...రూ.1,25,174 కోట్లు
- ఇప్పటికే పరిమితికి మించి బడ్జెట్‌ బయట రూ.1154.25 కోట్ల అప్పు
- సర్కారు గ్యారెంటీతో రూ.95,709 కోట్లు పొందిన వైనం
- దొంగ లెక్కలతో మళ్లీ భారీగా అప్పులు చేస్తున్న ప్రభుత్వం
- నిబంధనలకు మించి మరో రూ, 29,465 కోట్లు అప్పు చేస్తున్న సర్కారు
- ఇవన్నీ ఎన్నికల ముందు పంపకాలు, కమీషన్లు కోసమే!
- డబ్బంతా ఆర్భాటాలు, దుబారాలు, ఈవెంట్లకు వ్యయం
- ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా పయనం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement