సాక్షి, అమరావతి : ‘తిరుమల తిరుపతి దేవస్థానానికి, రిజర్వు బ్యాంకుకు ఎకరా రూ.4కోట్లకు భూమిని ఇచ్చిన ప్రభుత్వం.. ప్రైవేట్ సంస్థలకు మాత్రం ఎకరా రూ.25–50లక్షలకు ఇచ్చింది. ప్రైవేటు వారికి ఇంత తక్కువ రేటుకు భూములు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి వందల కోట్ల నష్టం’’
నాడు మద్యపాన నిషేధం కోసం అలా చేయాలి.. ఇలా చేయాలి.. అని చెప్పారు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక ఓ వైపు బెల్టుషాపుల ఎత్తివేత ఫైల్‌పై సంతకం పెడుతూనే.. మరోవైపు బెల్టుషాపుల ఏర్పాటును ప్రోత్సహించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది.
రాజధాని పేరిట బినామీలకు భూపందేరం
రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు చేపట్టిన నిర్మాణాలు తాత్కాలికం. కాని ఆయన పాలనలో అవినీతి మాత్రం శాశ్వతంగా మిగిలిపోతుంది. రాజధాని నిర్మాణ ప్రాంతం గురించి తన బినామీలకు ముందుగానే లీకులు ఇచ్చి.. వారితో రైతుల నుంచి తక్కువ ధరకే భూములు కొనుగోలు చేయించారు. తనవాళ్ల భూములకు విలువలు రావాలని ప్రైవేట్ కంపెనీలకు తక్కువ ధరలకు ప్రభుత్వ భూములు కట్టబెట్టి అవినీతికి పాల్పడుతున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు.. బతుకుతెరువు కోల్పోయి మరింత పేదరికంలోకి కూరుకుపోయారు.
ఇదే పరిస్థితి నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాబు హయాంలో హైటెక్ సిటీ నిర్మాణంలో కూడా చోటు చేసుకుంది. అమరావతి నిర్మాణం పేరిట సీఎం ఆలోచనలవెనుక దాగి ఉన్న కోణం.. ఆయన బినామీలను అభివృద్ధి చేయడమే. క్యాబినెట్ సమావేశం ఎప్పుడు ఏర్పాటుచేసినా.. భూపందేరమే. తిరుమల తిరుపతి దేవస్థానానికి, రిజర్వు బ్యాంకుకు ఎకరా రూ.4కోట్లకు ఇచ్చిన ప్రభుత్వం.. ప్రైవేట్ సంస్థలకు మాత్రం ఎకరా రూ.25–50 లక్షలకే కట్టబెట్టింది. ప్రైవేటు సంస్థలకు ఇంత తక్కువ రేటుకు భూములు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి వందల కోట్ల నష్టం.
ఉద్యోగాల భర్తీ గాలికొదిలేశారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించే ఒక్క పెద్ద పరిశ్రమైనా ఏర్పాటైన దాఖలాలు లేవు. రాజధాని నిర్మాణం పేరుతో ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి లేకుండా చేసి.. రోడ్డున పడేశారు. రాజధానిలో చంద్రబాబు చేపట్టిన నిర్మాణాలు తాత్కాలికమే అయినా.. అవినీతి మాత్రం శాశ్వతంగా మిగిలిపోతుంది. సాగునీటి ప్రాజెక్టుల అంచనాలు పెంచి.. కమీషన్లు దండుకున్నారు. బెల్టుషాప్‌లు తొలగిస్తామని హామీ ఇచ్చి.. మరోవైపు బెల్టుషాప్‌లను ప్రోత్సహించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఏపీని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు అంటున్నారు.. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణ్ రెడ్డి. ఐదేళ్ల చంద్రబాబు పాలనపై లక్ష్మణ్‌రెడ్డి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..
దుబారాలో బాబు సర్కారు టాప్
ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రం అధ్వాన్నంగా మారింది. సీఎం హోదాలో తప్పులను సరిచేయాల్సింది పోయి.. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పు మీద తప్పు చేస్తూ వచ్చారు. దేశంలో కెల్లా మన రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అత్యధికంగా దుబారా చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు సందర్శన పేరుతో రూ.400కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. రాజధాని, పోలవరం, ఇతర ప్రాజెక్టులకు వివిధ శంకుస్థాపనల పేరిట వందల కోట్లు ప్రజాధనాన్ని దుబారా చేస్తూ.. చంద్రబాబు పెద్ద ఈవెంట్ మేనేజర్‌గా మారారు.
ఉద్యోగాల్లేవు... ఉపాధి లేదు
2014లో రెండు లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు 10వేలకు మించి ఖాళీలు భర్తీలు చేయలేదు. నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి.. నాలుగున్నరేళ్ల పాటు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికల ముందు వెయ్యి రూపాయలు ఇస్తున్నామంటూ హడావుడి చేస్తున్నారు. గత ఐదేళ్ల కాలంలో పట్టుమని పది మందికి ఉపాధి కల్పించే పెద్ద పరిశ్రమ ఒక్కటి కూడా రాలేదు. ఒక్క కంపెనీ రాకపోయినప్పటికీ.. పరిశ్రమల కోసమంటూ పెద్దఎత్తున సదస్సులు నిర్వహించి.. ప్రచారానికి మాత్రం భారీగా ప్రజాధనం ఖర్చుపెట్టారు.
వాటాలేసుకొని నిధులు బొక్కేశారు
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎక్కువమందికి ఉపాధి కల్పించాలంటే.. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి. సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావాలి. కానీ గత ఐదేళ్ల పాలనలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టు ఒక్కటి కూడా పూర్తి కాలేదు. 2018నాటికి పోలవరం పూర్తి చేస్తామని మంత్రి దేవినేని ఉమ సవాలు చేశారు. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితి కొనసాగితే 2025 నాటికి కూడా నీళ్లివ్వడం కష్టం. కాపర్ డ్యామ్‌ను నిర్మించి.. దాన్ని ప్రాజెక్టుగా భ్రమింపచేశారు. గ్రావిటీతో నీళ్లు పంపి ప్రాజెక్టును కట్టేశామని చెబుతున్నారు. పోలవరంతోసహా ఇతర ప్రాజెక్టుల అంచనాలు రెండు, మూడు రెట్లు పెంచి.. ఆరు శాతం సీఎం, నాలుగు శాతం మంత్రులు, నాలుగు శాతం అధికారులు, పది శాతం సబ్ కాంట్రాక్టర్లు, పదిశాతం కాంట్రాక్టర్లు వాటాల రూపంలో నిధులు బొక్కేశారు.
బెల్టుషాపుల ఘనత బాబుదే
2014 ఎన్నికలకు ముందు హైదరాబాద్ రవీంద్ర భారతిలో మద్యపాన నిషేధంపై సదస్సు నిర్వహించాం. ఆ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. నాడు మద్యపాన నిషేధం కోసం అలా చేయాలి.. ఇలా చేయాలి.. అని చాలా చెప్పారు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక ఓవైపు బెల్టు షాపుల ఎత్తివేత ఫైల్‌పై సంతకం పెడుతూనే.. మరోవైపు బెల్టుషాపుల ఏర్పాటును ప్రోత్సహించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. బెల్టు షాపులు తొలగిస్తానని ప్రజలకు వాగ్దానం చేసి.. ఇంకోవైపు మద్యం అమ్మకాలు పెంచాలని ఎక్సైజ్ శాఖను సీఎం ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తాగునీరు లభించని గ్రామాలున్నాయేమోకానీ.. మద్యం లభించని గ్రామం లేదు.
పచ్చనోటు కోసం ఓటేస్తారని..
ధర్మపోరాట దీక్షలు, నవనిర్మాణ దీక్షలు, ఇతర ప్రచారాలకు వందలకోట్లు తగలేశారు. కానీ ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెచ్చే మద్యం దుష్ఫలితాలపై ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేదు. సీఎం, మంత్రుల స్థాయిలో.. ఏ ఒక్కరూ మద్యం దుష్ఫలితాల గురించి ప్రజలకు చెప్పిన పాపాన పోలేదు. ప్రజలు మద్యానికి బానిసలై నిరుపేదలుగా మారితేనే.. తామిచ్చే పచ్చ నోటు కోసం ఓటేస్తారని పాలకుల భావన. అందుకోసమే చంద్రబాబు ప్రభుత్వం బెల్టుషాప్‌లను విపరీతంగా ప్రోత్సహించి.. ప్రజలకు మద్యాన్ని మరింత దగ్గర చేసి మత్తులో ముంచింది.
అవినీతి పాలనకు చరమగీతం
గత ఐదేళ్ల అవినీతి, అసమర్ధ, అరాచక, అప్రజాస్వామిక పాలనను తరిమికొట్టాలని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు!!
దోచుకో.. దాచుకో
గత ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలన ‘దొరికిన కాడికి దోచుకో.. దాచుకో’ అన్న చందంగా ఉంది. ఉచిత ఇసుక విధానంతో టీడీపీ నేతలు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఉచిత ఇసుక ఎవరికి ఇస్తున్నారు? ర్యాంప్‌లోకి రైతు వెళితే ఇసుక ఉచితంగా లభించదు. టీడీపీ నాయకులు, జన్మభూమి కమిటీల వారికి ఇసుక ర్యాంప్‌లు ఫ్రీగా ఇస్తున్నారు. టీడీపీ నాయకులకు కప్పం కడితేనే నేడు ఇసుక లభించే పరిస్థితి నెలకొంది. సీఎం నివాసానికి కూతవేటు దూరంలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నా.. ఆయన పట్టించుకోని పరిస్థితి. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు హక్కులు లేకుండా చేశారు. ఎమ్మెల్యే నిధులు ఎమ్మెల్యేలకే ఇవ్వాలి. కానీ రాష్ట్రంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. జన్మభూమి కమిటీ సభ్యులకు ఉన్న విలువ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఇవ్వలేదు. జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా మారాయి. ప్రజలను అడ్డగోలుగా దోచుకున్నాయి. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా.. నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌లకు నిధులు కట్టబెట్టి.. ప్రతిపక్ష ఎమ్మెల్యేల హక్కులను కాలరాశారు.
వి. బాలశేఖర్, సాక్షి , గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment