ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులకు ఇబ్బందులు లేకుండా సర్కారే నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ప్రతిపక్ష పార్టీలు పని గట్టుకుని అసత్య ప్రచారాలు చేసినా లక్షల టన్నుల ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలుస్తోంది. కొనుగోలు చేయడమే కాకుండా రైతులకు రావాల్సిన నగదును వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ధాన్యం కొనుగోలులోను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లాలోని ఉన్నతాధికారులు కూడా ఎక్కడా చిన్న పొరపాటు కూడా లేకుండా ధాన్యం సేకరణ నిర్వహిస్తున్నారు.
నెల్లూరు (సెంట్రల్): జిల్లాలో రబీ సీజన్‌లో దాదాపుగా 5.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. తద్వారా 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. పౌరసరఫరాల శాఖ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 4.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది.
రూ.600 కోట్ల వరకు చెల్లింపులు
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 246 ఆర్బీకేల ద్వారా ఇప్పటి వరకు 22,202 మంది రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించి మొత్తం 948.87 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే రూ.648 కోట్లను ఆయా రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇంకా ఆర్బీకేల ద్వారా ఇంకా భారీ మొత్తంలో మిల్లులకు ధాన్యం సరఫరా చేశారు. అయితే వీటికి సంబంధించి బ్యాంక్ గ్యారెంటీలు రాకపోవడంతో ట్రక్ షీట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే ఇంకా ఎక్కువ మొత్తంలో ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారిక ధ్రువీకరణ లభిస్తుంది. ఇటీవల కొనుగోలు చేసి వాటికి మాత్రమే మిగిలిన నగదు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. త్వరలో రైతుల ఖాతాల్లో పడే విధంగా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ప్రతి ఏటా పెరుగుదల
రాష్ట్ర సర్కారు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసే ధాన్యం పరిశీలిస్తే ప్రతి ఏటా అధికంగానే కొనుగోలు చేస్తోంది. 2020లో దాదాపు 3.90 లక్షల మెట్రిక్ టన్నులు, 2021లో 4.40 లక్షల మెట్రిక్ టన్నులు, 2022లో ఇప్పటి వరకు 4.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లకు ఏ రైతులు విక్రయం చేయడానికి వచ్చినా కచ్చితంగా కొనుగోలు చేసే విధంగా అధికారులు గట్టి చర్యలు తీసుకోవడంతో ఎక్కడా ఇబ్బందులు లేకుండా నిర్వహించారు.
త్వరలోనే ఇస్తాం
జిల్లాలోని ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రావాల్సిన నగదును త్వరితగతిన ఇచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతోంది. చాలా మంది రైతుల ఖాతాల్లో నగదు చేయడం జరిగింది. ఇటీవల కొనుగోలు చేసిన రైతులకు మాత్రమే నగదు ఇవ్వాల్సి ఉంది. త్వరలోనే ఇస్తాం.
– పద్మ, పౌరసరఫరా శాఖ సంస్థ జిల్లా మేనేజర్
చదవండి: స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రప్రథమం... భూవివాదాలకు చెక్..!
Comments
Please login to add a commentAdd a comment