Town planing department
-
TSPSC: పేపర్ లీక్‌లో కొత్త కోణం.. ఆమె కోసమే ఇదంతా..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారింది. అయితే, పేపర్ లీక్ ఎపిసోడ్లో మరో కొత్త కోణం బయటకు వచ్చింది. ఈ క్రమంలో హ్యాకింగ్ జరగలేదని నిర్ధారణ అయ్యింది. అయితే, కమిషన్‌కు చెందిన ఓ ఉద్యోగి.. ఓ యువతి కోసం పేపర్ లీక్ చేసినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. పేపర్ లీకేజీ ఘటన కేసు దర్యాప్తులో హానీట్రాప్ జరిగినట్టు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ ఆఫీసుకు ఇటీవల తరచుగా ఓ యువతి రావడాన్ని గమనించారు. ప్రవీణ్ కోసం సదరు యువతి తరచూ వస్తూ ఆఫీసులో కలుస్తోంది. సదరు యువతి.. టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కుమార్‌కు గాలం వేస్తూ సన్నిహితంగా ఉంది. ఈ క్రమంలో తనకు పేపర్ ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో ఆమె కోసం పేపర్ లీక్ చేసినట్టు గుర్తించారు. యువతి కోసం టౌన్ ప్లానింగ్ పేపర్ లీకేజీ జరిగిందని అధికారులు నిర్ధారించారు. దీంతో, నిందితుడు ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరీక్షలు వాయిదా.. టౌన్‌ప్లానింగ్, పశు సంవర్థక శాఖ పరిధిలోని వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్షలను టీఎస్పీఎస్సీ పరీక్షను వాయిదా వేసింది. పరీక్షల నిర్వహణకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కిందనే అనుమానంతో కమిషన్ ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12న రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. పరీక్ష నిర్వహణకు ముందే దానికి సంబంధించిన సమాచారాన్ని, పరీక్ష తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ మేరకు అభ్యర్థులకు సంక్షిప్త సమాచార రూపంలో రిజిస్టర్డ్ ఫోన్ నంబర్లకు ఆదివారంనాటి పరీక్ష రద్దు సమాచారాన్ని అందించినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. దీంతోపాటు ఈ నెల 15, 16వ తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు శనివారం రాత్రి కమిషన్ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. -
అనుమతుల ఆలస్యంతోనే ప్రీలాంచ్ విక్రయాలు!
నెల తర్వాత చేసే ప్రయాణం కోసం ముందుగానే విమాన టికెట్లు బుకింగ్ చేసుకుంటాం. అభిమాన హీరో సినిమా వస్తుందంటే వారం ముందే ఆన్లైన్లో టికెట్లు కొనేస్తాం. ఎందుకు? తీరా టైంకి టికెట్లు దొరకవనో లేక దొరికినా ఎక్కువ రేట్లు ఉంటాయనో కదా. పైగా ముందుగా టికెట్లు బుకింగ్ చేసుకుంటే ధర కూడా కలిసొస్తుంది. మరి, ముందస్తు బుకింగ్స్ రియల్ ఎస్టేట్‌లో చేస్తే తప్పేంటి? సాక్షి, హైదరాబాద్: ప్రీలాంచ్, సాఫ్ట్‌లాంచ్.. పేర్లు ఏవైనా వాటి అర్థం మాత్రం ఒక్కటే. ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే విక్రయాలను మొదలుపెట్టడం అని! ఈ తరహా విక్రయాలు కొత్తవేం కాదు. ఎప్పటినుంచో ఉన్నవే. ప్రీలాంచ్తో కొనుగోలుదారులకు, డెవలపర్లకు ఇద్దరికీ లాభమే. కస్టమర్లకేమో ఫ్లాట్ తక్కువ ధరకు దొరికితే.. బిల్డర్లకేమో ముందుగానే కొంత సొమ్ము చేతికి అందుతుంది. ఈ సొమ్ము తక్షణమే నిర్మాణాన్ని మొదలుపెట్టడానికో లేక అనుమతుల ఫీజుల కోసమో ఉపయోగపడుతుంది. ప్రీలాంచ్లో డెవలపర్లు 10–15 శాతం వరకు ఫ్లాట్లను విక్రయిస్తుంటారు. కొందరు బిల్డర్లు తెలివిగా ఏం చేస్తారంటే.. మార్కెట్లో తమ కొత్త ప్రాజెక్ట్ తుది ధరను నిర్ణయించడం కోసమే ముందస్తు అమ్మకాలను ప్రకటిస్తుంటారు. ప్రీలాంచ్లో విక్రయాలు ఎందుకంటే.. ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు ల్యాండ్ ఓనర్‌తో అగ్రిమెంట్ చేసుకున్న రోజు నుంచి అనుమతులు వచ్చే వరకు ఏడాదిన్నర కాలం పాటు డెవలపర్ వేచి చూడాలి. ఈలోపు ప్రాజెక్ట్ రుణానికి బ్యాంక్ వడ్డీ డెవలపర్ భరించాల్సిందే. కాంట్రాక్టర్లు, ఉద్యోగుల జీతభత్యాలు, ఆఫీసు నిర్వహణ ఖర్చులు ఇవన్నీ డెవలపర్లకు భారమే. పోనీ, అనుమతుల వరకూ వేచి ఉంటే మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు. ఈలోపు డిమాండ్ అవకాశాలు కోల్పోతామనే పోటీతో డెవలపర్లు ప్రీలాంచ్ విక్రయాలను చేస్తున్నారని ఓ డెవలపర్ తెలిపారు. స్థలానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను నిర్ధారించుకున్నాకే కొనుగోలుదారులు ప్రీలాంచ్లో కొనుగోలుకు సిద్ధం కావాలి. నచ్చిన ప్రాంతం, తక్కువ ధర, పేరున్న బిల్డర్ అయితే కొనుగోలులో సందేహించాల్సిన అవసరం లేదు. సాధారణంగా నిర్మాణం పూర్తి కావడానికి 3–5 ఏళ్ల సమయం పడుతుంది. అందుకే ముందస్తుగానే కొనుగోలు చేస్తే చక్కటి లాభాల్ని అందుకోవచ్చు. అనుమతుల్లో జాప్యం ఎందుకంటే? టీఎస్–బీపాస్‌లో నిర్మాణ అనుమతులు వారం లోపే వస్తున్నాయనేది అధికారులు, లీడర్ల మాట. కానీ, వాస్తవ పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మున్సిపల్ అనుమతుల నుంచి మొదలుపెడితే రెవెన్యూ, ఇరిగేషన్, ఎన్విరాన్మెంటల్, ఫైర్, పోలీస్, ఎయిర్పోర్ట్ అథారిటీ.. ఇలా సుమారు 15 ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు తీసుకోవాలి. ఆ తర్వాత రెరా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీటి కోసం ఏడాదిన్నర పైనే సమయం పడుతుందని ఓ డెవలపర్ తెలిపారు. హెచ్ఎండీఏకు శాశ్వత కమిషనర్ లేకపోవటం, ఉన్న అధికారులు ఆఫీసులలో అందుబాటులో ఉండకపోవటం అనుమతుల ఆలస్యానికి ప్రధాన కారణాలని చెప్పారు. ఏం చేయాలంటే? హైదరాబాద్‌లో ప్రీలాంచ్లో కొనుగోలు చేసి మోసపోయామనే కస్టమర్లు చాలా తక్కువ. ఏ డెవలపర్ ప్రీలాంచ్లో విక్రయిం చేసి చేతులుదులుపుకోడు. చాలా వరకు డెవలపర్ల మీద కొనుగోలుదారులు చేసే ప్రధానమైన ఫిర్యాదులు.. గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయడం లేదనే. జీహెచ్ఎంసీతో పోల్చితే హెచ్ఎండీఏ పరిధిలో ప్రీలాంచ్ విక్రయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే జీహెచ్ఎంసీలో అధికారుల కొరత లేదు. దీంతో ఫీజు కట్టాక నెలన్నర లోపే ప్లానింగ్ అనుమతులు వస్తున్నాయి. అదే హెచ్ఎండీఏ పరిధిలో అయితే ఏడాదిన్నర అయినా గ్యారంటీ లేదు. ► హెచ్ఎండీఏకు శాశ్వత కమిషనర్‌ను, రెరాకు శాశ్వత చైర్మన్‌ను నియమించాలి. మున్సిపల్ శాఖ టౌన్‌ప్లానింగ్ విభాగంలో అధికారుల కొరతను తీర్చాలి. ► పక్క రాష్ట్రంలో లోకల్ బాడీ ఫీజులు కూడా ప్రధాన విభాగమే కలెక్ట్ చేస్తుంది. డెవలపర్లు ప్లానింగ్ అనుమతుల కోసం లోకల్ బాడీకి వెళ్లాల్సిన అవసరం లేదు. దీంతో సమయం, అధికారుల చేతివాటం రెండూ తగ్గుతాయి. -
నగరపాలక సంస్థలో బయటపడ్డ అవినీతి
సాక్షి, అనంతపురం: జిల్లాలోని నగరపాలక సంస్థలో అవినీతి బయటపడింది. బిల్డింగ్ క్రమబద్ధీకరించేందుకు టౌన్ ప్లానింగ్ అధికారులు లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. వివరాలు.. టౌన్ ప్లానింగ్ అధికారులు వినయ్, అలివేలమ్మ తన బిల్డింగ్ క్రమబద్ధీకరణకు రూ.4 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు సత్యనారాయణ ఆరోపణలు చేశాడు. అంతే కాకుండా లంచం డబ్బ కోసం ఆ అధికారులు తనని వేధిస్తున్నారని తెలిపాడు. తాజాగా టౌన్ ప్లానింగ్ అధికారులు లంచం అడిగిన ఓ వీడియోను బాధితుడు బయటపెట్టాడు. రూ.లక్ష లంచం తీసుకుంటూ మున్సిపల్ ఉద్యోగి ఆయూబ్ కెమెరాకు చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియోను నెల రోజుల కిందట బాధితుడు తన సెల్ఫోన్లో రికార్డు చేశాడు. ఇటీవల మున్సిపల్ ఉద్యోగి ఆయూబ్ అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. టైన్ ప్లానింగ్ అధికారులు వినయ్, అలివేలమ్మ తరఫున ఆయూబ్ లంచం తీసుకున్నట్లు బాధితుడు ఆరోపించాడు. దీంతో పాటు అనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది అవినీతిపై బాధితుడు సత్యనారాయణ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. -
అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేతలే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : త్వరలోనే భవన నిర్మాణ అనుమతుల కోసం అత్యంత పారదర్శకమైన, వేగవంతమైన విధానాన్ని చేపడుతున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పౌరుల సౌకర్యం, సంతోషమే లక్ష్యంగా నూతన పురపాలక చట్టం అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర స్థాయి టౌన్ ప్లానింగ్ సిబ్బందితో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా టౌన్ ప్లానింగ్ సిబ్బంది పనితీరుపై ఉన్న అనుమానాలు తొలగించేలా నూతన భవన నిర్మాణ అనుమతుల విధానం చేపడుతున్నామన్నారు. టీఎస్ ఐపాస్ మాదిరిగా నూతన భవన నిర్మాణ అనుమతులు విధాన రూపకల్పన జరుగుతోందన్నారు. సెల్ఫ్ డిక్లరేషన్, సింగిల్ విండో పద్ధతుల్లో భవన నిర్మాణ అనుమతులు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. నూతన విధానాన్ని ఆసరాగా చేసుకుని తప్పుడు అనుమతులు తీసుకున్నా.. అక్రమ నిర్మాణాలు చేపట్టినా కూల్చివేతలు తప్పవని హెచ్చరించారు. నూతన విధానాన్ని అమలు చేసే బాధ్యత టౌన్ ప్లానింగ్ సిబ్బందిదేనని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై నూతన చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలోని ఖాళీల భర్తీ, ఇతర మౌలిక వసతుల కల్పనకు పురపాలక శాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. -
ఉల్లంఘనలు..
టీడీపీ ప్రభుత్వ హయాంలో అక్రమార్కులు చెలరేగిపోయారు. అధికారం అండతో టౌన్‌ప్లానింగ్ అధికారులను డమ్మీలను చేసి, అనుమతులు లేకుండా భారీ వ్యాపార సముదాయాలు నిర్మించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాల కారణంగా నగరంలో ట్రాఫిక్ సమస్యకు కారణమవుతోంది. కమర్షియల్ భవనాల్లో పార్కింగ్ వసతి కోసం సెల్లార్లు నిర్మించాల్సి ఉంది. చాలా మంది భవన యజమానులు సెల్లారు లేకుండానే భవనాలు నిర్మించారు. నిర్మించిన సెల్లార్లను దుకాణాలు, గోడౌన్లుగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఉల్లంఘనులపై కార్పొరేషన్ అధికారులు కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. సాక్షి, నెల్లూరు సిటీ : నెల్లూరు నగరంలో పాఠశాలలు, కళాశాలలు, వస్త్ర దుకాణాలు, బంగారు దుకాణాలు, ఇతర కమర్షియల్ భవనాల్లో సెల్లార్లు లేకుండానే యజమానులు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టారు. గత ప్రభుత్వం హయాంలో కొందరు భవన యజమానులు అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఆయా కమర్షియల్ భవనాల్లో సెల్లార్లు లేకపోవడంతో రోడ్లు పైనే పార్కింగ్ చేస్తున్నారు. ఫలితంగా నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. టౌన్‌ప్లానింగ్ అధికారుల అవినీతి, గత ప్రభుత్వ పాలకుల ఒత్తిడితో అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించకపోవడంతో ఇష్టానుసారంగా షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించారు. నిబంధలన ప్రకారం షాపింగ్ కాంప్లెక్స్‌లకు తప్పనిసరిగా పార్కింగ్ స్థలాన్ని కేటాయించాల్సి ఉంది. అయితే ఏ షాపింగ్ కాంప్లెక్స్ యజమాని తగినంత పార్కింగ్ స్థలాన్ని కేటాయించలేదు. దీంతో నగరంలో వాహనాలు రోడ్లు పైనే పార్కింగ్ చేస్తున్నారు. అసలే రోడ్లు 30 నుంచి 35 అడుగులు మాత్రమే ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నగర పాలక సంస్థ పరిధిలో దాదాపు 40 నుంచి 50 షాపింగ్ కాంప్లెక్స్‌లు, వందకు పైగా భారీ వ్యాపార దుకాణాల సముదాయాలు ఉన్నాయి. దాదాపు అన్ని షాపింగ్ కాంప్లెక్స్‌లు పార్కింగ్‌కు తగిన స్థలాన్ని ఏర్పాటు చేయలేదు. ముఖ్యంగా ట్రంకురోడ్డు, నర్తకీ సెంటర్, గాంధీబొమ్మ, వీఆర్సీ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, మినీబైపాస్‌రోడ్డు, కేవీఆర్ పెట్రోల్ బంక్, వేదాయపాళెం తదితర ప్రాంతాల్లో భారీ షాపింగ్ మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, దుకాణాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇదే సమస్య తలెత్తుతుంది. వీటి పరిస్థితిపై నగర పాలక సంస్థ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి దృష్టి సారించారు. సెల్లార్లు లేకుండా చేపట్టిన నిర్మాణాలు, సెల్లార్లు ఉండి దుకాణాలు, గోడౌన్లు వినియోగిస్తున్న భవనాలను గుర్తించాలని టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జరీ చేశారు. దీంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇప్పటి వరకు దాదాపు 35 భవనాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు భవన యజమానులకు నోటీసులు జారీ చేసి వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కళాశాలల భవనాల పరిస్థితి అంతే! నగరంలోని ప్రధాన కూడళ్లలో కళాశాలల భవనాల్లో దాదాపు 50 శాతం భవనాలకు పార్కింగ్ స్థలం లేదు. రోడ్డు మీదే వాహనాలు పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్యతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు సెల్లార్లు లేకుండా రెసిడెన్షియల్ భవనాలుగా నిర్మించి కళాశాలలకు భవనాలను బాడుగులకు ఇస్తున్నారు. దీంతో కళాశాలకు వచ్చే ఉపాధ్యాయులు, విద్యార్థుల వాహనాలను రోడ్లు పైనే పార్కింగ్ చేయాల్సి వస్తుంది. వారం రోజుల్లో నోటీసులు జారీ చేస్తాం గతంలో ఇష్టారాజ్యంగా సెల్లార్లు లేకండా భవనాలు నిర్మించారు. దీంతో షాపింగ్ మాల్స్‌కు వచ్చేవా రు రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. భవన యజమానులకు వారం రోజుల్లో నోటీసులు జారీ చేస్తాం. పోలీస్ శాఖ సహకారంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – పీవీవీఎస్ మూర్తి, కార్పొరేషన్ కమిషనర్ -
అడిగింది ఇవ్వకుంటే కూల్చేస్తాం !
విజయవాడలో జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించి వెరిఫికేషన్‌కు వెళ్లే అధికారులు అనుమతుల పేరుతో అడ్డగోలు దోపిడీ చేస్తున్నారు. వీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంలో అంతులేని అవినీతి చోటుచేసుకుంటుందని ఫిర్యాదులు వస్తున్నా.. సాక్షాత్తు వీఎంసీ ఇతర విభాగాల సిబ్బంది చెబుతున్నా, అధికారులలో ఎలాంటి మార్పురాకపోగా మరింతగా విజృంభిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పటమట: ఆ విభాగంలో అంతా పకడ్బందీగా జరుగుతుంది. ఇల్లుకట్టాలనుకున్న సామాన్యుల కలను అధికారులు వెరిఫికేషన్ పేరుతో కల్లగా మారుస్తున్నారని, భవన నిర్మాణానికి అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు పొందినప్పటికీ కొంతమంది టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు ఓఉన్నతాధికారి సహకారంతో అందినకాడికి దండుకుంటూ వెరిఫికేషన్‌లో అనుకూల/ప్రతికూల రిపోర్టులు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తమను సంతృప్తి పరచకపోతే అన్ని రకాల అనుమతులు ఉన్నా అప్పోసొప్పో చేసి కట్టుకుంటున్న నిర్మాణాలను కూల్చివేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అనుమతులకు విరుద్దంగా ఎలాంటి నిర్మాణాలు జరిగినా అధికారులకు లంచాలు ముట్టచెబితే చూసీచూడనట్లు వ్యవహరిస్తారని ఆరోపణలు. అడ్డగోలు దోపిడీ.. చుట్టుగుంట వద్ద ఏలూరు రోడ్డు వెంబడి జరుగుతున్న ఓ ఇంటి నిర్మాణ అనుమతులకు సంబంధించి పోస్ట్ వేరిఫికేషన్‌కు వెళ్లిన బిల్డింగ్ ఇన్స్పెక్టర్ తాను రిపోర్టు చేస్తేనే అనుమతి వస్తుందని, అనుకూలంగా రిపోర్టు ఇవ్వాలంటే రూ. 3 లక్షలు ఇచ్చుకోవాల్సిందేనని పట్టుపట్టడంతో వెలగపూడిలోని సెక్రటేరియట్‌లోని ఓ సీనియర్ ఉద్యోగి రాయభారంతో రూ.1.25 లక్షలకు బేరం కుదిరింది. సకాలంలో భవన యజమాని సొమ్ములు చెల్లించకపోవటంతో గత వారం డీవియేషన్స్ జరుగుతున్న ప్రాంతాన్ని కూల్చేయటానికి వెళ్లగా అప్పటికప్పుడు రూ. 75వేలు చెల్లిస్తేగానీ కూల్చకుండా వదిలేశారని సమాచారం. రామలింగేశ్వరనగర్‌లోని ఎస్టీపీ ప్లాంట్‌కు సమీపంలో ఓ భవన నిర్మాణానికి సంబంధించి పోస్ట్ వెరిఫికేషన్‌కు వెళ్లిన అధికారులను మెప్పించకపోవటంతో నిర్మాణ అనుమతికి సంబందించి కొర్రిపెట్టి ఇంటి నిర్మాణాన్ని నిలుపుదల చేశారు. వెరిఫికేషన్‌కు వెళ్లిన అధికారుల బృందం రూ. 2 లక్షలు డిమాండ్ చేయగా తానెందుకు చెల్లించాలని భవన యజమాని ప్రశ్నించటంతో అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతుందని, ఇలా నిర్మా ణం చేపడితే కూల్చేస్తామని, తమకు ‘సహకరిం చకపోతే’ కూల్చేస్తామని అధికారులే బెది రింపులకు దిగుతున్నారని బా«ధితుడు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నగరంలోని అన్ని ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్నా వీఎంసీ ఉన్నతాధికారి దృష్టిసారింకచకపోవటంపై పలు అనుమానాలకు తావిస్తోంది. వీఎంసీ ఆదాయానికి గండి.. నగర పాలక సంస్థ పరిధిలో భవనాలకు ఇంటి పన్న వేసే సమయంలో ప్లింత్ ఏరియా, నిర్మాణం స్వభావం, ఉపయోగవిధానం(రెసిడెన్షియల్/కమర్షియల్/ఇతర), పరిశీలించి అధికారులు పన్ను లు విధించాల్సి ఉండగా ఆయా నిర్మాణాల వద్దకు పోస్ట్ వెరిఫికేషన్ సర్వేకు వెళ్తున్న అధికారులు కొలతల్లో, కేటగిరీల్లో మాయాజాలం చేస్తున్నారు. కొంతమంది వాణిజ్యప్రాంతాల్లో భవనాలు నిర్మిం చి కేవలం నివాస ప్రాంతాలుగానే పన్ను చెల్లింపులు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. భవన నిర్మాణ యజమానుల నుంచి అధికారులు ప్రత్యేకంగా పన్నులు తగ్గించేలా ‘రహస్య’ ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీనివల్ల నగర పాలక సంస్థకు రావాల్సిన ఆదాయానికి గండి పడుతుంది. వన్‌టౌన్‌లోని అత్యంత రద్దీగా ఉండే ప్రదేశంలో జరుగుతున్న ఓ భవన నిర్మాణం పోస్ట్ వెరిఫికేషన్‌కు వెళ్లిన పట్టణ ప్రణాళిక అధికారులు చెప్పిన విషయాలు విన్న ఆ భవన నిర్మాణ యజమానికి అధికారుల డిమాండ్ విని దిమ్మతిరిగిపోయింది. 150 గజాల స్థలంలో ఆన్లైన్లో అనుమతి పొంది జీప్లస్–2 నిర్మాణం చేసుకుంటుండగా, ప్లాన్‌లో చూపిన విధంగా మెట్లు సక్రమంగా లేవని, పోర్టికో నాలుగు అడుగులు ముందుకు వచ్చిందని డీవియేషన్స్ ఉన్న ప్రాంతాన్ని కూల్చేస్తామని, ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణం జరుగుతుందని ఓ అధికారి రూ.5లక్షలు డిమాండ్ చేశారు. స్థానిక కార్పొరేటర్ సహాయంతో ఎమ్మెల్సీని కలిస్తే చివరికి రూ.1.5 లక్షలకు సెటిల్మెంట్ జరిగినట్లు సమాచారం. -
లే‘ఔట్’పై దృష్టి
ఖమ్మం : అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మం నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట అక్రమ లే అవుట్లు, నిబంధనలకు విరుద్ధంగా కొందరు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలతో..బాధ్యులపై చర్యలకు అవినీతి నిరోధక శాఖ ( ఏసీబీ) అధికారులు నిఘా పెట్టారు. రాష్ట్రంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మంలో ఒక వైపు సుడా ఏర్పాటు మరోవైపు ఐటీహబ్.. ఔటర్ రింగ్‌రోడ్ ఏర్పాట్లతో అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా భూ దందా సాగిస్తున్నారనే కోణంలో దృష్టి సారిస్తున్నారు. నగరం చుట్టూ పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్న లే అవుట్లతో పాటు అక్రమాల నివారణ లక్ష్యంగా కసరత్తు జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో హెచ్ఎండీఏ పట్టణ ప్రణాళిక విభాగంలో ఓ అధికారి ఏసీబీకి దొరకడంతో ఇప్పుడు ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చురుగ్గా సాగుతున్న నగరాలపై దృష్టి సారించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే లే అవుట్లు.. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ప్లాట్ల ధరలకు డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమ లే అవుట్లు వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లే అవుట్ ఏర్పాటు చేయాలంటే రెవెన్యూ శాఖ నుంచి ల్యాండ్ కన్వర్షన్ అనుమతులు తీసుకోవాలి. పట్టణ ప్రణాళిక విభాగం నుంచి అంగీకారం కావాలి. అయితే ఇవేమీ పట్టనట్లు కొందరు అక్రమార్కులు..అనుమతులు లేకుండానే లే అవుట్లను చేసి కొనుగోలుదారులకు అంటగడుతున్నారు. ఇటీవల ధంసలాపురం ఆర్వోబీ నిర్మాణ సమయంలో భూసేకరణకు సంబంధించి అక్రమంగా ఏర్పాటు చేసిన లే అవుట్లు బయటకు రావడం గమనార్హం. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఇలా అక్రమ లే అవుట్లు విచ్చలవిడిగా వెలుస్తున్నట్లు తెలుస్తోంది. గ్రీన్‌బెల్ట్ ఏరియాకు తప్పనిసరిగా స్థలాన్ని వదిలేయాల్సి ఉంటుంది. మొత్తం లే అవుట్లో 10 శాతం ప్రాంతాన్ని గ్రీన్‌బెల్ట్ కేటాయించాలి. ప్రస్తుత డిమాండ్ నేపథ్యంలో పట్టించుకోవట్లేదు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో వీటి జారీ వెనుక జరుగుతున్న అక్రమాలపై అవినీతి శాఖ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతంలో నిర్మించిన లే అవుట్లలో 50 శాతం మేరకు గ్రీన్‌బెల్ట్ స్థలాలు మాయమైనట్లు సమాచారం. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే తీరుపై నిఘా పెట్టనున్నారు. భవన నిర్మాణ అనుమతులకు తూట్లు.. అక్రమ లే అవుట్లతోపాటు భవన నిర్మాణ అనుమతులపై అవినీతి నిరోధక శాఖ దృష్టి సారించినట్లు సమాచారం. ప్రధాన రహదారుల వెంబడి అనుమతులకు తిలోదకాలిచ్చి అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. సాధారణంగా పట్టణాల్లో వెయ్యి గజాలపైబడి ఉన్న స్థలాల్లోనే సెల్లార్లు నిర్మించాలి. రైల్వే ట్రాక్‌ల వెంబడి సెల్లార్ల నిర్మాణాలకు అనుమతులు లేవు. ప్రస్తుతం ఉన్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇష్టారాజ్యంగా సెల్లార్ల నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే వీటి అనుమతులపైన అవినీతి శాఖ దృష్టి సారించినట్లు సమాచారం. ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణాలతోపాటు, గత మూడేళ్ల నుంచి వచ్చిన అనుమతులపై సైతం పరిశీలన చేయనున్నారని గుసగుస. ఇప్పటికే హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏపై దృష్టి సారించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు మరికొద్ది రోజుల్లో ఖమ్మంలో సైతం అక్రమ నిర్మాణాలు, లే అవుట్లపై దృష్టి సారించనున్నట్లు సమాచారం. విచారణతో బాగోతం బయటపడే అవకాశాలు ఉన్నాయి. -
పనికో రేటు
మున్సిపాలిటీలో పనికో రేటు..! ఎంత త్వరగా కావాలంటే అంత ముట్టజెప్పాల్సిందే.. భవన నిర్మాణ, వ్యాపార, దుకాణ అనుమతులు, యాజమాన్య పేరు మార్పు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు.. ఇలా ఏ సేవలైనా ఎంతో కొంత చేయి తడపాల్సిందే. ఏమీ చెల్లించని వారు రోజులు చెప్పులరిగేలా తిరగాల్సిందే.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాం కదా! ఇక పని అయిపోయిందనుకుంటే పొరపాటే! సాక్షి, వనపర్తి : మున్సిపాలిటీ ప్రజలకు పారదర్శకంగా, ఎలాంటి అవినీతి అక్రమాలకు తావులేకుండా సేవలు అందించాలని ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని అమలుచేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కార్యాలయంలో కొందరు అధికారులు, కిందిస్థాయి సిబ్బంది, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఏ పనీ జరగడం లేదన్నది బహిరంగ రహస్యమే.. పురపాలక శాఖలో రెవెన్యూ విభాగం కీలకమైంది. కార్యాలయంలో ఖర్చు, రాబడి అన్ని వ్యవహారాలను చక్కబెట్టేది ఇక్కడే. ఆస్తుల క్రయవిక్రయాలు, మ్యూటేషన్ (యాజమాన్య పేరు మార్పు)చేసేది ఈ విభాగమే. వాస్తవానికి రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యూటేషన్‌కు చెల్లించాల్సిన డబ్బులు చెల్లిస్తారు. సబ్‌రిజిస్ట్రార్, పురపాలక సంఘాల మధ్య ఎలాంటి జాప్యం లేకుండా వెంట వెంటనే యాజమాన్య పేరు మార్పిడి జరగాలి. కానీ వనపర్తి పురపాలక సంఘంలో 50శాతం మందికి కూడా నిర్ణీత గడువులోగా మ్యూటేషన్ జరగడం లేదు. పూర్తిగా ఆన్లైన్లో జరగాల్సిన పని లబ్ధిదారులు నేరుగా జోక్యం చేసుకుంటే తప్ప కావడం లేదు. లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి మ్యూటేషన్ దరఖాస్తు పత్రం తెచ్చి రెవెన్యూ విభాగంలో ఇచ్చి ఇంత రేటు అని మాట్లాడుకుంటేనే ఫైల్ ముందుకు కదులుతోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి 2016జూన్ నెల నుంచి 3180 మ్యూటేషన్ ఫైళ్లు రాగా, అందులో మున్సిపాలిటీలో సకాలంలో పూర్తయినవి ఏ ఒక్కటీ లేవనే ఆరోపణలు ఉన్నాయి. ఇల్లు కట్టి చూడు! పురపాలక సంఘం పరిధిలో ఇల్లు కట్టుకోవడానికి ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే 30రోజుల్లోగా అనుమతి ఇవ్వాలి. దానిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 21రోజులకే కుదించింది. కానీ దరఖాస్తుచేసి మూడు నుంచి ఆరు నెలలు గడిచినా అనుమతి రావడం లేదు. అనుమతి మంజూరు కావాలంటే స్థానిక కౌన్సిలర్లతో పాటు, టౌన్‌ప్లానింగ్ అధికారులకు రూ.వేలకు వేలు సమర్పించాల్సి వస్తోందని నిర్మాణదారులు వాపోతున్నారు. ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే చాలారోజుల పాటు అవి అధికారుల టేబుళ్ల మీదే మూలుగుతున్నాయి. ప్రస్తుతం వనపర్తి పురపాలక సంఘంలో ఇంటి నిర్మాణ దరఖాస్తులు కేవలం 10మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నా అవి వాస్తవ లెక్కలు కావనే విషయం అందరికీ తెలిసిందే. మధ్యవర్తుల ప్రమేయం తీసుకోవాల్సిందే.. మున్సిపాలిటీలో ప్రజలు ఏయే రకాల సేవలు పొందాలన్నా పూర్తిగా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత పని పూర్తయిందనుకుంటే పొరపాటే..! దరఖాస్తు చేసుకున్న అనంతరం ఏ ఫైల్ ముందుకు కదిలి పని పూర్తికావాలంటే పురపాలక కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది లేదా మధ్యవర్తుల ప్రమేయం తీసుకోవాల్సిందే. ఏ పనికి ఎంత ఇస్తారో ముందుగా బేరం కుదిరితేనే పని పూర్తవుతుంది. పెండింగ్‌లో ఉంచడం లేదు.. యాజమాన్య మార్పిడి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచడం లేదు. రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం నుంచి ఆన్లైన్లో వచ్చిన వాటిని వెంటనే పరిష్కరిస్తున్నాం. ప్రస్తుతం మున్సిపాలిటీలో 83మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. డబ్బులు ఇచ్చిన వారి పనే చేస్తున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. – నూరుల్‌నజీబ్, రెవెన్యూ అధికారి, వనపర్తి మున్సిపాలిటీ మా దృష్టికి వస్తే చర్యలు భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకుని పూర్తిగా నిబంధనల ప్రకారం ఉంటే వెంటనే అనుమతులు మంజూరు చేస్తున్నాం. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో 6నుంచి 8 మంది ఎల్‌పీటీలు ఉన్నారు. వారు ఇంటి నిర్మాణ దరఖాస్తు సమయంలో వసూలు చేయాల్సిన డబ్బుల కంటే ఎక్కువగా వసూలు చేస్తే మా దృష్టికి తీసుకురండి. వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – కృష్ణమూర్తి, టౌన్ ప్లానింగ్ అధికారి, వనపర్తి -
పైసా వసూల్!
ఒంగోలు నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళిక విభాగం (టౌన్ ప్లానింగ్) అధికారులు, సిబ్బంది దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకునే పనిలో పడ్డారు. భవన నిర్మాణ అనుమతులు, ఆక్రమణలు, ఆక్రమ కట్టడాలు, పబ్లిసిటీ ఫ్లెక్సీలు ఇలా..పలు అంశాల్లో పైసానే పరమావధి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. విభాగ అ«ధిపతి నుంచి చైన్‌మెన్ వరకు అందరిదీ అదే దారి. రోజువారీ కలెక్షన్లు, టార్గెట్లు పెట్టుకొని మరీ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్నట్లు కూడా వ్యవహరిస్తున్నారు. ఒంగోలు అర్బన్: నగరంలోని విలేకరుల కాలనీ, ఇందిరా కాలనీ, కర్నూలు రోడ్డు, 60 అడుగుల రోడ్డు వంటి ప్రధాన రోడ్లలో అనుమతులు మీరి నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలు చాలానే ఉన్నాయి. అయినా టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరపాలక సంస్థకు చెందిన తాగునీటి పైపులైన్లు ఉన్న చోట్ల కొంతమంది ఆక్రమించి మరీ వ్యాపార సముదాయలు నిర్మించారు. చివరకు పక్కపక్కనే ఉండే రెండు భవనాల యజమానుల మధ్య తలెత్తే తగాదాల్లో సైతం వీరి తలదూర్చుతున్నారు. ఒకరికి లోపాయికారిగా అండగా ఉంటున్నారు. అవతలి వ్యక్తి భవన నిర్మాణాన్ని అడ్డుకోవడం, నిర్మించిన భవనాలను కూలగొట్టడం దగ్గరుండి చేస్తున్నారు. ఇక్కడ మరీ దారుణం నిర్మాణానికి అనుమతులు ఇచ్చేందుకు వీల్లేని బాపూజీ కాంప్లెక్స్ పై అంతస్తులో వందల సంఖ్యలో గదులు నిర్మిస్తుంటే పట్టించుకున్న దాఖాలాలు లేవు. కోర్టు స్టే ఉత్తర్వులు ఉన్న భనాలను సైతం కూలదోసిన ఘటనలు లేకపోలేదు. మూడు నెలల క్రితం అనధికారిక భవనాల పేరుతో 21 భవనాలు తొలగించారు. అయితే ఎటువంటి పలుకుబడి లేని వాళ్ల భవనాలను భారీగా కూలదోసి, పలుకుబడి ఉన్న భవనాలను నామమాత్రంగా రంధ్రాలు వేసి వదిలేశారు. అదే సామాన్య ప్రజలు ఒక చిన్న ఇల్లు నిర్మించుకుంటే అనుమతులు లేవని, అక్రమ కట్టడాలు తొలగిస్తున్నామని ప్రకటనలు చేసే టౌన్ ప్లానింగ్ అధికారులు బహుళ అంతస్తుల భవనాలు, పెద్ద భవనాలు, వ్యాపార సముదాయాలు వంటి నిర్మాణాల్లో అ«ధికార పార్టీ నేతల సిఫార్సులు, మాముళ్లు ఉంటే ఆ వైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. చిరు వ్యాపారులపై కొరడా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామంటూ రోడ్డు మార్జిన్లలో చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించే వారిపై కొరడా ఝుళిపించడం ఆనవాయితీగా మారింది. చివరకు రోడ్డు విస్తరణ పనుల్లోనూ సమన్యాయం పాటించడం లేదు. పలుకుబడి, డబ్బు ఉన్న వాళ్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దానికి ఉదాహరణే కర్నూలు రోడ్డు విస్తరణలో రోడ్డు అష్ట వంకర్లు తిరగటం. రెండు నెలల నుంచి కమ్మపాలెం రోడ్డు విస్తరణ చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా మార్కింగ్ ఇచ్చారు. ఆ తర్వాత రోడ్డు విస్తరణను కుదించి ఒక వైపే భవనాలు తొలగిస్తామని అధికారులు చెప్పారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఓఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఓ గుమాస్తాపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆయన వద్ద కోట్లాది రూపాయల ఆస్తులు గుర్తించిన విషయం తెలిసిందే. ఏసీబీ దాడులు చేస్తున్నా టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారుల్లో జంకుబొంకు లేకపోవడం గమనార్హం. -
ఏం ‘ప్లాన్’ వేశారో..!
ప్రొద్దుటూరు టౌన్ : ప్రొద్దుటూరు మున్సిపాలిటిలో లెసైన్సు ప్లానర్లు మున్సిపల్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి బ్యాంకర్లను బురిడీ కొట్టించారు. చాలా కాలంగా కొనసాగుతున్న ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో దాదాపు 15 మంది బిల్డింగ్ లెసైన్స్ సర్వేయర్లు ఉన్నారు. వీరు పట్టణంలో చేపట్టే నిర్మాణాలకు సంబంధించి మున్సిపాలిటీకి వచ్చి చలానా తీసి టౌన్ ప్లానింగ్‌శాఖ నుంచి ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలి. తర్వాతే నిర్మాణపు పనులు చేపట్టాలి. ఇలా ప్రతి నిర్మాణానికి టౌన్ప్లానింగ్శాఖ వారు బీఏ నెంబర్(బిల్డింగ్ అప్లికేషన్ నెంబర్)ను ఇస్తారు. ఆ నెంబర్ ఆధారంగా ప్లాన్ తీసుకున్న భవన యజమాని పేరు, వారి వివరాలు అందులో ఉంటాయి. నిర్మాణం ప్లాన్ ప్రకారం చేస్తున్నారా లేక అతిక్రమించారా అన్న విషయం అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటారు. పాత బీఏ నెంబర్లు.... బ్యాంకులను బురడీ కొట్టిస్తున్న మున్సిపల్ లెసైన్స్ ప్లానర్లు మున్సిపల్ అధికారులు గతంలో నిర్మాణానికి ఇచ్చిన బీఏ నెంబర్‌ను వేస్తున్నారు. ఇలా మున్సిపల్ కమిషనర్, టౌన్‌ప్లానింగ్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ ప్లాన్లు తయారు చేస్తున్నారు. ఇలా జిల్లా కేంద్రంలో ఉన్న గృహాలకు రుణాలు ఇచ్చే ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థతో పాటు మరికొన్ని బ్యాంకుల్లో నకిలీ ప్లాన్లను సమర్పించి రుణాలు పొందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అధికారుల సంతకాలు ఫోర్జరీతో వెలుగులోకి ప్రొద్దుటూరు పట్టణం దొరసానిపల్లె రోడ్డు నెంబర్ 5/1289లో ఎస్.పుల్లయ్య అనే వ్యక్తి నకిలీ ప్లాన్‌తోపాటు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులు వీటిని పరిశీలించారు. ఇందుకు సంబంధించి బిల్డింగ్ అప్లికేషన్ నెంబర్ 163/2014/జీ2 కింద 27-9-2014లో ప్లాన్ మంజూరు చేస్తున్నట్లు నకిలీ ప్లాన్‌లో పొందుపరిచారు. ఇందులో సిటీ ప్లానర్ శ్రీనివాసులు సంతకాలు ఫోర్జరీ చేశారు. అయితే ఆర్.సుభాన్ మున్సిపల్ లెసైన్స్ సర్వేయర్ కింద ఈ ప్లాన్ మంజూరు చేసినట్లు అందులో సీల్, సంతకం ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్ పి.నాగేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది నా సంతకం కాదు నకిలీ ప్లాన్‌లో లెసైన్స్ మున్సిపల్ సర్వేయర్ సీల్ వేసిన పైభాగంలో సంతకం చేసింది తాను కాదని తన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారని ఆర్.సుభా న్ వాపోతున్నారు. మున్సిపల్ కార్యాలయం రో డ్డులో ఉన్న లెసైన్స్ సర్వేయర్ శ్రీరాములు వద్ద తన సీల్ ఉంచానని తెలిపారు. కొన్ని ప్లాన్ అ ప్రూవల్కు సంబంధించి సంతకాలు చేశానని, కా నీ ఎస్.పుల్లయ్య పేరుతో మంజూరైన ప్లాన్‌లో ఉన్నది తన సంతకం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నకిలీ ప్లాన్లు ఎందుకంటే మున్సిపల్ లెసైన్స్ సర్వేయర్లుగా ఉన్న ప్లానర్లు నకిలీ ప్లాన్లను తయారు చేయడం వెనుక ఓ కారణం ఉన్నట్లు తెలుస్తోంది. లే అవుట్ కాని ప్రాంతాల్లో ప్లాన్ కావాలంటే 14 శాతం ఫీజు అధికంగా చెల్లించాలి. అలాగే మాస్టర్ ప్లాన్ ప్రాంతాల్లో ప్లాన్లు ఇవ్వరు కాబట్టి నకిలీ ప్లాన్లను పెట్టి బ్యాంకర్లను బురిడీ కొట్టించి రుణాలు తెచ్చుకుంటున్నారు. ఈ విధంగా రూ.5లక్షల నుంచి కోటి రూపాయల వరకు లోన్లు ఇస్తుండటంతో నకిలీ ప్లాన్ల దందా కొనసాగుతోంది. పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది.