మున్సిపాలిటీలో పనికో రేటు..! ఎంత త్వరగా కావాలంటే అంత ముట్టజెప్పాల్సిందే.. భవన నిర్మాణ, వ్యాపార, దుకాణ అనుమతులు, యాజమాన్య పేరు మార్పు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు.. ఇలా ఏ సేవలైనా ఎంతో కొంత చేయి తడపాల్సిందే. ఏమీ చెల్లించని వారు రోజులు చెప్పులరిగేలా తిరగాల్సిందే.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాం కదా! ఇక పని అయిపోయిందనుకుంటే పొరపాటే!
సాక్షి, వనపర్తి : మున్సిపాలిటీ ప్రజలకు పారదర్శకంగా, ఎలాంటి అవినీతి అక్రమాలకు తావులేకుండా సేవలు అందించాలని ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని అమలుచేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కార్యాలయంలో కొందరు అధికారులు, కిందిస్థాయి సిబ్బంది, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఏ పనీ జరగడం లేదన్నది బహిరంగ రహస్యమే.. పురపాలక శాఖలో రెవెన్యూ విభాగం కీలకమైంది. కార్యాలయంలో ఖర్చు, రాబడి అన్ని వ్యవహారాలను చక్కబెట్టేది ఇక్కడే. ఆస్తుల క్రయవిక్రయాలు, మ్యూటేషన్ (యాజమాన్య పేరు మార్పు)చేసేది ఈ విభాగమే. వాస్తవానికి రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యూటేషన్‌కు చెల్లించాల్సిన డబ్బులు చెల్లిస్తారు. సబ్‌రిజిస్ట్రార్, పురపాలక సంఘాల మధ్య ఎలాంటి జాప్యం లేకుండా వెంట వెంటనే యాజమాన్య పేరు మార్పిడి జరగాలి. కానీ వనపర్తి పురపాలక సంఘంలో 50శాతం మందికి కూడా నిర్ణీత గడువులోగా మ్యూటేషన్ జరగడం లేదు. పూర్తిగా ఆన్‌లైన్‌లో జరగాల్సిన పని లబ్ధిదారులు నేరుగా జోక్యం చేసుకుంటే తప్ప కావడం లేదు. లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి మ్యూటేషన్ దరఖాస్తు పత్రం తెచ్చి రెవెన్యూ విభాగంలో ఇచ్చి ఇంత రేటు అని మాట్లాడుకుంటేనే ఫైల్ ముందుకు కదులుతోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి 2016జూన్ నెల నుంచి 3180 మ్యూటేషన్ ఫైళ్లు రాగా, అందులో మున్సిపాలిటీలో సకాలంలో పూర్తయినవి ఏ ఒక్కటీ లేవనే ఆరోపణలు ఉన్నాయి.
ఇల్లు కట్టి చూడు!
పురపాలక సంఘం పరిధిలో ఇల్లు కట్టుకోవడానికి ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే 30రోజుల్లోగా అనుమతి ఇవ్వాలి. దానిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 21రోజులకే కుదించింది. కానీ దరఖాస్తుచేసి మూడు నుంచి ఆరు నెలలు గడిచినా అనుమతి రావడం లేదు. అనుమతి మంజూరు కావాలంటే స్థానిక కౌన్సిలర్లతో పాటు, టౌన్‌ప్లానింగ్ అధికారులకు రూ.వేలకు వేలు సమర్పించాల్సి వస్తోందని నిర్మాణదారులు వాపోతున్నారు. ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే చాలారోజుల పాటు అవి అధికారుల టేబుళ్ల మీదే మూలుగుతున్నాయి. ప్రస్తుతం వనపర్తి పురపాలక సంఘంలో ఇంటి నిర్మాణ దరఖాస్తులు కేవలం 10మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నా అవి వాస్తవ లెక్కలు కావనే విషయం అందరికీ తెలిసిందే.
మధ్యవర్తుల ప్రమేయం తీసుకోవాల్సిందే..
మున్సిపాలిటీలో ప్రజలు ఏయే రకాల సేవలు పొందాలన్నా పూర్తిగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత పని పూర్తయిందనుకుంటే పొరపాటే..! దరఖాస్తు చేసుకున్న అనంతరం ఏ ఫైల్ ముందుకు కదిలి పని పూర్తికావాలంటే పురపాలక కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది లేదా మధ్యవర్తుల ప్రమేయం తీసుకోవాల్సిందే. ఏ పనికి ఎంత ఇస్తారో ముందుగా బేరం కుదిరితేనే పని పూర్తవుతుంది.
పెండింగ్‌లో ఉంచడం లేదు..
యాజమాన్య మార్పిడి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచడం లేదు. రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌లో వచ్చిన వాటిని వెంటనే పరిష్కరిస్తున్నాం. ప్రస్తుతం మున్సిపాలిటీలో 83మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. డబ్బులు ఇచ్చిన వారి పనే చేస్తున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదు.
– నూరుల్‌నజీబ్, రెవెన్యూ అధికారి,
వనపర్తి మున్సిపాలిటీ
మా దృష్టికి వస్తే చర్యలు
భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకుని పూర్తిగా నిబంధనల ప్రకారం ఉంటే వెంటనే అనుమతులు మంజూరు చేస్తున్నాం. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో 6నుంచి 8 మంది ఎల్‌పీటీలు ఉన్నారు. వారు ఇంటి నిర్మాణ దరఖాస్తు సమయంలో వసూలు చేయాల్సిన డబ్బుల కంటే ఎక్కువగా వసూలు చేస్తే మా దృష్టికి తీసుకురండి. వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
– కృష్ణమూర్తి,
టౌన్ ప్లానింగ్ అధికారి, వనపర్తి
Comments
Please login to add a commentAdd a comment