వేనాడు మార్గంలో పులికాట్ సరస్సులో కనువిందు చేస్తున్న ఫ్లెమింగోలు(ఫైల్)
ఆధునిక ప్రపంచం.. ఎటుచూసినా కాలుష్యం.. భయాందోళనకు గురిచేస్తున్న వాతావరణం.. ఇలాంటి పరిస్థితులకు దూరంగా స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉన్న పల్లెలు ప్రస్తుతం చాలా అరుదుగా ఉన్నాయి. స్వచ్ఛతకు ప్రతిరూపమైన తడ మండలంలోని వేనాడు, ఇరకం దీవుల్లో ప్రతిదీ విలువైనదే. ఈ దీవులకు ప్రత్యేకత ఉంది. ఇక్కడి ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉన్నారనే భావన తప్ప నేటి కాలుష్య జీవితం నుంచి దూరంగా ప్రకృతి ఒడిలో ఆహ్లాదంగా గడుపుతున్నారన్న వీరి సంతృప్తిని చూసి ఎవరైనా అసూయ పడాల్సిందే.
పర్యాటక కేంద్రంగా ఇరకం
పులికాట్ సరస్సు నడుమ ప్రకృతి అందాలతో కాలుష్య కోరలకు దూరంగా ప్రశాంతంగా ఉండే దీవి గ్రామం ఇరకం. ఈ గ్రామానికి చేరుకోవాలంటే పడవ ప్రయాణం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. గ్రామం చుట్టూ ఉప్పునీరు ఉన్నప్పటికీ గ్రామంలో మాత్రం తియ్యటి మంచినీళ్లు లభించడం దీని ప్రత్యేకత. గ్రామం నిండా మంచి నీటికోసం తవ్విన దొరువులు వాటి పక్కన మొగలి పొదలు కనిపిస్తాయి. వరి ప్రధాన పంట కాగా ఇక్కడ మొగలి పొదలు, వెదురు, పేము, కొన్ని రకాల మూలికా వేర్లు విరివిగా లభిస్తాయి. ఈ పంటలను వ్యాపారాత్మకంగా పెంచేలా ప్రభుత్వం అవగాహన కల్పించి సహకరిస్తే ఎంతో మందికి జీవనోపాధి లభిస్తుంది.
వేనాడులో ప్రకృతి కనువిందు
రాకెట్ ప్రయోగ కేంద్రం షార్‌కు సమీపంలో ఉన్న ఈ గ్రామం కూడా పులికాట్ సరస్సు మధ్యలో ఉంటూ గతంలో దీవిగా ఉండేది. కానీ షార్ రోడ్డు నుంచి వేనాడు వరకు పసల పెంచలయ్య మంత్రిగా పనిచేసిన కాలంలో ఏర్పాటు చేసిన గ్రావెల్ రోడ్డు ఒక్కటే మార్గం. ప్రస్తుతం అది కూడా గతుకులమయంగా మారి ప్రయాణికులకు నరకం చూపుతోంది. గ్రామం కాలుష్యపు కోరలకు దూరంగా తెల్లటి ఇసుక దిబ్బలతో అందంగా కనిపిస్తుంది. ఇక్కడ షేక్ షావలి అల్లా దర్గా, శ్రీశృంగేశ్వర శ్రీరంగ పెరుమాళ్ ఆలయం వంటి ఆధ్యాత్మిక విశేషాలు చాలానే ఉన్నాయి. వరి ప్రధాన పంట. తాగునీటికి సమస్య లేదు. కానీ ఈ గ్రామం నుంచి గ్రామస్తులు పనులపై మండల కేంద్రం తడకు రావాలంటే దాదాపు 33 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడ జీడిమామిడి, పేము, వెదురు, తంగేడిపూలు, సీగిరేణి(అరిపాకు) ఆకు విరివిగా లభిస్తాయి.
గతంలో ఈ గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సీగిరేణి ఆకుతోనే తల స్నానాలు చేసేవారు. దీని వల్ల చుండ్రు, జుత్తురాలే సమస్యలు తగ్గడంతోపాటు చలవ చేసే గుణం కూడా ఉండేది. అనంతర కాలంలో షాంపులు రావడంతో ఈ ఆకును వాడే వారు కరువైపోయారు. ఇక్కడ లభించే ఉత్పత్తులను వాణిజ్యపరంగా సాగు చేసేలా ఇక్కడి గిరిజనులు, ఇతరులను ప్రోత్సహించడం ద్వారా పలువురికి ఉపాధి లభించే అవకాశం ఏర్పడుతుంది. వేనాడు, ఇరకం దీవులకు కూతవేటు దూరంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం ఉండగా మరికొద్ది దూరంలోనే శ్రీసిటీ, మాంబట్టు పారిశ్రామిక వాడలు ఉన్నాయి. రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో ఈ గ్రామాల్లోని యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయి గ్రామాలకే పరిమితమవుతున్నారు. ఈ రెండు గ్రామాల చుట్టూ పులికాట్ సరస్సు ఉప్పు నీళ్లు ఉన్నా గ్రామాల్లో మాత్రం స్వచ్ఛమైన తియ్యటి నీళ్లు ఉండడం వీరు అదృష్టంగా భావిస్తారు. ఈ నీటి ఆసరాగా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు.
వ్యవసాయ భూమి పరిమితంగా ఉండి కూలీలు ఎక్కువగా ఉండడంతో వీరికి సరైన పని లభించడం లేదు. ఇరకం, వేనాడు దీవుల్లో ప్రశాంతమైన వాతావరణంతోపాటు ప్రతి చెట్టూ, వేరూ, ఆకూ, పువ్వూ, కాయ, పండూ అన్నీ ఏదో ఒక అద్భుతమైన ఔషధగుణం కలిగినవిగా ఉంటాయి. వేనాడులో ఎక్కువ శాతం చెట్లు క్లోనింగ్ మొక్కల తరహాలో ఓ మోస్తరు ఎత్తు మాత్రమే పెరుగుతాయి. భారీ వృక్షాలు ఇక్కడ పెద్దగా కనిపించకపోవడం విశేషం. బయటి ప్రాంతాల్లో రావి, వేపచెట్ల తరహాలో ఈ గ్రామంలో వేపచెట్లు ఆరిపాకు చెట్లతో పెనవేసుకుని కనిపిస్తాయి. ఈ గ్రామాలకు వెళ్లే మార్గంలో పులికాట్ సరస్సులో నీళ్లు ఉన్న సమయంలో దేశ, విదేశీ విహంగాలు చేసే విన్యాసాలు కనువిందు చేస్తాయి. ఈ గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా అవి కార్యరూపం దాల్చడం లేదు.
ఆ దీవుల అభివృద్ధికి కృషి చేస్తున్నాం
వేనాడు, ఇరకం దీవులు అద్భుత గ్రామాలు. ఇక్కడి ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు అందించడంతోపాటు ఈ గ్రామాల్లోని ప్రజలకు ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు చేపట్టాల్సిన చర్యలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి నెరవేరుస్తాం. ఇరకం దీవిలో పర్యాటక పెట్టుబడుల కోసం ఇప్పటికే చెన్నైలోని ‘వీజీపీ’ ప్రతినిధులతో చర్చలు జరిపాం. వారు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఇక్కడి ప్రజల సౌకర్యార్థం రోడ్డు వసతి, పులికాట్ ముఖద్వారాల పూడికతీత, సౌకర్యాల కల్పనకు కృషి చేస్తా.
– కిలివేటి సంజీవయ్య, సూళ్లూరుపేట ఎమ్మెల్యే
గతంలో అరిపాకే అందరికీ
మా చిన్నతనంలో అరిపాకుతోనే తల స్నానం చేసే వాళ్లం. దీని వల్ల జుట్టుకి సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చేవి కావు. ఈ ఆకును పొడి కొట్టించడం, స్నానం చేసేందుకు కూడా ఎక్కువ సమయం పట్టడం వంటి కారణాలతో ప్రజలు షాంపూల వైపు మళ్లారు. తిరిగి ప్రస్తుతం పాత అలవాట్లకు వస్తున్న ప్రజలు ఇప్పుడిప్పుడు ఈ ఆకు కోసం గ్రామానికి వస్తున్నారు. గ్రామంలో నీటి చెమ్మ ఉన్న ప్రాంతాల్లో పేము బాగా పెరుగుతుంది. ఇక్కడ పట్టా భూముల్లో సాగయ్యే పేముని వేలం పాట ద్వారా విక్రయిస్తాం. ఆకు నుంచి, కాడ వరకు ముళ్లతో ఉండే ఈ పేముని గిరిజనులు తప్ప ఇతరులు కొయ్యలేరు. ఈ రెండింటినీ బాగా సాగు చేసి వినియోగంలోకి తెస్తే కొందరికైనా ఉపాధి లభిస్తుంది.
– కె.వాసుమొదలి, వేనాడు గ్రామం, తడ మండలం
Comments
Please login to add a commentAdd a comment