ఆమె ముఖంలోని రెండు కళ్లు సరిగా చూడలేవు.. ఆమె మనో నేత్రం ప్రపంచాన్ని చూడగలదు.. సాటివారి ఇబ్బందులను తెలుసుకోగలదు.. వారికి చేతనైన సహాయం చేయించగలదు.. నెల్లూరు జిల్లా వరికుంటపాడు వాస్తవ్యులు బొడ్డు నాగలక్ష్మి మనోనేత్రం సామాన్యుల కళ్ల కంటే కరోనా బాధితుల కష్టాలను మరింత చేరువగా చూసింది. తన ఐదు మాసాల పెన్షన్‌ను విరాళం ఇచ్చేలా ప్రోత్సహించింది.
‘‘కళ్లు లేకపోతేనేం, నా మనసుతో ప్రపంచాన్ని చూస్తాను. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే కృత నిశ్చయంతో ఉన్నాను. గెలుపు సాధించి, అందరికీ స్ఫూర్తిగా ఉండాలనే తపనతో ఉన్నాను. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ఆత్మస్థయిర్యంతో ఎదుర్కోవాలి’’ అంటారు కావలికి చెందిన బొడ్డు నాగలక్ష్మి. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం ఆండ్రవారిపల్లె గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి, లక్ష్మమ్మ దంపతుల నాలుగో సంతానం నాగలక్ష్మి. పుట్టుకతోనే అంధురాలు.
ఎడమ కన్ను పూర్తిగా కనిపించదు. కుడి కన్ను కేవలం ఐదు శాతం మాత్రమే కనిపిస్తుంది. అది కూడా వస్తువును చాలా దగ్గరగా పెట్టుకుంటేనే కనిపిస్తుంది.‘‘మా నాన్న కృష్ణారెడ్డి చిన్న రైతు. మాది అతి సాధారణమైన కుటుంబం. మమ్మలి కష్టపడి పెంచి పెద్ద చేశారు’’ అంటున్న నాగలక్ష్మికి చిన్నతనం నుంచి చిన్న అన్నయ్య ఆదిరెడ్డితో అనుబంధం ఎక్కువ.
ఆ అన్నయ్య ప్రోత్సాహంతో ఐదవ తరగతి వరకు చదువుకున్నారు నాగలక్ష్మి. ఏడు సంవత్సరాల క్రితం నాగలక్ష్మి తల్లి కాలం చేశారు. దానితో చిన్న అన్నయ్యకు నాగలక్ష్మి బాధ్యత రెట్టింపయింది. ఆమెను జాగ్రత్తగా, కన్నబిడ్డలా చూసుకోవటం ప్రారంభించారు. చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు చూసిన నాగలక్ష్మికి, ఎవరైనా తమ కష్టాలు చెప్పుకుంటే, తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేయటం అలవాటు. ఇది ఆమెకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు.
చిన్న అన్నయ్య ఆదిరెడ్డికి ఎం.ఎస్‌సి. చదివిన కవితతో వివాహం నిశ్చయమైనప్పుడు, ‘మనతో పాటు అంధురాలైన నా చెల్లెలు కూడా ఉంటుంది’ అని చెప్పారట. అందుకు కవిత అంగీకరించారట. అలా వదినతో నాగలక్ష్మికి అనుబంధం ఏర్పడింది.
ఇంట్లో ఏ పనీ లేకుండా ఉండటం నాగలక్ష్మికి నచ్చలేదు. కాని ఏదైనా పని చేయాలంటే చేయలేని పరిస్థితి. ‘‘మా వదినతో కలిసి ఆరు నెలల క్రితం యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను. కుటుంబ బంధాలు, ఇంటి పనులు–వంటపనుల్లో మహిళలు పాటించవలసిన మెళకువలు, పిల్లల పెంపకం... ఇలా పలు అంశాలపై వీడియోలు చేయడం మొదలు పెట్టాం. కేవలం ఆరు నెలల్లో 1.75 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ చేరారు. కోటీ యాభై లక్షల మంది మా యూ ట్యూబ్ ఛానల్‌ను వీక్షించారు. నాకు, వదినకు ఎంతో సంబరంగా అనిపించింది’’ అంటారు నాగలక్ష్మి.
ఇటీవలే అంటే సెకండ్ వేవ్‌లో నాగలక్ష్మి కరోనా బారిన పడ్డారు. ఆ సమయంలో ఆమెను ప్రత్యేకంగా ఒక గదిలో పెట్టారు. ‘‘గదిలో ఒంటరిగా ఉండటం వల్ల బోర్‌గా అనిపించేది. కంటికి దగ్గరగా పెట్టుకుని యూట్యూబ్ వీడియోలు చూడటం మొదలుపెట్టాను. అలా గమనిస్తూండగా, ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ కరోనా భాధితుల కోసం చేస్తున్న సహాయాలకు సంబంధించిన అంశాలను గమనించాను. నాకు ప్రభుత్వం ప్రతినెల మూడు వేల రూపాయలు పింఛన్‌గా అందిస్తోంది. నేను నా ఐదు నెలల పింఛన్‌ను దాచిపెట్టాను. అలా దాచిన పదిహేను వేల రూపాయలను సోనూసూద్ ట్రస్ట్‌కు అందచేశాను’’ అంటూ ఎంతో ఆనందంగా చెప్పారు నాగలక్ష్మి.
నగదు పంపిన మూడు రోజులు తర్వాత సోనూసూద్.. నాగలక్ష్మికి నేరుగా ఫోన్ చేసి, మూడు నిమిషాల పాటు మాట్లాడారు. ‘‘ఆయన హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాట్లాడారు. ఆయన మాటల్లో ‘యూ ఆర్ రియల్ హీరో. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కబురు పెడతాను, హైదరాబాద్‌లో కలుద్దాం’ అన్న మాటలు మాత్రమే అర్థం అయ్యాయి’’ అంటూ తృప్తిగా తన సంభాషణ ముగించారు నాగలక్ష్మి.
– కె.ఎస్, కావలి, సాక్షి నెల్లూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment