varikuntapadu
-
Kavitha Naga Vlogs: ఆమె మనసుకు రుచి తెలుసు
ఆమెకు చూపు సరిగా లేదు. కాని అద్భుతంగా వండుతుంది. ఇలా వండమని యూ ట్యూబ్‌లో వంటలు చేస్తూ అందరినీ అభిమానులుగా మార్చుకుంది. ఒకరు కాదు... ఇద్దరు కాదు రెండున్నర లక్షల మంది సబ్స్క్రయిబర్లతో స్టార్‌గా వెలుగుతున్న తెలుగు చెఫ్ బొడ్డు నాగలక్ష్మి. ఈమె వీడియోలు చూశారా మీరు? ‘అందరికీ నమస్తే. నేను నాగలక్ష్మి, ఈమె కవిత. మేమిద్దరం వదిన మరదళ్ళం’ అని మొదలవుతుంది నాగలక్ష్మి చేసే వీడియో. నిజానికి ఆమె చేసేది జంట వీడియో. ప్రతి వీడియోలోనూ వదిన కవిత ఉంటుంది. ఇద్దరి పేరు మీద ‘కవిత నాగ వ్లోగ్స్’ పేరుతో యూట్యూబ్ చానల్ ఉంది. 2020 వ సంవత్సరం సెప్టెంబర్‌లో మొదలైన చానల్ రెండేళ్ల లోపే రెండున్నర లక్షల సబ్స్క్రయిబర్లను సాధించింది. నాగలక్ష్మికి ఆర్థిక ప్రోత్సాహం లభిస్తోంది. ఇంతచేసి నాగలక్ష్మికి చూపు లేదు. కాని అది ఆమె విజయానికి అడ్డంకి కాలేదు. బతికిన పసిగుడ్డు నెల్లూరు జిల్లా వరికుంటపాడుకు చెందిన రైతు కృష్ణారెడ్డి ఆఖరు కూతురు నాగలక్ష్మి. పుట్టుకతోనే చూపు లేదు. పురిట్లో చూసిన బంధువులు ‘ఎందుకు కృష్ణారెడ్డి అవస్థ పడతావు. వడ్లగింజ వేసెయ్’ అని సలహా ఇచ్చారు. కాని నాగలక్ష్మి తల్లి బిడ్డను గుండెలకు హత్తుకుంది. ‘చూపులేకపోతే నా బిడ్డ కాకుండా పోతుందా’ అంది. వయసు పెరిగాక అర్థమైన విషయం ఏమిటంటే నాగలక్ష్మికి ఎడమ కన్ను పూర్తిగా కనిపించదు. కుడికన్ను ఏదైనా వస్తువు దగ్గరగా పెట్టుకుంటే 5 శాతం కనిపిస్తుంది. అంటే ఆమె కుడికన్ను చాలా కొద్దిగా అతి దగ్గరి వస్తువులు (రెండు అంగుళాల దూరంలో) ఉంటే చూస్తుంది. అయినా సరే నాగలక్ష్మి బెదరలేదు. ఐదు వరకు బడికి వెళ్లింది. ఆ తర్వాత ఇంట్లో తల్లికి చేదోడు వాదోడుగా ఉండిపోయింది. నీళ్లు మోయడం మామూలు పనులు చేయడం చూపు లేకపోయినా అడుగుల అంచనాను బట్టి అలవాటు చేసుకుంది. కాని సమస్యలు ఆమెను వదల్లేదు. తల్లి వియోగం 18 ఏళ్ల వయసులో తల్లి మరణించింది. అప్పటికి అక్కకు పెళ్లయి వెళ్లిపోవడంతో ఇంటిలో వంట పని నాగలక్ష్మి బాధ్యత అయ్యింది. తండ్రికి, అన్నయ్యకు ఆమే వండి పెట్టాల్సి వచ్చింది. కాని అన్నం వండటం తప్ప నాగలక్ష్మికి ఏమీ రాదు. అప్పుడు పక్కనే ఉండే ఒక అవ్వ ఆమెకు సాయం చేసింది. ‘నువ్వు వండుతూ ఉండు. నేను పక్కన ఉండి సలహా ఇస్తుంటాను’ అని పక్కన ఉండి వంట నేర్పించింది. ఆ అవ్వకు బాగా వండటం వచ్చు. అది నాగలక్ష్మికి కూడా వచ్చేసింది. అయినప్పటికీ ఇంట్లో ఆడతోడు లేకపోవడం వల్ల శారీరకంగా మానసికంగా వచ్చే ఇబ్బందులకు తోడు కోసం నాగలక్ష్మి బాధలు పడింది. అయితే ఆమె అన్న ఆదిరెడ్డి వివాహం చేసుకుని ప్రకాశం జిల్లాకు చెందిన బోండాల కవితను కోడలిగా తేవడంతో ఆమె జీవితానికి పెద్ద ఆసరా దొరికింది. యూట్యూబ్ ప్రయోగాలు 2018లో నాగలక్ష్మి అన్న ఆదిరెడ్డి యూట్యూబ్ చానల్ ప్రారంభించి ‘బిగ్‌బాస్’ షో మీద కామెంటరీ చెప్పేవాడు. ఆ వీడియోలు హిట్ అయ్యి అతనికి పేరు వచ్చింది. ఆ సందర్భంలో ఒకరోజు నాగలక్ష్మి చేత సరదాగా కామెంటరీ చెప్పిస్తే ఆ వీడియో అందరూ బాగుందన్నారు. అప్పటికి నాగలక్ష్మికి సీరియల్స్ పిచ్చి బాగా ఉండేది. టీవీలో సీరియల్స్‌ను చూసేది (వినేది). ఫోన్లో అయితే కంటికి దగ్గరగా పెట్టుకుంటే సీరియల్ బూజరగా కనిపిస్తుంది. అందువల్ల ఆదిరెడ్డి ఆమె చేత ‘సీరియల్ పిచ్చి’ అనే షో చేయించాడు. కాని దానికి పెద్ద స్పందన రాలేదు. కాని 2020లో లాక్డౌన్ సమయంలో నాగలక్ష్మి, కవిత కలిసి వంట వీడియోలు మొదలెట్టారు. ఇద్దరూ మంచి మాటకారులు కావడంతో రెండు రోజుల్లోనే 10 వేల మంది సబ్స్క్రయిబర్లు వచ్చారు. ‘కవిత నాగ వ్లోగ్స్’ అలా మొదలైంది. జామకాయ రోటి పచ్చడి నెల్లూరు పప్పుచారు తనకు చూపు లేదని ఈసురోమనడం నాగలక్ష్మి స్వభావంలో లేదు. ప్రతి వీడియోలో వదినతో కలిసి హుషారుగా కబుర్లు చేస్తుంది. చూపున్నట్టే వంటగదిలో కదలుతూ వంట చేస్తుంది. వదిన మరదలు కలిసి స్థానిక వంటలు రకరకాలుగా చేస్తూ భారీగా అభిమానులను కూడగట్టుకున్నారు. నాగలక్ష్మి చేసే పప్పుచారుకు పెద్ద గిరాకీ ఉంది. అలాగే చుక్కకూర పచ్చడి వీడియో పెద్ద హిట్ అయ్యింది. పచ్చి జామకాయ రోటి పచ్చడి కూడా ఈమె రుచి చూపించింది. చపాతీ లడ్డు మరో వెరైటీ. నెల్లూరు చేపల పులుసును అథెంటిక్‌గా చేసి చూపిస్తుంది. ‘నేను నూనె ఎక్కువ వేశానని ఒక్కరు కూడా అనరు. అంత సరిగ్గా వేస్తాను’ అంటుంది నాగలక్ష్మి. రకరకాల కామెంట్లు నాగలక్ష్మి వీడియోలకు 40 ఏళ్లు దాటిన అభిమానులు ఎక్కువ. అయితే ఈ వదిన మరదళ్ల మధ్య కూడా తంపులు పెట్టడానికి అన్నట్టు వీడియోల కింద కొందరు కామెంట్లు పెట్టారు. వీరు విడిపోయారని కూడా అన్నారు. కాని వదిన మరదళ్లు కలిసి వీడియోలు చేస్తూనే ఉన్నారు. తమ ఇంట్లో జరిగే ప్రతి విశేషాన్ని దాపరికం, శషభిషలు లేకుండా వ్యూయెర్స్తో పంచుకోవడమే వీరి వీడియోలలో విశేషం. ‘చిన్న చిన్న సమస్యలతో ఆత్మహత్యలు చేసుకునేవారి వార్తలు వింటుంటాను. ఎటువంటి సవాలునైనా ఎదుర్కోవాలనేదే నా సలహా’ అని నాగలక్ష్మి అంటుంది. తన సంపాదన నుంచి సోనూసూద్ ఫౌండేషన్‌కు, సిఎం రిలీఫ్ ఫండ్‌కు డొనేట్ చేసింది నాగలక్ష్మి. అపజయం ఆమె కంట పడలేదు. ఆమె తన ప్రతి అడుగులోనూ వినేది గెలుపు పిలుపునే. -
సోనూసూద్.. హైదరాబాద్‌లో కలుద్దామన్నారు: నాగలక్ష్మి
ఆమె ముఖంలోని రెండు కళ్లు సరిగా చూడలేవు.. ఆమె మనో నేత్రం ప్రపంచాన్ని చూడగలదు.. సాటివారి ఇబ్బందులను తెలుసుకోగలదు.. వారికి చేతనైన సహాయం చేయించగలదు.. నెల్లూరు జిల్లా వరికుంటపాడు వాస్తవ్యులు బొడ్డు నాగలక్ష్మి మనోనేత్రం సామాన్యుల కళ్ల కంటే కరోనా బాధితుల కష్టాలను మరింత చేరువగా చూసింది. తన ఐదు మాసాల పెన్షన్‌ను విరాళం ఇచ్చేలా ప్రోత్సహించింది. ‘‘కళ్లు లేకపోతేనేం, నా మనసుతో ప్రపంచాన్ని చూస్తాను. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే కృత నిశ్చయంతో ఉన్నాను. గెలుపు సాధించి, అందరికీ స్ఫూర్తిగా ఉండాలనే తపనతో ఉన్నాను. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ఆత్మస్థయిర్యంతో ఎదుర్కోవాలి’’ అంటారు కావలికి చెందిన బొడ్డు నాగలక్ష్మి. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం ఆండ్రవారిపల్లె గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి, లక్ష్మమ్మ దంపతుల నాలుగో సంతానం నాగలక్ష్మి. పుట్టుకతోనే అంధురాలు. ఎడమ కన్ను పూర్తిగా కనిపించదు. కుడి కన్ను కేవలం ఐదు శాతం మాత్రమే కనిపిస్తుంది. అది కూడా వస్తువును చాలా దగ్గరగా పెట్టుకుంటేనే కనిపిస్తుంది.‘‘మా నాన్న కృష్ణారెడ్డి చిన్న రైతు. మాది అతి సాధారణమైన కుటుంబం. మమ్మలి కష్టపడి పెంచి పెద్ద చేశారు’’ అంటున్న నాగలక్ష్మికి చిన్నతనం నుంచి చిన్న అన్నయ్య ఆదిరెడ్డితో అనుబంధం ఎక్కువ. ఆ అన్నయ్య ప్రోత్సాహంతో ఐదవ తరగతి వరకు చదువుకున్నారు నాగలక్ష్మి. ఏడు సంవత్సరాల క్రితం నాగలక్ష్మి తల్లి కాలం చేశారు. దానితో చిన్న అన్నయ్యకు నాగలక్ష్మి బాధ్యత రెట్టింపయింది. ఆమెను జాగ్రత్తగా, కన్నబిడ్డలా చూసుకోవటం ప్రారంభించారు. చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు చూసిన నాగలక్ష్మికి, ఎవరైనా తమ కష్టాలు చెప్పుకుంటే, తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేయటం అలవాటు. ఇది ఆమెకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. చిన్న అన్నయ్య ఆదిరెడ్డికి ఎం.ఎస్సి. చదివిన కవితతో వివాహం నిశ్చయమైనప్పుడు, ‘మనతో పాటు అంధురాలైన నా చెల్లెలు కూడా ఉంటుంది’ అని చెప్పారట. అందుకు కవిత అంగీకరించారట. అలా వదినతో నాగలక్ష్మికి అనుబంధం ఏర్పడింది. ఇంట్లో ఏ పనీ లేకుండా ఉండటం నాగలక్ష్మికి నచ్చలేదు. కాని ఏదైనా పని చేయాలంటే చేయలేని పరిస్థితి. ‘‘మా వదినతో కలిసి ఆరు నెలల క్రితం యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను. కుటుంబ బంధాలు, ఇంటి పనులు–వంటపనుల్లో మహిళలు పాటించవలసిన మెళకువలు, పిల్లల పెంపకం... ఇలా పలు అంశాలపై వీడియోలు చేయడం మొదలు పెట్టాం. కేవలం ఆరు నెలల్లో 1.75 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ చేరారు. కోటీ యాభై లక్షల మంది మా యూ ట్యూబ్ ఛానల్‌ను వీక్షించారు. నాకు, వదినకు ఎంతో సంబరంగా అనిపించింది’’ అంటారు నాగలక్ష్మి. ఇటీవలే అంటే సెకండ్ వేవ్‌లో నాగలక్ష్మి కరోనా బారిన పడ్డారు. ఆ సమయంలో ఆమెను ప్రత్యేకంగా ఒక గదిలో పెట్టారు. ‘‘గదిలో ఒంటరిగా ఉండటం వల్ల బోర్‌గా అనిపించేది. కంటికి దగ్గరగా పెట్టుకుని యూట్యూబ్ వీడియోలు చూడటం మొదలుపెట్టాను. అలా గమనిస్తూండగా, ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ కరోనా భాధితుల కోసం చేస్తున్న సహాయాలకు సంబంధించిన అంశాలను గమనించాను. నాకు ప్రభుత్వం ప్రతినెల మూడు వేల రూపాయలు పింఛన్‌గా అందిస్తోంది. నేను నా ఐదు నెలల పింఛన్‌ను దాచిపెట్టాను. అలా దాచిన పదిహేను వేల రూపాయలను సోనూసూద్ ట్రస్ట్‌కు అందచేశాను’’ అంటూ ఎంతో ఆనందంగా చెప్పారు నాగలక్ష్మి. నగదు పంపిన మూడు రోజులు తర్వాత సోనూసూద్.. నాగలక్ష్మికి నేరుగా ఫోన్ చేసి, మూడు నిమిషాల పాటు మాట్లాడారు. ‘‘ఆయన హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాట్లాడారు. ఆయన మాటల్లో ‘యూ ఆర్ రియల్ హీరో. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కబురు పెడతాను, హైదరాబాద్‌లో కలుద్దాం’ అన్న మాటలు మాత్రమే అర్థం అయ్యాయి’’ అంటూ తృప్తిగా తన సంభాషణ ముగించారు నాగలక్ష్మి. – కె.ఎస్, కావలి, సాక్షి నెల్లూరు జిల్లా -
నెల్లూరు జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఆదివారం ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. జిల్లాలోని దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో ఈ రోజు ఉదయం రెండు సార్లు.. కొద్ది సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై రోడ్ల పైకి పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరుగలేదు. -
నెల్లూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు
నెల్లూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో స్వల్ప భూకంపం సంభవించింది. జిల్లాలోని వింజమూరు, వరికుంటపాడు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. దీంతో ప్రజలు భయంతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఎటువంటి నష్టం జరగలేదని తెలుస్తోంది. -
నెల్లూరులో మళ్లీ కంపించిన భూమి
► రెండు సెకన్లపాటు కంపించిన భూమి ► రెండు నెలల వ్యవధిలో ఏడోసారి భూ ప్రకంపనలు ► భయాందోళనలో ప్రజలు నెల్లూరు: నెల్లూరు జిల్లాలో మళ్లీ భూమి కంపించింది. శనివారం సీతారాంపురం, వరికుంటపాడు మండలాల్లో రెండు సెకన్లపాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనలతో ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. రెండు నెలల వ్యవధిలో ఏడోసారి నెల్లూరు జిల్లాలో భూ ప్రకంపనలు వచ్చినట్టు జీయోలిజకల్ నిపుణులు వెల్లడించారు. -
నెల్లూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు
-
నెల్లూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు
నెల్లూరు : నెల్లూరు జిల్లా దుత్తలూరు, వరికుంటపాడు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై... ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. సదరు మండలాల్లోని నర్రవాడ, లక్ష్మీపురం, కమ్మరిపాలెం, బండకింద పల్లి, బోడెవారిపల్లి తదితర గ్రామాల్లో ఈ రోజు ఉదయం 9.10 గంటల ప్రాంతంలో భూమి రెండు సెకన్ల పాటు కంపించింది. వారం రోజుల వ్యవధిలో రెండోసారి సదరు ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. -
నెల్లూరులో స్వల్ప భూకంపం
వరికుంటపాడు(నెల్లూరు): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో శనివారం రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. వరికుంటపాడు మండలంలోని గణేశ్వరాపురం, రామదేవులపాడు, కడియంపాడు గ్రామాలలో ఈ రోజు రాత్రి స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. ఉదయగిరి, దుత్తలూరులలో కూడా భూమి కంపించింది. ఇంట్లో ఉన్న పాత్రలు స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఐదు నిమిషాల వ్యవధిలో మూడు సార్లు ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.