న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి దేశంలో ఎందరో జీవితాలను తలకిందులు చేసిందని సుప్రీంకోర్టు పేర్కొంది. కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల భవిష్యత్తును తలచుకుంటే గుండె తరుక్కుపోతోందని వ్యాఖ్యానించింది. ఆ చిన్నారుల సంరక్షణ, చదువులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పథకాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల సంక్షేమంపై సుమోటోగా విచారణ చేపట్టిన ధర్మాసనం పేర్కొంది. ‘కోవిడ్‌తో కన్నవారిని కోల్పోయిన చిన్నారులకు అండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు ప్రకటించినందుకు సంతోషిస్తున్నాం. ఇటువంటి చిన్నారుల గుర్తించి, వారి తక్షణ అవసరాలు తీర్చేందుకు అధికార యంత్రాంగం ఎంతో కృషి చేసింది’అని సుప్రీంకోర్టు తెలిపింది.
‘లక్ష మందికిపైగా చిన్నారులకు ప్రభుత్వాల రక్షణ అవసరం ఉన్నట్లు బాలల సంక్షేమ కమిటీ(సీడబ్ల్యూసీ)లు తెలిపాయి. మైనర్లకు అవసరమైన పథకాల ప్రయోజనాలు తక్షణం అందేలా చర్యలు తీసుకోవాలి’అని వివరించింది. పీఎం కేర్స్ కింద రిజిస్టరైన బాలల ఫీజులు, ఇతర ఖర్చుల బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని పేర్కొంది. గత ఏడాది మార్చి తర్వాత తల్లిదండ్రులిద్దరినీ లేదా ఎవరో ఒకరిని కోల్పోయిన చిన్నారులను ప్రైవేట్ స్కూళ్లలో చేర్పించి ప్రస్తుత విద్యా సంవత్సరంలో వారి ఫీజులను మాఫీ అయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులిచ్చింది. అదేవిధంగా, ప్రభుత్వాల సాయం అవసరం లేని బాధిత బాలల వివరాలను కూడా సేకరించాలని సీడబ్ల్యూసీలకు సూచించిన ధర్మాసనం.. తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment