హత్యకు గురైన విశ్రాంత ఆర్‌ఐ మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు (ఫైల్)
ప్రశాంతతకు మారుపేరైన జిల్లాలో నేర సంస్కృతి జడలు విప్పుతోంది. పొట్టపోసుకునే వృత్తుల్లాగే ప్రాణాలు తీసే నేర ప్రవృత్తి సమాజంలో వేళ్లూనుకుపోతోంది. హత్యలు వణికిస్తున్నాయి. మహిళలపై అఘాయిత్యాలు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయి. మనం అనే భావన కన్నా నాది అనే స్వార్థం ఎక్కువైంది. కొందరు డబ్బు కోసం మానవత్వం మరిచి ఎంతకైనా తెగిస్తున్నారు.
సాక్షి, నెల్లూరు(క్రైమ్): జిల్లాలో నేరాలు ఏడాదికేడాది పెరిగిపోతున్నాయి. ప్రజలకు భద్రత కరువైందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మారుమూల పల్లెల్లో శాంతిభద్రతల పరిరక్షణ సంగతి దేవుడెరుగు.. హైటెక్ వసతులు, అధికార యంత్రాంగం కేందీకృతమైన నగరం, పట్టణాల్లో సైతం శాంతిభద్రతల పరిరక్షణ కష్టతరంగా మారింది. రోజురోజుకు పెరుగుతున్న నేరప్రవృత్తి, పోలీసుల నిర్లక్ష్యం, ఏళ్ల తరబడి సాగుతున్న కేసుల పరిశోధన వెరసి ప్రజలకు సత్వర న్యాయం అందని ద్రాక్షాలా మారుతోంది. నగరవాసులకు సాధారణ భద్రత కల్పించలేని దుస్థితిలో పోలీసు వ్యవస్థ ఉండడం గమనార్హం. సిబ్బంది, ఆర్థిక, మానవ వనరుల కొరతను పోలీసులు సాకుగా చూపుతున్నప్పటికీ పౌరులకు భద్రత కల్పించాలనే ప్రాథమిక బాధ్యతను విస్మరించే పరిస్థితి తలెత్తుతోంది. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, లైంగికదాడులతో జిల్లాలో శాంతిభద్రతలు క్రమేపీ క్షీణదశకు చేరుకుంటున్నాయి.
కొరవడిన నిఘా..
జాతీయ రహదారిపై వరుస దోపిడీలు, దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి. దీంతో దొంగలు బరితెగిస్తున్నారు. గతంలో వెంకటాచలం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ బంగారు వ్యాపారిపై దాడిచేసి సుమారు మూడు కేజీల బంగారు ఆభరణాలతోపాటు ఆయన కారును దుండగులు దోచుకెళ్లారు. ఘటన జరిగి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకూ ఆచూకీ కనుగొనడంలో పోలీసులు సఫలీకృతులు కాలేదు. ఇటీవల తడ శ్రీసిటీ నుంచి రూ.4.50 కోట్ల వ్యయం చేసే సెల్‌ఫోన్లను తరలిస్తున్న కంటైనర్‌ను దుండగులు దోచుకెళ్లారు. ఇంతవరకూ ఈ కేసులో పురోగతి లేదు. చిన్నాచితకా నేరాలు తరచూ చోటుచేసుకుంటూనే ఉన్నాయి. వీటిని అరికడతామని హైవే పెట్రోలింగ్ ముమ్మరం చేస్తామన్న ఉన్నతాధికారులు మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు.
జనవరి నుంచి చోటుచేసుకున్నవి
- జనవరి 2న నెల్లూరు రాజీవ్‌గాంధీకాలనీలో శ్యామల అనే మహిళ దారుణ హత్యకు గురైంది.
- 8న బాలాయపల్లి మండలం చిలమాసూరుగ్రామ తిప్ప సమీపంలో జి.శ్రీనివాసులు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.
- ఫిబ్రవరి 1వ తేదీన సీతారామపురం పోరుమామళ్లి ఘాట్‌రోడ్డులో దుండగులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి పెట్రోలు పోసి తగులబెట్టారు.
- 9న ఇందుకూరుపేటలో కూతురిని వేధిస్తున్నాడని అల్లుడిని మామ దారుణంగా హత్య చేశాడు.
- 11న చిల్లకూరు మండలం నర్రావారిపాళెంలో వెంకటమ్మ (60) అనే వృద్ధురాలిని కుమారుడు చిన చెంచయ్య చంపేశాడు.
- 11న ప్రశాంతినగర్‌లో సంధ్య అనే మహిళను భర్త మహేష్ అతిదారుణంగా హత్య చేశాడు.
- 12న కోట మండలంలోని వీరారెడ్డిసత్రం కాలనీలో నరేష్ (45) అనే కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
- 13న శ్రీసిటీ నుంచి కోల్‌కత్తాకు రూ.4.50 కోట్లు విలువచేసే సెల్‌ఫోన్లతో బయలుదేరిన కంటైనర్ అపహరణకు గురైంది.
- 19న పొదలకూరు మండలంలో మోటారుబైక్‌పై వెళుతున్న కాంతమ్మ అనే వృద్ధురాలిని బెదిరించి నాలుగు సవర్ల బంగారు గొలుసును లాక్కెళ్లారు.
- 19న లిఫ్ట్ ఇస్తామని బైక్‌పై ఎక్కించుకుని విశ్రాంత ఉద్యోగి నుంచి నాలుగుసవర్ల బంగారు చైన్, రూ.2 వేల నగదు, సెల్‌ఫోన్‌ను దోచుకెళ్లారు.
- 24న రాత్రి నెల్లూరు నగరంలోని రాయపుపాళెం విజయకృష్ణ, అతని కుటుంబసభ్యులపై ప్రత్యర్థులు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడిచేశారు. తీవ్రగాయాలై విజయకృష్ణ మృతిచెందాడు.
- 26న సూళ్లూరుపేట – శ్రీకాళహస్తి మార్గంలోని సంతవేలూరు నుంచి మంగళంపాడకు వెళ్లే రహదారిలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.
- 27న నేతాజీనగర్‌లో విశ్రాంత ఉద్యోగి వసంతకుమారి దారుణ హత్యకు గురైంది. నగలు, డాక్యుమెంట్స్‌ను అపహరించారు.
బాలికలపై..
- జనవరి 9వ తేదీన కోవూరులో బాలికపై యువకుడు లైంగికదాడి యత్నం చేశాడు.
- 12న డక్కిలి మండలంలో మైనర్ బాలికపై లైంగికదాడి యత్నం జరిగింది.
- 28న కావలిలో 12 ఏళ్ల కుమార్తెపై తండ్రి లైంగికదాడి చేసి సభ్యసమాజం తలదించుకునేలా చేశాడు.
- మార్చి 3వ తేదీ రాత్రి తడ మండలంలో పదేళ్ల బాలికను ఓ వ్యక్తి బలవంతంగా తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఏ సంవత్సరంలో ఎన్ని..
నమోదైన కేసులు | 2017 | 2018 | 2019 |
దోపిడి హత్యలు | 8 | 8 | 1 |
హత్యలు | 57 | 61 | 9 |
దోపిడీలు | 33 | 51 | 10 |
పగటి దొంగతనాలు | 84 | 61 | - |
రాత్రి దొంగతనాలు | 290 | 325 | - |
సాధారణ చోరీలు | 835 | 693 | - |
అత్యాచారాలు | 59 | 62 | 10 |
జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.20 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు, నగదును దుండగులు అపహరించారు. రోడ్డు ప్రమాదాల్లో సుమారు 30 మందికిపైగా మృతిచెందారు. పదిమంది దారుణహత్యకు గురయ్యారు. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యం చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. ఒక్కో సమయంలో హత్యలకు వెనుకాడడం లేదు. గతంలో ఉస్మాన్‌సాహెబ్‌పేటలో విశాంత్ర ఆర్జేడీని గుర్తుతెలియని దుండగులు హత్యచేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అపహరించారు. ఈ ఘటనపై పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఇంతవరకూ చిన్నపాటి క్లూ దొరకలేదు. కేసు ఎక్కడివేసిన గొంగళి అక్కడే అన్నచందాన మారింది. తాజాగా నేతాజీనగర్ 6వ వీధిలో విశ్రాంత ఆర్‌ఐ వసంతకుమారి దారుణహత్యకు గురైంది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను దుండగులు అపహరించారు. సూళ్లూరుపేటలో యువతిపై అత్యాచార ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. గంజాయికి అలవాటుపడ్డ కొందరు ఈ దారుణానికి ఒడిగట్టారు. తడ మండలంలో పురుషులపై దాడులకు పాల్పడి, మహిళలపై లైంగిక దాడి చేసే ఓ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గంజాయి మత్తులో ఆ ప్రాంతంలో నేరాలు జరుగుతున్నట్లు పోలీసులు విచారణలో బయటపడింది.
శ్యామల మృతదేహం (ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment