Burglar attack
-
అపార్ట్మెంట్లో చోరీకి విఫలయత్నం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అపార్ట్మెంట్లో ఓ అగంతకుడు చోరీకి విఫలయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే.. దోమల్‌గూడలోని సౌభాగ్య అపార్ట్మెంట్లో సీతా భాగ్యలక్ష్మి(61), జ్యోత్స్న రాణి(66) అనే వృద్ధ మహిళలు నివాసం ఉంటున్నారు. ఈ నెల18వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వారి అపార్ట్మెంట్లోకి ఓ అగంతకుడు చొరబడి గొంతుపై కత్తి పెట్టి వారిని డబ్బులు డిమాండ్ చేశాడు. దిక్కుతోచని మహిళలు గట్టిగా కేకలు వేయడంతో ఇంట్లోనే ఉంటున్న మరో మహిళ మరో కత్తితో అగంతకుడిని బెదిరించింది. దీంతో దుండగుడు ఇద్దరు మహిళలను తీవ్రంగా గాయపరిచి పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. అనంతరం గాయపడిన సీతా భాగ్యలక్ష్మి, జ్యోత్స్న రాణిలను హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్సను అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని కోర్టులో హాజరుపర్చారు. చదవండి: కారుతోపాటు మృతదేహం కాల్చివేత: శ్రీనివాస్ హత్య కేసులో ట్విస్ట్ -
నగల కోసమే చంపేశారా?
సాక్షి, అలంపూర్/ గోపాల్పేట (వనపర్తి): నగల కోసం ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉండవెల్లి స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం హత్యకు గురై దహనమైన వృద్ధురాలి ఆచూకీని కుటుంబ సభ్యులు, ఆమె ఆనవాళ్ల సహాయంతో గుర్తించినట్లు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు. ఓ వృద్ధురాలిని గుర్తుతెలియని దుండగులు ఎక్కడో హత్య చేసి ఉండవెల్లి సమీపంలో జాతీయ రహదారి పక్కన పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ విషయమై సోమవారం పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. పత్రికల్లో కథనాలు చూసిన గోపాల్పేట మండలం ఏదుల గ్రామానికి చెందిన కొమ్ము నర్సయ్య ఆయన కుమారులు పెద్ద సుబ్బయ్య, చిన్న సుబ్బయ్యలు కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి ఉండవల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ ఎస్ఐతో మాట్లాడి తమ వివరాలు తెలిపారు. తన తల్లి కొమ్ము రాజమ్మ(72) కనిపించడం లేదని చెప్పడంతో పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్ ఆస్పత్రిలో ఉన్న వృద్ధురాలి మృతదేహాన్ని చూపించారు. మృతురాలి శరీరంపై ఉన్న పులిపిరి, వేసుకున్న జాకెట్, చేతికి ఉన్న సాధారణ ఉంగరం, మెట్టలు, తల వెంట్రుకల కొప్పు విధానం చూసి తమ తల్లిగా గుర్తించారు. ఈ నెల 16వ తేదీన మందుల తెచ్చుకొనేందుకు వనపర్తికి వెళ్లిందని ఆ రోజు నుంచి ఇంటికి రాలేదన్నారు. పత్రికల్లో వచ్చిన కథనాలు, ఫొటోలు చూసి అనుమానంతో ఇక్కడికి వచ్చి పరిశీలించడంతో తమ తల్లిగా నిర్ధారించుకున్నట్లు వివరించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ షాకీర్‌హుసేన్, సీఐ రాజు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. వారిచ్చిన ఆధారాల మేరకు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే రాజమ్మ ఒంటిపై ఉన్న బంగారం, వెండి నగల కోసమే హత్య చేసి ఉంటారని పోలీసులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. -
పగలు ప్లాన్.. రాత్రి దోపిడీ
సాక్షి, నిజామాబాద్: మళ్లీ దుండగుల అలజడి పెరిగింది. వరుసగా చోరీలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఏదో ఒక చో ట చోరీలు జరుగుతున్నాయి. పోలీసులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో దుండగులు యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతున్నారు. గడిచిన వారం రోజుల్లోనే పదిలోపు చోరీలు జరిగాయంటే పరిస్థి తి ఎంత తీవ్రంగా అర్థం చేసుకోవచ్చు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా దుండగులు రెచ్చిపోతున్నా రు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వేసవి కాలంలో చోరీలు ఎక్కువగా జరిగే అవకా శం ఉండడంతో అవగాహన, ప్రచారం కల్పించాల్సిన పోలీసులు ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉండ డంతో చోరీల నియంత్రణ ఇబ్బందిగా మారింది. ప్రణాళికతోనే చోరీలు... నాలుగు రోజుల కింద కంఠేశ్వర్‌లోని ఓ పైనాన్స్‌లో దుండగులు పడి లాకర్‌ను ఎత్తుకెళ్లారు. సీసీ పుటేజీలను సైతం తీసుకెళ్లారు. షెట్టర్ పగుల గొట్టి చోరీకి పాల్పడ్డారు. కంఠేశ్వర్‌లోని ఆర్మూర్ ప్రధాన రహదారిపైనే ఈ చోరీ జరిగింది. మరో మూడు రోజుల్లోనే ఇదే ప్రధాన రహదారిపై ఉన్న ఓ గ్లాస్ ఎంపోరియం షెట్టర్ పగులగొట్టి చోరీ చేశారు. అంతకు ముందు ఎల్లమ్మగుట్టలో వరుసగా మూడిళ్లలో చోరీలు జరిగాయి. 6వ పోలీసుస్టేషన్ పరిధిలో మరో చోరీ జరిగింది. ప్రధానంగా తాళం వేసిన ఇళ్లలోనే ఈ చోరీలు అవుతున్నాయి. మహారాష్ట్ర ముఠాకు చెందిన దుండగులు ఈ అలజడి సృష్టిస్తున్నట్లు పోలీసులు విచారిస్తున్నారు. గతంలో అపార్ట్మెంట్లతో పాటు పలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన మూటలు మళ్లీ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. గత వారం రోజుల కింద బాల్కొండ, ముప్కాల్ కేంద్రాల్లో షెట్టర్ పగులగొట్టి చోరీలు జరుగగా ఇటీవలే అరెస్టు చేశారు. అయినా చోరీలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో ఆర్మూర్‌లో మహారాష్ట్రకు చెందిన దుండగుల ముఠా వరుసగా రెండు రోజులపాటు దోపిడీ చేసింది. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో గల ఇరిగేషన్ కార్యాలయంలో ఒక కారును అపహరించారు. మహారాష్ట్రకు చెందిన ఈ దుండగులు జిల్లాలో ప్రవేశించి మధ్యాహ్నం పూట రెక్కి నిర్వహిస్తున్నారు. రాత్రివేళ అనుకూలమైన ప్రాంతాల్లో దోపిడీలు చేసేస్తున్నారు. నవీపేట, బోధన్ ప్రాంతాల్లో ఇటీవల చోరీలు పెరిగాయి. జిల్లా కేంద్రంలో చోరీ చేసి పారిపోతూ నవీపేట, బోధన్ ప్రాంతాల్లో అందిన కాడికి దోచుకుంటున్నారని పోలీసులు భావిస్తున్నారు. మహారాష్ట్ర పోలీసుల అదుపులో ఫైనాన్స్ దుండగులు .. వారం రోజుల కింద కంఠేశ్వర్‌లోని ఫైనాన్స్‌లో చోరీ చేసిన దుండగుల ముఠాను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాకు నాయకత్వం వహించిన సాగర్సింగ్ను పోలీసులు విచారించగా ఇతడి గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు నిర్ధారించారు. మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించగా అక్కడ ఈ ముఠాకు సంబం«ధించి సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మంది ముఠా సభ్యులు పరారీలో ఉన్నారని వారికోసం అక్కడి పోలీసులు వేట సాగిస్తున్నారు. పెరుగుతున్న కేసులు.. జిల్లాలో పగటిపూట జరిగిన గత మూడేళ్లలో పరిశీలిస్తే 2015లో 27, 2016లో 33, 2017లో 34, 2018లో 42 నమోదయ్యాయి. రాత్రిపూట జరిగిన చోరీలను పరిశీలిస్తే 2015లో 221, 2016–218, 2017–192, 2018లో 206 చోరీలు జరిగాయి. ఇలాంటి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ప్రస్తుతం ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో పెట్రోలింగ్ పూర్తిస్థాయిలో చేపట్టలేకపోతున్నారు. త్వరలోనే పట్టుకుంటాం.. ఇటీవల జిల్లా కేంద్రంలో చోరీలకు పాల్పడిన ముఠాలను గుర్తిస్తున్నాం. త్వరలోనే పట్టుకుంటాం. కఠిన చర్యలు తప్పవు. చోరీల నివారణకు పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలి. మహారాష్ట్రకు చెందిన ముఠాలు జిల్లా కేంద్రానికి వచ్చి చోరీలకు పాల్పడుతున్నారు. ఇలాంటి చోరీలను పూర్తిస్థాయిలో నివారించేందుకు చర్యలు తీసుకుంటాం.–శ్రీనివాస్‌కుమార్, ఏసీపీ. -
దేవుళ్లకే శఠగోపం!
సాక్షి, కొత్తకోట రూరల్: జల్సాలకు ఆలవాటు పడిన కొందరు ఆలయాలను కూడా వదలడం లేదు. ఇటీవల కురుమూర్తిస్వామి ఆలయంలో చోరీకి పాల్పడిన ఘటన మరవకముందే కొత్తకోటలోని మూడు ఆలయాల్లో దొంగలు హుండీలను పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు పట్టణ శివారులోని వెంకటగిరి, పట్టణంలోని సాయిబాబ, కోట్ల ఆంజనేయస్వామి ఆలయాల్లో హుండీలను ఎత్తుకెళ్లి గ్రామ శివారులోని పొలాల్లో పడేశారు. ఈ క్రమంలో కోట్ల ఆంజనేయస్వామి ఆలయంలో రూ.3 వేల నగదు, సాయిబాబ ఆలయంలో రూ.500, వెంకటగిరి ఆలయంలో అరకిలో వెండి (శఠగోపం)తోపాటు తీర్థం పోసే పాత్ర ఎత్తుకెళ్లారని ఎస్ఐ తెలిపారు. కాగా ఉదయమే ఆయా ఆలయాల్లో తాళాలు పగులగొట్టి ఉండగా వెంటనే ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం అందిం చారు. విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాకేంద్రాలను నుంచి క్లూస్ టీంలు వచ్చి పొలాల్లో పడేసిన హుండీలను పరిశీలించారు. దొంగతనానికి గురైన హుండీలపై ఉన్న వేలిముద్రలను క్లూస్‌టీం సభ్యులు సేకరించారు. మూడు ఆలయాలను వనపర్తి డీఎస్పీ సృజన, సీఐ వెంకటేశ్వర్రావు పరిశీలించి ఎస్ఐతో వివరాలు తెలుసుకున్నారు. -
‘నేర’పురి కేరాఫ్ నెల్లూరు
ప్రశాంతతకు మారుపేరైన జిల్లాలో నేర సంస్కృతి జడలు విప్పుతోంది. పొట్టపోసుకునే వృత్తుల్లాగే ప్రాణాలు తీసే నేర ప్రవృత్తి సమాజంలో వేళ్లూనుకుపోతోంది. హత్యలు వణికిస్తున్నాయి. మహిళలపై అఘాయిత్యాలు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయి. మనం అనే భావన కన్నా నాది అనే స్వార్థం ఎక్కువైంది. కొందరు డబ్బు కోసం మానవత్వం మరిచి ఎంతకైనా తెగిస్తున్నారు. సాక్షి, నెల్లూరు(క్రైమ్): జిల్లాలో నేరాలు ఏడాదికేడాది పెరిగిపోతున్నాయి. ప్రజలకు భద్రత కరువైందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మారుమూల పల్లెల్లో శాంతిభద్రతల పరిరక్షణ సంగతి దేవుడెరుగు.. హైటెక్ వసతులు, అధికార యంత్రాంగం కేందీకృతమైన నగరం, పట్టణాల్లో సైతం శాంతిభద్రతల పరిరక్షణ కష్టతరంగా మారింది. రోజురోజుకు పెరుగుతున్న నేరప్రవృత్తి, పోలీసుల నిర్లక్ష్యం, ఏళ్ల తరబడి సాగుతున్న కేసుల పరిశోధన వెరసి ప్రజలకు సత్వర న్యాయం అందని ద్రాక్షాలా మారుతోంది. నగరవాసులకు సాధారణ భద్రత కల్పించలేని దుస్థితిలో పోలీసు వ్యవస్థ ఉండడం గమనార్హం. సిబ్బంది, ఆర్థిక, మానవ వనరుల కొరతను పోలీసులు సాకుగా చూపుతున్నప్పటికీ పౌరులకు భద్రత కల్పించాలనే ప్రాథమిక బాధ్యతను విస్మరించే పరిస్థితి తలెత్తుతోంది. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, లైంగికదాడులతో జిల్లాలో శాంతిభద్రతలు క్రమేపీ క్షీణదశకు చేరుకుంటున్నాయి. కొరవడిన నిఘా.. జాతీయ రహదారిపై వరుస దోపిడీలు, దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి. దీంతో దొంగలు బరితెగిస్తున్నారు. గతంలో వెంకటాచలం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ బంగారు వ్యాపారిపై దాడిచేసి సుమారు మూడు కేజీల బంగారు ఆభరణాలతోపాటు ఆయన కారును దుండగులు దోచుకెళ్లారు. ఘటన జరిగి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకూ ఆచూకీ కనుగొనడంలో పోలీసులు సఫలీకృతులు కాలేదు. ఇటీవల తడ శ్రీసిటీ నుంచి రూ.4.50 కోట్ల వ్యయం చేసే సెల్ఫోన్లను తరలిస్తున్న కంటైనర్‌ను దుండగులు దోచుకెళ్లారు. ఇంతవరకూ ఈ కేసులో పురోగతి లేదు. చిన్నాచితకా నేరాలు తరచూ చోటుచేసుకుంటూనే ఉన్నాయి. వీటిని అరికడతామని హైవే పెట్రోలింగ్ ముమ్మరం చేస్తామన్న ఉన్నతాధికారులు మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు. జనవరి నుంచి చోటుచేసుకున్నవి జనవరి 2న నెల్లూరు రాజీవ్‌గాంధీకాలనీలో శ్యామల అనే మహిళ దారుణ హత్యకు గురైంది. 8న బాలాయపల్లి మండలం చిలమాసూరుగ్రామ తిప్ప సమీపంలో జి.శ్రీనివాసులు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఫిబ్రవరి 1వ తేదీన సీతారామపురం పోరుమామళ్లి ఘాట్‌రోడ్డులో దుండగులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి పెట్రోలు పోసి తగులబెట్టారు. 9న ఇందుకూరుపేటలో కూతురిని వేధిస్తున్నాడని అల్లుడిని మామ దారుణంగా హత్య చేశాడు. 11న చిల్లకూరు మండలం నర్రావారిపాళెంలో వెంకటమ్మ (60) అనే వృద్ధురాలిని కుమారుడు చిన చెంచయ్య చంపేశాడు. 11న ప్రశాంతినగర్‌లో సంధ్య అనే మహిళను భర్త మహేష్ అతిదారుణంగా హత్య చేశాడు. 12న కోట మండలంలోని వీరారెడ్డిసత్రం కాలనీలో నరేష్ (45) అనే కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. 13న శ్రీసిటీ నుంచి కోల్‌కత్తాకు రూ.4.50 కోట్లు విలువచేసే సెల్ఫోన్లతో బయలుదేరిన కంటైనర్ అపహరణకు గురైంది. 19న పొదలకూరు మండలంలో మోటారుబైక్పై వెళుతున్న కాంతమ్మ అనే వృద్ధురాలిని బెదిరించి నాలుగు సవర్ల బంగారు గొలుసును లాక్కెళ్లారు. 19న లిఫ్ట్ ఇస్తామని బైక్‌పై ఎక్కించుకుని విశ్రాంత ఉద్యోగి నుంచి నాలుగుసవర్ల బంగారు చైన్, రూ.2 వేల నగదు, సెల్‌ఫోన్‌ను దోచుకెళ్లారు. 24న రాత్రి నెల్లూరు నగరంలోని రాయపుపాళెం విజయకృష్ణ, అతని కుటుంబసభ్యులపై ప్రత్యర్థులు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడిచేశారు. తీవ్రగాయాలై విజయకృష్ణ మృతిచెందాడు. 26న సూళ్లూరుపేట – శ్రీకాళహస్తి మార్గంలోని సంతవేలూరు నుంచి మంగళంపాడకు వెళ్లే రహదారిలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. 27న నేతాజీనగర్‌లో విశ్రాంత ఉద్యోగి వసంతకుమారి దారుణ హత్యకు గురైంది. నగలు, డాక్యుమెంట్స్‌ను అపహరించారు. బాలికలపై.. జనవరి 9వ తేదీన కోవూరులో బాలికపై యువకుడు లైంగికదాడి యత్నం చేశాడు. 12న డక్కిలి మండలంలో మైనర్ బాలికపై లైంగికదాడి యత్నం జరిగింది. 28న కావలిలో 12 ఏళ్ల కుమార్తెపై తండ్రి లైంగికదాడి చేసి సభ్యసమాజం తలదించుకునేలా చేశాడు. మార్చి 3వ తేదీ రాత్రి తడ మండలంలో పదేళ్ల బాలికను ఓ వ్యక్తి బలవంతంగా తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఏ సంవత్సరంలో ఎన్ని.. నమోదైన కేసులు 2017 2018 2019 దోపిడి హత్యలు 8 8 1 హత్యలు 57 61 9 దోపిడీలు 33 51 10 పగటి దొంగతనాలు 84 61 - రాత్రి దొంగతనాలు 290 325 - సాధారణ చోరీలు 835 693 - అత్యాచారాలు 59 62 10 జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.20 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు, నగదును దుండగులు అపహరించారు. రోడ్డు ప్రమాదాల్లో సుమారు 30 మందికిపైగా మృతిచెందారు. పదిమంది దారుణహత్యకు గురయ్యారు. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యం చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. ఒక్కో సమయంలో హత్యలకు వెనుకాడడం లేదు. గతంలో ఉస్మాన్‌సాహెబ్‌పేటలో విశాంత్ర ఆర్జేడీని గుర్తుతెలియని దుండగులు హత్యచేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అపహరించారు. ఈ ఘటనపై పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఇంతవరకూ చిన్నపాటి క్లూ దొరకలేదు. కేసు ఎక్కడివేసిన గొంగళి అక్కడే అన్నచందాన మారింది. తాజాగా నేతాజీనగర్ 6వ వీధిలో విశ్రాంత ఆర్ఐ వసంతకుమారి దారుణహత్యకు గురైంది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను దుండగులు అపహరించారు. సూళ్లూరుపేటలో యువతిపై అత్యాచార ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. గంజాయికి అలవాటుపడ్డ కొందరు ఈ దారుణానికి ఒడిగట్టారు. తడ మండలంలో పురుషులపై దాడులకు పాల్పడి, మహిళలపై లైంగిక దాడి చేసే ఓ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గంజాయి మత్తులో ఆ ప్రాంతంలో నేరాలు జరుగుతున్నట్లు పోలీసులు విచారణలో బయటపడింది. శ్యామల మృతదేహం (ఫైల్) -
దొంగ దాడిలో కానిస్టేబుల్ మృతి
సాక్షి, ముంబై: వాడి బందర్లోని ఒక గెస్ట్‌హౌస్‌లో దొంగతనానికి వెళ్లిన వ్యక్తిని పట్టుకునేందుకు యత్నించిన పోలీసు అదే దొంగ కర్రతో చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం తెల్లవారుజామున వాడి బందర్ లోని పిడిమెల్లో రోడ్‌లోని ఒక గెస్ట్‌హౌస్‌లో సాల్వి అనే దొంగ చొరబడ్డాడు. గమనించిన స్థానికులు డోంగ్రీ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులను చూసిన సాల్వి ఒక గదిలో దూరి లోపలివైపు నుంచి గొళ్లెం పెట్టుకున్నాడు. తర్వాత గదిని చుట్టుముట్టిన పోలీసులపై రాళ్లతో దాడిచేశాడు. ఆ దాడిలో ఒక పోలీసుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో గావంద్ అనే పోలీస్ అధికారి రెండవ అంతస్తులోని టైమీదకు వెళ్లాడు. అతడిని స్థానిక వాసి అయిన ఖాన్ అనుసరించాడు. అప్పటికే గదిలోంచి బయటకు వచ్చి టై మీదుగా బయటకు పారిపోయేందుకు యత్నిస్తున్న సాల్విని ఇద్దరూ పట్టుకోవడానికి ప్రయత్నించారు. వాళ్లకు దొరక్కుండా పారిపోయిన సాల్వి చేతికి దొరికిన పెద్ద కట్టె తీసుకుని గావంద్ తలమీద కొట్టడంతో అతడు కిందపడిపోయాడు. ఈలోగా మరో పోలీసు, ఖాన్ కలిసి దొంగను పట్టుకోగలిగారు. గావంద్ను జేజే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యు లు ధృవీకరించారు. కాగా, విధినిర్వహణలో మృతిచెందిన గావంద్ కుటుంబానికి తగిన పరిహారం చెల్లిస్తామని, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని అడిషనల్ పోలీస్ కమిషనర్ (సౌత్) కృష్ణ ప్రకాష్ తెలిపారు.