రాజమ్మ (ఫైల్)
సాక్షి, అలంపూర్/ గోపాల్‌పేట (వనపర్తి): నగల కోసం ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉండవెల్లి స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం హత్యకు గురై దహనమైన వృద్ధురాలి ఆచూకీని కుటుంబ సభ్యులు, ఆమె ఆనవాళ్ల సహాయంతో గుర్తించినట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు. ఓ వృద్ధురాలిని గుర్తుతెలియని దుండగులు ఎక్కడో హత్య చేసి ఉండవెల్లి సమీపంలో జాతీయ రహదారి పక్కన పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ విషయమై సోమవారం పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి.
పత్రికల్లో కథనాలు చూసిన గోపాల్‌పేట మండలం ఏదుల గ్రామానికి చెందిన కొమ్ము నర్సయ్య ఆయన కుమారులు పెద్ద సుబ్బయ్య, చిన్న సుబ్బయ్యలు కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి ఉండవల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ ఎస్‌ఐతో మాట్లాడి తమ వివరాలు తెలిపారు. తన తల్లి కొమ్ము రాజమ్మ(72) కనిపించడం లేదని చెప్పడంతో పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్ ఆస్పత్రిలో ఉన్న వృద్ధురాలి మృతదేహాన్ని చూపించారు. మృతురాలి శరీరంపై ఉన్న పులిపిరి, వేసుకున్న జాకెట్, చేతికి ఉన్న సాధారణ ఉంగరం, మెట్టలు, తల వెంట్రుకల కొప్పు విధానం చూసి తమ తల్లిగా గుర్తించారు.
ఈ నెల 16వ తేదీన మందుల తెచ్చుకొనేందుకు వనపర్తికి వెళ్లిందని ఆ రోజు నుంచి ఇంటికి రాలేదన్నారు. పత్రికల్లో వచ్చిన కథనాలు, ఫొటోలు చూసి అనుమానంతో ఇక్కడికి వచ్చి పరిశీలించడంతో తమ తల్లిగా నిర్ధారించుకున్నట్లు వివరించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ షాకీర్‌హుసేన్, సీఐ రాజు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. వారిచ్చిన ఆధారాల మేరకు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే రాజమ్మ ఒంటిపై ఉన్న బంగారం, వెండి నగల కోసమే హత్య చేసి ఉంటారని పోలీసులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment