
సాక్షి, నెల్లూరు: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అవసరం అయిన అన్ని చర్యలు తీసుకుంటోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. గురువారం నెల్లూరులో ఆయన కరోనాపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆస్పత్రుల్లో అందుతున్న సేవలు, కావల్సిన సదుపాయాలపై చర్చించారు. అనంతరం మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడూ పరిస్థితిని సమీక్షిస్తూ సూచనలు ఇస్తున్నారన్నారు.
ప్రజారోగ్యమే లక్ష్యంగా రాష్ట్రంలో అత్యధికంగా కరోనా పరీక్షలు చేస్తున్నామని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. దేశంలోనే అత్యధికంగా పరీక్షలు చేస్తూ వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు కూడా అధికంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. కోవిడ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ. 350 కోట్లను వెచ్చిస్తోందని వెల్లడించారు. ఆసుపత్రులలో బాధితులకు మెరుగైన వసతులు కల్పించి సేవలందిస్తున్నామని ఆయన చెప్పారు.
కరోనాపై ప్రజలు ఆందోళన పడాల్సిన పని లేదని, ప్లాస్మా థెరపీపై ఎలాంటి అపోహలు వద్దన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు, అర్హులైన వారంతా ప్లాస్మా దానం కోసం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్లాస్మా దానం చేసే వారికి 5 వేల రూపాయల ప్రోత్సాహకాన్ని కూడా ఇస్తున్నామని తెలిపారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించి ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనపై నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment