పైలాన్ ఏర్పాటుకు భూమి పూజ చేస్తున్న మంత్రి ఆళ్ల నాని, హోం మంత్రి సుచరిత, జెడ్పీ చైర్‌పర్సన్ క్రిస్టీనా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
గుంటూరు మెడికల్: మన రాష్ట్రానికి ఏ వేవ్ వచ్చినా, ఎలాంటి వేరియంట్ వచ్చినా ఎదుర్కొనేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉందని ఆ శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు చెప్పారు. వైద్య కళాశాల ప్రారంభమై 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా త్వరలో జరగనున్న ప్లాటినం జూబ్లీ వేడుకలకు గుర్తుగా కళాశాలలో సోమవారం పైలాన్‌కు శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ పైలాన్‌కు శంకుస్థాపన చేయడం వైద్య, ఆరోగ్యశాఖలో చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ పైలాన్‌ను సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. 1946లో టంగుటూరి ప్రకాశం పంతులు చొరవతో గుంటూరు వైద్య కళాశాల ఏర్పడిందని, ఇక్కడ వైద్య విద్యను అభ్యసించిన ఎంతో మంది దేశ, విదేశాల్లో ప్రముఖ వైద్యులుగా స్థిరపడిపోయి దేశానికి మంచి పేరు తెస్తున్నట్టు తెలిపారు.
వైద్య కళాశాల, జీజీహెచ్‌పై సీఎం ప్రత్యేక దృష్టి
గుంటూరు వైద్య కళాశాల, జీజీహెచ్‌పై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పారు. నాడు–నేడు కార్యక్రమంలో కళాశాల, ఆస్పత్రిలో పలు వార్డుల ఆధునికీకరణ, నూతన వైద్య విభాగాల నిర్మాణం కోసం సీఎం రూ.500 కోట్లు కేటాయించి.. నిర్మాణాలు చేయిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి టీచింగ్ ఆస్పత్రుల వరకూ రూ.1,600 కోట్లతో అభివృద్ధి చేసేందుకు సీఎం శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్, మహమ్మద్ ముస్తఫా, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కేఎస్ లక్ష్మణరావు, మేయర్ మనోహర్‌నాయుడు, డెప్యూటీ మేయర్ షేక్ సజీలా, జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టీనా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment